• facebook
  • whatsapp
  • telegram

స్కూల్‌ అసిస్టెంట్‌, సహాయ ప్రొఫెసర్‌ పరీక్ష ఫలితాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌(హిందీ), వైద్యవిద్య డైరెక్టరేట్‌లో సహాయ ప్రొఫెసర్‌(క్లినికల్‌) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ  అక్టోబ‌రు 22న‌ విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్‌(హిందీ) కేటగిరీలో 158, సహాయ ప్రొఫెసర్‌(క్లినికల్‌) కేటగిరీలో 167 పోస్టులు కలిపి మొత్తం 325 పోస్టుల భర్తీకి కమిషన్‌ ప్రకటన జారీ చేసి పరీక్షలను నిర్వహించింది. ఆ ఫలితాల వివరాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ‘‘పాఠశాలల్లో 158 స్కూల్‌ అసిస్టెంట్‌(హిందీ) పోస్టుల కోసం రాతపరీక్ష నిర్వహించి 148 పోస్టులను భర్తీ చేశాం. సరైన అభ్యర్థులు లేక 3 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. కోర్టు కేసులతో 2 పోస్టుల ఫలితాలు ఇవ్వలేదు. దివ్యాంగ కేటగిరీలోని ఐదు పోస్టుల ఫలితాలను వైద్యపరీక్షల నివేదికల తరువాత ప్రకటిస్తాం’’ అని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సహాయ ప్రొఫెసర్‌(క్లినికల్‌) కేటగిరీలో 167 పోస్టులకుగాను 107 భర్తీ అయ్యాయని వివరించింది. 59 పోస్టులు మిగిలిపోయాయని, మరో పోస్టు ఫలితాన్ని తరవాత ప్రకటిస్తామని పేర్కొంది.
పరీక్ష వాయిదా: వెటర్నరీ యూనివర్సిటీలో వెటర్నరీ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నవంబరు 7వ తేదీన నిర్వహించతలపెట్టిన పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ పరీక్ష తేదీని నవంబరు 13వ తేదీకి మార్చినట్లు వివరించింది.

Posted Date : 23-10-2020 .