• facebook
  • whatsapp
  • telegram

నీట్‌లో ప్ర‌తిభ చాటిన గురుకుల విద్యార్థులు

* పరీక్షకు 560 మంది హాజరు

* 190 మందికి సీట్లు వచ్చే అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌:
వైద్యవిద్య ప్రవేశపరీక్ష నీట్‌లో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 190 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేటగిరీ, జనరల్‌ ర్యాంకులు సాధించారు. ఎస్సీ సొసైటీ నుంచి 142 మంది, ఎస్టీ సొసైటీ నుంచి 48 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్‌ లేదా బీడీఎస్‌ సీట్లు లభించే అవకాశముందని సొసైటీల కార్యదర్శి  ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. ‘‘నిరుపేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభతో మంచి ర్యాంకులు పొందారు. గిరిజన విద్యార్థి దేజావత్‌ గిరిజ ఎస్టీ కేటగిరీలో 85వ ర్యాంకు సాధించారు. పరీక్షకు కొన్నిరోజుల ముందు కరోనా సోకినా పరీక్ష రాసిన అభిలాష్‌ ఎస్సీ కేటగిరిలో 168 ర్యాంకు పొందారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా ఆపరేషన్‌ బ్లూక్రిస్టల్‌, ఆపరేషన్‌ ఎమరాల్డ్‌ కింద మెరుగైన శిక్షణ అందించాం. కూలీ కుటుంబం నుంచి వచ్చిన కె.వంశీధర్‌ 554 మార్కులు పొంది ఎంబీబీఎస్‌ సీటుకు అర్హత సాధించారు. తిండికి ఇబ్బంది పడ్డ నల్గొండ జిల్లాకు చెందిన వై.పూజిత 532 మార్కులు (కేటగిరీ ర్యాంకు 1969) తెచ్చుకున్నారు. సిరిసిల్లకు చెందిన కె.నిక్షిప్త 535 మార్కులు పొందారు. ఆమె తల్లి ఇళ్లలో వంటపని చేస్తున్నారు’’ అని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలో 180 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 3,840 మంది విద్యార్థులు బైపీసీ కోర్సును అభ్యసిస్తున్నారు. వీరిలో నీట్‌ పరీక్షకు 560 మంది విద్యార్థులు హాజరయ్యారని సొసైటీ వర్గాలు వెల్లడించాయి. ఎస్సీ సొసైటీ నుంచి 350 మంది, ఎస్టీ సొసైటీ నుంచి 210 మంది పరీక్ష రాశారని వివరించారు.

కేటీఆర్‌ అభినందనలు
నీట్‌లో ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్థులను, సొసైటీల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ను మంత్రి కేటీ రామారావు అభినందించారు. 2012-13లో ఉమ్మడి రాష్ట్రంలో మూడు ఎంబీబీఎస్‌ సీట్లను మాత్రమే గురుకుల విద్యార్థులు సాధించగా.. ఈ ఏడాది రాష్ట్రంలో 190 మంది సీట్లను పొందనున్నారని ప్రవీణ్‌కుమార్‌ ట్విటర్‌లో తెలపగా కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Posted Date : 18-10-2020 .