• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ సీటు దక్కేదెలా?

* 600 కళాశాలల అనుమతుల నిలిపివేత

 

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో  తాము కోరుకునే కళాశాలలు కనిపించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా నిట్‌, ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌లలో మంచి ర్యాంకులు వచ్చే కళాశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థి భవిష్యత్తును మార్చే దశ కావడంతో ఇందుకు ఎంతో ప్రణాళికతో వ్యవహరిస్తారు. ఇలాంటి సమయంలో వారు కావాలనుకుంటున్న కళాశాలలు ఆన్‌లైన్‌ జాబితాలో లేకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నారు. అగ్నిమాపక ధ్రువపత్రాలు లేవని, వాణిజ్య సముదాయాల్లో కళాశాలలు ఉన్నాయంటూ రాష్ట్రంలో 600 కళాశాలల అనుమతులు నిలిపివేయడంతో ఆన్‌లైన్‌లో ప్రముఖ కళాశాలల జాడలేకుండా పోయింది. ఒక పక్క కళాశాలల సంఖ్య తగ్గించగా.. మరోపక్క గతంలో సెక్షన్‌కు 88సీట్లు ఉండగా.. దీన్ని 40కి తగ్గించారు. ఈ ఉత్తర్వును హైకోర్టు సస్పెండ్‌ చేయగా.. దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  
నగరాల్లో గందరగోళం
  సీట్ల సంఖ్యను తగ్గించిన అధికారులు అదే స్థాయిలో పట్టణాలు, నగరాల్లో సీట్లను అందుబాటులోకి తీసుకురాలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపే కళాశాలలు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో చాలా మంది కళాశాల ఎంపిక ఐచ్ఛికాలు ఇవ్వకుండా ఎదురుచూస్తున్నారు. తమ పిల్లల్ని చదివించేందుకు ఎక్కడికి వెళ్లాల్సి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో ర్యాంకుల కళాశాలలకు సంబంధించి రెండు బ్రాంచిలు మాత్రమే ఉండగా.. గుంటూరులో ఒక్కటీ లేదు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలాంటి నగరాల్లో బోధన బాగుంటుందనే ఉద్దేశంతో ఇతర జిల్లాలకు చెందిన వారు ఇక్కడ ప్రవేశాలు పొందుతారు. ఇంటర్‌తోపాటు ఐఐటీ, నీట్‌ కోచింగ్‌ల కోసం ఎక్కువ మంది విద్యార్థులు ఈ నగరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. చదువు బాగుండే కళాశాలలు లేకుండా.. ఇతర కళాశాలల్లో సీట్లు ఉంటే ఏం ప్రయోజనమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది సుమారు 58వేల మంది వరకు విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ ఇంటర్‌ విద్యామండలి వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 55వేల సీట్లు ఉన్నాయి. కృష్ణాలో సుమారు 56వేల మంది వరకు పదోతరగతి వారు బయటకు రాగా.. ఇక్కడ 65వేల సీట్లు ఉన్నట్లు చూపుతున్నా ర్యాంకుల కళాశాలలు ఆన్‌లైన్‌లో లేవు.
ఫీజులపైనా అస్పష్టం..
  జూనియర్‌ ఇంటర్‌కు ఫీజులను నిర్ణయించలేదు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో ఇంటర్‌ విద్యామండలి నిర్ణయించిన ఫీజు ప్రథమ సంవత్సరానికి రూ.3,119 ఉండగా.. ఇది తమకు గిట్టుబాటు కాదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో ప్రైవేటులోనూ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. కోర్సుల వారీగా రిజర్వేషన్‌ సీట్లు ఉంటాయి. ఒకవేళ ఆ వర్గాల వారు ఎవ్వరూ ప్రవేశం పొందకపోతే రెండు, మూడు కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్‌ నుంచి ఓపెన్‌కు మార్పు చేస్తారు.
ప్రత్యామ్నాయం ఏదీ?
  బోధన బాగుండే కళాశాలలకే విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర విద్యా సంస్థల్లో సీట్లు ఉన్నా ప్రవేశం పొందేందుకు ఆసక్తి చూపడం లేదు. ఐఐటీ, నిట్‌, నీట్‌, ఎంసెట్‌ల్లో మంచి ర్యాంకులు, ఉత్తమ బోధనకు మంచి విద్యా సంస్థలే అవసరమని భావిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సమస్యల కారణంగా ఇక్కడ చేరేందుకు మధ్యతరగతి, ఆపై వారు ఇష్టపడడం లేదు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సౌకర్యాలు లేకపోగా బోధన సిబ్బంది కొరత వెంటాడుతోంది. చాలా చోట్ల ఒప్పంద, అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలో 84 కళాశాలల్లో శాశ్వత అధ్యాపకులు లేరు. రాష్ట్రంలోని 473 జూనియర్‌ కళాశాలలకుగాను 200 కళాశాలలకు ప్రిన్సిపళ్లు లేరు. 3,729 మంది ఒప్పంద, 1,081 మంది అతిథి అధ్యాపకులు బోధిస్తున్నారు.

Posted Date : 24-10-2020 .