‣ దరఖాస్తు కూడా చేసుకోని కళాశాలలు
‣ ఈసారి 102 ప్రైవేట్ కళాశాలలకే అనుమతి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2020-21)లో డీఎడ్ కళాశాలలు భారీగా మూతపడ్డాయి. ఏకంగా 69 ప్రైవేట్ కళాశాలలు తగ్గిపోయాయి. పరిస్థితులను అంచనా వేసుకున్న యాజమాన్యాలు ఈసారి దరఖాస్తు చేసుకోవడానికే ముందుకు రాలేదని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం వరకు ప్రభుత్వ కళాశాలలు 11 ఉండగా ప్రైవేట్ కళాశాలలు 171 ఉన్నాయి. కాగా ఈసారి 102 ప్రైవేట్ కళాశాలలే దరఖాస్తు చేసుకోగా వాటికి ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. ఒక్కో డీఎడ్ కళాశాలలో 50 నుంచి 100 సీట్లుంటాయి.
ప్రాథమిక తరగతులు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) పోస్టులకు డీఎడ్ విద్యార్హత తప్పనిసరి అనే నిబంధన ఉంది. ఆ పోస్టులకు బీఈడీ చదివిన వారూ అర్హులేనని గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో విద్యార్థులు డీఎడ్ బదులు బీఈడీ చదివితే ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) పోస్టుకు కూడా అర్హత ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది డీఈఈసెట్కు దాదాపు 25 వేల మంది దరఖాస్తు చేయగా ఈసారి ఆ సంఖ్య 14,036కు తగ్గింది. అందులో ధ్రువపత్రాల పరిశీలనకు 5,857 మందే హాజరయ్యారు. దీంతో పాటు కొన్ని సంవత్సరాలుగా వార్షిక రుసుంను పెంచడం లేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ కారణాలతోనే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఎక్కువగా ఈ సారి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదని సమాచారం.