• facebook
  • whatsapp
  • telegram

పారా మెడికల్‌ కోర్సుల నిర్వహణపై ప్రతిష్టంభన

* రెండేళ్లుగా సాగని ప్రక్రియ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పారా మెడికల్‌ కోర్సుల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కోర్సుల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల రెండేళ్లుగా ప్రవేశాల్లేవు. 2020-21లోనైనా  చేపడతారని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పారామెడికల్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటున్నాయి. కరోనా చికిత్సను అందిస్తోన్న ఆసుపత్రుల్లో కొందరికి ఇప్పటికే కొలువులు లభించాయి.  

17 కోర్సులు.. 47 వేల సీట్లు
పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ చదివిన వారికి ప్రాధాన్యమిస్తారు. ఇమేజింగ్‌ టెక్నాలజీ, డయాలసిస్‌ టెక్నాలజీ, ఈసీజీ టెక్నీషియన్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, డిప్లొమా అనస్తీషియా, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌, డిప్లొమా ఇన్‌ మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌, డిప్లొమా ఇన్‌ క్యాథ్‌లాబ్‌ టెక్నాలజీ సహా 17 కోర్సులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సుమారు 3 వేలు, ప్రైవేటు సంస్థల్లో 44 వేలదాకా సీట్లున్నాయి.

ఓ అధికారి వైఖరితో...
పారా మెడికల్‌ బోర్డు నుంచి గుర్తింపు పొందిన సంస్థల్లో 2017-18 ముందు దాకా ప్రవేశాలు జరిగాయి. ఇవికాకుండా అదనంగా 234 ప్రైవేట్‌ సంస్థల్లో ప్రవేశాలకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అనుమతి లేకుండా ఓ అధికారి ఉత్తర్వులివ్వడం వివాదాస్పదమైంది. దీనిపై న్యాయ పోరాటం సాగుతోంది. వివాదాస్పద సంస్థల్ని మినహాయించి మిగిలిన వాటిలో ప్రవేశాలకు అవకాశం ఉన్నా వైద్యఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు తెలంగాణలో చదివేందుకు వెళ్లిపోతున్నారు. 2020-21 విద్యా సంవత్సరంలోనైనా ప్రవేశాలు చేపట్టాలని పారా మెడికల్‌ యజమాన్య సంఘాల నేతలు సురేష్‌రెడ్డి, బి.ఎం.రత్నం ప్రభుత్వాన్ని కోరారు. ప్రవేశాల నిర్వహణ అంశాన్ని ప్రభుత్వ ఆమోదానికి నివేదించినట్లు పారా మెడికల్‌ బోర్డు కార్యదర్శి డాక్టర్‌ షాలినీ దేవి తెలిపారు. మరోపక్క పారా మెడికల్‌ బోర్డులో నిబంధనల ఉల్లంఘన సాగుతోందని, దీనిని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోనికి తేవాలని, ప్రవేశాలు, పరీక్షలు, జవాబుపత్రాల మూల్యాంకనం, ఇతర విధానాల అమలును సమీక్షించాలంటూ రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ పలు సూచనలు చేసింది.

Posted Date : 18-10-2020 .