• facebook
  • whatsapp
  • telegram

పీజీ కోర్సులకు ఫీజులెంత?

గతేడాది రుసుములు నిర్ణయించకుండానే ప్రవేశాలు
ఈసారీ ఖరారు చేయని ఉన్నత విద్యాశాఖ

ఈనాడు, అమరావతి: పీజీ కోర్సులకు బోధన రుసుముల ఖరారు, చెల్లింపులపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఫార్మసీ కోర్సులకు ఫీజులు నిర్ణయించకుండానే ఉన్నత విద్యాశాఖ గతేడాది ప్రవేశాలు చేపట్టింది. వీరికి రీయింబర్స్‌మెంట్‌పైనా ప్రకటన చేయలేదు. అసలు ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? అన్నది ఉన్నత విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఉంటుందన్న భరోసాతో మాకు వచ్చిన ర్యాంకుల ప్రకారం కళాశాలలను ఎంచుకున్నాం. వీటిలో 2019కి ముందు నిర్ణయించిన ఫీజులు అధికంగా ఉన్నాయి. ప్రవేశాల సమయంలోనే ఫీజులపై స్పష్టత ఇస్తే మా ఆర్థిక స్థితికి తగ్గ కళాశాలలను ఎంచుకునే వాళ్లం. అప్పట్లో ప్రకటించక, ఇప్పటికీ తేల్చకపోవడంతో యాజమాన్యాలు అడిగినంత చెల్లించాల్సిన పరిస్థితి రావొచ్చు. అసలు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుందా? లేదా? అన్నది తేల్చడం లేదు’ అని విద్యార్థులు వాపోతున్నారు. 2018-19కి కూడా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అన్నిరకాల పీజీ కోర్సుల్లో సుమారు 80 వేల మంది విద్యార్థులకు రూ.వంద కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది.
వీరికి ప్రవేశాలెప్పుడు?
ఈ ఏడాది కూడా రుసుములు ఎంతో నిర్ణయించకపోవడంతో ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. 61 వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్‌కు 51,991 మంది రాయగా 40,890 మంది అర్హత సాధించారు. పీజీఈసెట్‌ 22,911 మంది రాయగా 20,157 మంది అర్హులున్నారు. మిగతా కోర్సుల్లోనూ వేలల్లో విద్యార్థులు ప్రవేశాల షెడ్యూలు కోసం నిరీక్షిస్తున్నారు.

Posted Date : 29-11-2020 .