‣ ‘ప్రథమ’ సంవత్సరానికీ ఆన్లైన్లోనే
‣ ఏప్రిల్ 29 నాటికి తొలి సెమిస్టర్ పరీక్షలు పూర్తి
‣ మరుసటి రోజు నుంచి రెండో సెమిస్టర్ తరగతులు
‣ వేసవి సెలవులు పూర్తిగా రద్దు
‣ ప్రకటించిన జేఎన్టీయూహెచ్
ఈనాడు, హైదరాబాద్: డిసెంబరు ఒకటో తేదీ నుంచి బీటెక్, బీఫార్మసీ మొదటి సంవత్సరం ప్రథమ సెమిస్టర్ తరగతులు ఆన్లైన్ విధానంలో మొదలుకానున్నాయి. ఈ మేరకు జేఎన్టీయూహెచ్ సోమవారం 2020-21 విద్యా సంవత్సరం కాల పట్టికను(టైంటేబుల్) ప్రకటించింది. రెండు సెమిస్టర్ల మధ్య వ్యవధి ఇవ్వకున్నా, వేసవి సెలవులు అసలే లేకున్నా మొదటి ఏడాది రెండో సెమిస్టరు 2021 సెప్టెంబరు 22వ తేదీకి కొనసాగనుంది. సాధారణంగా మొదటి ఏడాది మే నెల నాటికి పూర్తవుతుంది. తొలి సెమిస్టర్ తర్వాత కనీసం వారంపాటు సెలవులు ఇచ్చి రెండో సెమిస్టర్ ప్రారంభిస్తారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ముగిసిన తర్వాత నెలరోజులపాటు వేసవి సెలవులు ఇచ్చి తదనంతరం రెండో ఏడాది ప్రారంభిస్తారు. ఈసారి ఒక్క రోజు కూడా అలాంటి సెలవులు లేవు. ‘ఎప్పటి వరకు ఆన్లైన్ తరగతులు అనేది ఇప్పుడే చెప్పలేం. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన అనంతరం ప్రభుత్వం ఆదేశాల మేరకు తరగతి గది బోధన ప్రారంభిస్తాం’ అని జేఎన్టీయూహెచ్ అధికారి తెలిపారు. ఇది తాత్కాలిక కాలపట్టికేనని భావించాలని, పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు, రికార్డుల నిర్వహణ తదితర వాటిపై మార్గదర్శకాలను ఒకటి రెండు రోజుల్లో జారీ చేయనున్నారు. బీటెక్ రెండు, మూడు, నాలుగో ఏడాది వారికి సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్ తరగతులు మొదలయ్యాయని, అందువల్ల వారికి 15 రోజులపాటు వేసవి సెలవులు ఇస్తామని, సవరించిన విద్యా కాలపట్టికను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత విద్యార్థులకు ప్రయోగాలు(ల్యాబ్లు) చేయిస్తామని, వర్చువల్ ల్యాబ్లపైనా ఆలోచనలు చేస్తున్నామని చెబుతున్నారు.
తొలి సెమిస్టర్ కాలపట్టిక....
‣ ప్రథమ భాగం తరగతులు: డిసెంబరు 1 నుంచి
‣ మొదటి మిడ్ టర్మ్ తరగతులు: జనవరి 23వ తేదీ వరకు(8 వారాలు)
‣ మిడ్ టర్మ్ పరీక్షలు: జనవరి 25 నుంచి 30వ తేదీ వరకు
‣ రెండో భాగం తరగతులు: 2021 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 27 వరకు
‣ రెండో మిడ్ టర్మ్ పరీక్షలు: మార్చి 29 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు
‣ ప్రాక్టికల్ పరీక్షలు, సన్నద్ధ(ప్రిపరేషన్) సెలవులు: ఏప్రిల్ 7 నుంచి 12వ తేదీ వరకు
‣ ప్రథమ సెమిస్టర్ పరీక్షలు: 2021 ఏప్రిల్ 15 నుంచి 29వ తేదీ వరకు
రెండో సెమిస్టర్ కాలపట్టిక...
‣ ప్రథమ భాగం తరగతులు: ఏప్రిల్ 30 నుంచి జూన్ 24వ తేదీ వరకు
‣ తొలి మిడ్ టర్మ్ పరీక్షలు: జూన్ 25 నుంచి 30వ తేదీ వరకు
‣ రెండో భాగం తరగతులు: జులై 1 నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు
‣ రెండో మిడ్ టర్మ్ పరీక్షలు: ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 1 వరకు
‣ సెమిస్టర్ పరీక్షలు: 2021 సెప్టెంబరు 9 నుంచి 22వ తేదీ వరకు