• facebook
  • whatsapp
  • telegram

నీట్‌ తరహాలోనే నర్సింగ్‌కూ ప్రవేశ పరీక్ష

* జాతీయ స్థాయిలో అర్హత నమోదు
* కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా బిల్లు

ఈనాడు- హైదరాబాద్‌: నర్సింగ్‌ విద్యలో నూతన మార్పులకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. వైద్యవిద్యలో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో నీట్‌ పరీక్ష నిర్వహిస్తున్న మాదిరిగానే.. నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకూ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటి వరకూ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు ఇంటర్‌ మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటుండగా.. ఇక నుంచి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించి, అందులో మార్కులు, ర్యాంకుల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లోనూ నర్సింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలను నిర్వహిస్తారు. ప్రస్తుతమున్న ‘జాతీయ నర్సింగ్‌ మండలి(ఐఎన్‌సీ) స్థానంలో ‘జాతీయ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్‌’ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1947 జాతీయ నర్సింగ్‌ మండలి బిల్లును సవరిస్తూ నూతన నర్సింగ్‌ కమిషన్‌ బిల్లును రూపొందించింది. ఈ బిల్లుపై డిసెంబ‌రు 6వ తేదీ లోపు ప్రజలు, నిపుణులు, మేధావులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను nnmcbill-mohfw@nic.in ఈ మెయిల్‌కు పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌(నర్సింగ్‌) డాక్టర్‌ రాతి బాలచంద్రన్‌ కోరారు.
ఎగ్జిట్‌ పరీక్ష తప్పనిసరి
ప్రస్తుతం ఏ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తిచేస్తే.. ఆ రాష్ట్రంలో నర్సింగ్‌ మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. అనంతరమే నర్సింగ్‌ వృత్తిలో చేరడానికి అర్హత లభిస్తుంది. తాజా బిల్లులో జాతీయ స్థాయిలో తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకుగాను తప్పనిసరిగా జాతీయ స్థాయిలో ‘ఎగ్జిట్‌’ పరీక్షను రాయాలి. ఇందులో మార్కులు, ర్యాంకుల ప్రాతిపదికనే ఎమ్మెస్సీ నర్సింగ్‌ విద్యలోనూ ప్రవేశాలు కల్పిస్తారు. కమిషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత.. మూడేళ్లలోపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను తీసుకొస్తారు. ఐదేళ్లలో ‘జాతీయ స్థాయిలో ఎగ్జిట్‌ పరీక్ష’ను అమలు చేస్తారు.
మూడో సంస్థకు తనిఖీల బాధ్యతలు
* నూతన బిల్లులో నర్సింగ్‌ కళాశాలలను థర్డ్‌ పార్టీతో తనిఖీలు చేయిస్తారు.
* ఏఎన్‌ఎంలను, ఆరోగ్య కార్యకర్తలను ‘నర్స్‌ అసోసియేట్‌’గా పిలుస్తారు.
* నర్సింగ్‌ కమిషన్‌ పరిధిలో ‘నర్సింగ్‌, మిడ్‌ వైఫరీ యూజీ ఎడ్యుకేషన్‌ బోర్డు’.. ‘నర్సింగ్‌, మిడ్‌వైఫరీ పీజీ ఎడ్యుకేషన్‌ బోర్డు’.. ‘నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ అసెస్‌మెంట్‌, రేటింగ్‌ బోర్డు’.. ‘నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ ఎథిక్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ బోర్డు’ల పేరిట 4 సంస్థలను ఏర్పాటు చేస్తారు.
 

Posted Date : 09-11-2020 .