• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష వాయిదా వేయండి

* అయిదు ప్రశ్నల జవాబుల్ని పునఃపరిశీలించండి
* తర్వాత అర్హుల కొత్త జాబితాను తయారు చేయండి
* ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు
* ప్రిలిమినరీని రద్దు చేయాలన్న పిటిషన్‌ కొట్టివేత

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 ప్రాథమిక(ప్రిలిమినరీ) పరీక్షలో దొర్లిన తప్పులను సరిదిద్దుకునేందుకు వీలుకల్పిస్తూ నవంబరు 2న జరగాల్సిన ప్రధాన(మెయిన్స్‌) పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. అయిదు ప్రశ్నల విషయంలో జవాబులను పునఃపరిశీలించి, వాటి ఆధారంగా అర్హుల తాజా జాబితాను తయారు చేయాలంది. కొత్తగా అర్హత సాధించిన వారిని సైతం ప్రధాన పరీక్షకు అనుమతించాలని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు అక్టోబ‌రు 22న‌ కొన్ని వ్యాజ్యాల్లో ఈమేరకు తీర్పు ఇచ్చారు. మరోవైపు ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలని, దివ్యాంగులు తదితరులకు పోస్టుల భర్తీలో రిజర్వేషన్‌ కల్పించాలంటూ దాఖలైన మరికొన్ని వ్యాజ్యాలను కొట్టేశారు. 2018 డిసెంబరులో 169 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన జారీచేసింది. ప్రాథమిక పరీక్షను 2019 మే 26న నిర్వహించగా ఫలితాలనూ వెల్లడించారు. ప్రిలిమినరీ ప్రశ్నపత్రంలోని మొత్తం 120 ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి అనువదించడంలో 51 తప్పులు దొర్లాయని... ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తప్పులున్న ప్రశ్నలను తొలగించి ప్రతిభావంతుల జాబితాను తయారు చేసేలా ఆదేశించాలని మరికొందరు, ఈ వ్యవహారం తేలేంత వరకు నవంబరు 2న జరగనున్న ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ఇంకొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయం వెల్లడిస్తూ... అయిదు ప్రశ్నల విషయంలో మాత్రమే జవాబులను పునఃపరిశీలించి అర్హుల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నవంబరు 2న జరగాల్సిన ప్రధాన పరీక్షను వాయిదా వేయాలంది. ప్రధాన పరీక్షను ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని ఏపీపీఎస్సీకే వదిలేసింది. 

29న గ్రూప్‌-1 మెయిన్స్‌ కొత్త తేదీల వెల్లడి: ఏపీపీఎస్సీ

హైకోర్టు ఆదేశం మేరకు గ్రూపు-1 మెయిన్స్‌ను వాయిదా వేస్తున్నామని, పరీక్షల కొత్త తేదీలను అక్టోబ‌రు 29న ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. నిర్దేశిత ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదిస్తామని, వాటిని ఖరారు చేసిన అనంతరం కొత్తగా అర్హత సాధించే వారిని మాత్రమే ప్రధాన పరీక్షలకు అనుమతిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు స్పష్టంచేశారు. ఇప్పటికే అర్హత సాధించిన సుమారు 8 వేల మంది అభ్యర్థుల జాబితాలో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. అయితే... అదనంగా అర్హత సాధించే వారు తక్కువ సంఖ్యలోనే ఉంటారని భావిస్తున్నారు. వారి సన్నద్ధతకు కాస్త సమయం ఇచ్చే అవకాశముంది. జనవరిలో జరిగే సివిల్స్‌ మెయిన్స్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంకు ఉద్యోగాల నియామక రాత పరీక్షల తేదీలను పరిశీలించాకే కొత్త తేదీలను ప్రకటిస్తారు.

Posted Date : 22-10-2020 .