• facebook
  • whatsapp
  • telegram

పీజీ సీట్ల పోటీలో అమ్మాయిలే అధికం 

సీపీగెట్‌లో 62.42 శాతం దరఖాస్తులు వారివే 
డిసెంబ‌రు 2 నుంచి ప్రవేశ పరీక్షలు 

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలోని ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అమ్మాయిలే అధిక శాతం మంది పోటీ పడుతున్నారు. డిసెంబరు 2వ తేదీ నుంచి మొదలయ్యే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)కు మొత్తం 85,263 మంది దరఖాస్తు చేయగా వారిలో అమ్మాయిలు 53,225 మంది(62.42 శాతం) ఉన్నారు. అబ్బాయిలు 32,033 మంది(37.58 శాతం), ట్రాన్స్‌జెండర్లు అయిదుగురు దరఖాస్తు చేసుకున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ కోర్సుల్లో తమ కుమార్తెలను చేర్చేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదువు పూర్తయ్యాక.. వీలుంటే బోధన వృత్తిలోకి ప్రవేశించాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. రోజుకు మూడు విడతల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో దాదాపు 32 వేల వరకు పీజీ సీట్లున్నాయి. ప్రస్తుతం 85 వేల మంది దరఖాస్తు చేసినా వారిలో పరీక్షకు హాజరయ్యేవారు సుమారు 60 వేల వరకు ఉంటున్నారు. క్వాలిఫై అయి కౌన్సెలింగ్‌కు హాజరై కళాశాలలో సీట్లు పొందేవారు 23 వేల మంది వరకు ఉంటారని అంచనా. దీంతో సుమారు 9 వేల నుంచి 10 వేల సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. 
 

రాష్ట్రాల వారీగా దరఖాస్తులు 
రాష్ట్రం - దరఖాస్తులు
తెలంగాణ - 83,610
ఏపీ - 789
ఇతర రాష్ట్రాలవారు - 864
మొత్తం - 85,263
 

కేటగిరీల వారీగా...
కేటగిరీ - దరఖాస్తులు - శాతం 
ఓసీ - 8,833 - 10.36
ఎస్‌సీ - 20,305 - 23.81
ఎస్‌టీ - 9,928 - 11.64
బీసీ - 46,197 - 54.18
 

Posted Date : 30-11-2020 .