• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

ఈనాడు, దిల్లీ:  అక్టోబరు  4న జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ  23న విడుదల చేసింది. ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 8న జరిగే మెయిన్స్‌ పరీక్ష కోసం డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌-1 (డీఏఎఫ్‌-1)ని మరోసారి దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్‌సీ వెల్లడించింది. ఈ దరఖాస్తు యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అక్టోబర్‌ 28 నుంచి నవంబరు 11 సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. డీఏఎఫ్‌-1 దరఖాస్తు భర్తీచేయడానికి ముందు ఆ వెబ్‌సైట్‌లోని సంబంధిత పేజీలో పేరు నమోదుచేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్షలకు 3-4 వారాలకు ముందు అడ్మిట్‌కార్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఒకసారి డీఏఎఫ్‌-1 దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థుల చిరునామా, ఈమెయిల్‌, ఫోన్‌నెంబర్‌లలో మార్పులు ఉంటే ఆ విషయాన్ని కమిషన్‌కు తెలియజేయాలని సూచించింది. అభ్యర్థుల సహాయార్థం దిల్లీలోని షాజహాన్‌రోడ్డులోని ధోల్‌పూర్‌హౌస్‌ యూపీఎస్‌సీ క్యాంపస్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటుచేసినట్లు పేర్కొంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కి సంబంధించి ఏదైనా సమాచారం, వివరణ కావాల్సిన వారు పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో 011-23385271, 011-23098543, 011-23381125 నెంబర్లకు ఫోన్‌ చేయొచ్చని యూపీఎస్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది.

Posted Date : 24-10-2020 .