• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఎంసెట్‌ (అగ్రి) ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్‌ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ విభాగాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన విద్యార్థిని గుత్తి చైతన్య మొదటి ర్యాంకు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

 

సెప్టెంబర్‌ 28, 29వ తేదీల్లో జరిగిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ విభాగం పరీక్షకు 63,857 మంది అభ్యర్థులు హాజరుకాగా 59,113 మంది ఉత్తీ్ర్ణులయ్యారు. ఎంసెట్‌ అగ్రికల్చర్‌లో 92.57 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పాపిరెడ్డి తెలిపారు. నవంబర్‌లో కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.

 

తొలి 10 ర్యాంకర్లు వీరే..
1. గుత్తి చైతన్య సింధు (ఏపీ విద్యార్థిని)
2. మారెడ్డి సాయి త్రిషా రెడ్డి (సంగారెడ్డి)
3. తుమ్మల స్నికిత (మెడికల్ జాతీయ స్థాయి 3వ ర్యాంకు సాధించిన విద్యార్థిని, హైదరాబాద్)
4. దర్శి విష్ణు సాయి (నెల్లూరు)
5. మల్లిడి రిషిత్ (ఖమ్మం)
6. శ్రీమల్లిక్ చిగురుపాటి (హైదరాబాద్)
7. ఆవుల‌ సుభాన్ (హైదరాబాద్‌)
8. గారపాటి గుణ చైతన్య (కర్నూలు)
9. గిండేటి వినయ్ కుమార్ (చిత్తూరు)
10.కోట వెంకట్ (కృష్ణా)


Posted Date : 24-10-2020 .