* త్వరలో జేఎన్టీయూహెచ్, టాస్క్‌తో ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూకేలోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం జేఎన్టీయూహెచ్ పరిధిలోని అధ్యాపకులకు 3డీ సాంకేతికతపై శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు త్వరలో జేఎన్టీయూహెచ్, తెలంగాణ నైపుణ్య విజ్ఞాన సంస్థ(టాస్క్) మాంచెస్టర్ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం కుదరనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. మాంచెస్టర్ వర్సిటీకి 3డీ పరిజ్ఞానంపై మంచి నైపుణ్యం ఉంది. ఒప్పందం జరిగితే 3డీ ప్రింటింగ్‌పై ఆ వర్సిటీ ఆచార్యులు జేఎన్టీయూహెచ్ పరిధి కళాశాలల్లోని అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా మెకానికల్ ఇంజినీరింగ్ అధ్యాపకులు శిక్షణ పొందుతారు. అందుకు అనుగుణంగా ఈ వర్సిటీ టాస్క్‌తోపాటు, జేఎన్టీయూహెచ్లో 3డీ ప్రింటింగ్ ల్యాబ్‌లను నెలకొల్పుతుంది. ‘‘ప్రస్తుతం ప్లాస్టిక్, పాలిమర్‌ను కావాల్సిన రూపాల్లోకి మార్చుకొని వస్తువులు తయారు చేసుకోగలుగుతున్నాం. 3డీ సాంకేతికతతో లోహాలనూ వివిధ ఆకృతుల్లోకి మార్చేందుకు వీలుంటుంది. వైద్యరంగానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శిక్షణ పూర్తయితే జేఎన్టీయూహెచ్లో 3డీ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది’ అని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ చెప్పారు.