• facebook
  • whatsapp
  • telegram

హాజ‌రులేక‌పోయినా ప‌రీక్ష‌లు రాసుకోవ‌చ్చు!

ఉత్త‌ర్వులు జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

 


ఈనాడు, హైదరాబాద్‌: ప్రసుత విద్యా సంవత్సరం(2020-21) విద్యార్థులకు హాజరు తప్పనిసరి కాదు. అంటే తరగతులకు హాజరుకాకున్నా వారు పరీక్షలు రాయొచ్చు. అన్ని తరగతులకు ఈ నిబంధన వర్తిస్తుంది. కరోనా నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాలల్లో రోజుకు సగం మందికే తరగతులు ఉంటాయంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, ఆపైతరగతుల విద్యార్థులకు విద్యాసంస్థలను తెరిచి ప్రత్యక్ష తరగతి బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ జ‌న‌వ‌రి 13న‌ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎనిమిదో తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు ఉండవన్నారు. శానిటైజేషన్‌, లాజిస్టిక్‌, వైద్య ప్రణాళిక రూపొందించారు. వాటి అమలుపై కలెక్టర్లు ఛైర్మన్‌గా మొత్తం తొమ్మిది మంది అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ విద్యాసంస్థల్లో నిబంధనల అమలుపై పర్యవేక్షిస్తుంది.

 

నిబంధనలు, మార్గదర్శకాలు.. 
విద్యార్థుల హాజరుకు వారి తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరి. ఆన్‌లైన్‌ విద్య కొనసాగుతుంది.
‣ బెంచీకి ఒక్క విద్యార్థే కూర్చోవాలి. అన్నిచోట్ల ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి.
ఆహ్లాదకర వాతావరణముంటే పాఠశాలల్లో ఆరు బయట కూడా తరగతులు నిర్వహించకోవచ్చు.
‣ శౌచాలయాలు, ట్యాంకులు ఇతర పరిశుభ్రత పనుల బాధ్యత జిల్లా పంచాయతీ అధికారిదే. ప్రిన్సిపల్‌/ప్రధానోపాధ్యాయుడు థర్మామీటర్లు, సబ్బులు లాంటివి సమకూర్చాలి.
ప్రతి విద్యా సంస్థలో కనీసం రెండు ఐసోలేషన్‌ గదులు ఉండాలి. జిల్లా వైద్యాధికారి తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలి. కరోనా కేసులు వచ్చినా, అనుమానం ఉన్నా అలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి విద్యాసంస్థకు వైద్యారోగ్య శాఖ సిబ్బందిని అనుసంధానించి వారి ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి.
విద్యాసంస్థల ప్రాంగణాల్లోకి ఇతరులకు అనుమతి లేదు. కలెక్టర్‌ అనుమతి ఉంటేనే ప్రాంగణాల్లో రాజకీయ సమావేశాలు, ఉత్సవాలు నిర్వహించుకోవాలి.

 

పాఠశాలల్లో ఇలా...
మధ్యాహ్న భోజనం అమలు చేస్తారు. జలుపు, దగ్గు, జ్వరం ఉంటే విద్యార్థులకు అనుమతి లేదు. ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించడంతోపాటు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో చదువుకుంటున్న విద్యార్థులను పర్యవేక్షించాలి. ప్రాజెక్టు వర్కులు, అసైన్‌మెంట్లను ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మార్గదర్శకంలో పిల్లలు ఇంట్లో చేయాలి. గదిలో 20 మందికి మించి ఉండరాదు. పాఠశాల లోనికి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి తరగతుల వారీగా వేర్వేరు సమయాలు ఉండాలి. కనీసం రెండు రోజులకు ఒకసారి బస్సులు/వ్యాన్లను శానిటైజ్‌ చేయాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు నో డిటెన్షన్‌ పాలసీ అమలులో ఉంటుంది. పదో తరగతి పరీక్షల కాలపట్టిక ప్రత్యేకంగా విడుదల చేస్తారు.

 

జూనియర్‌ కళాశాలల్లో...
ప్రతిరోజూ తరగతి గదులు, బెంచీలు శానిటైజ్‌ చేయాలి. 300 లోపు విద్యార్థులు ఉండి తగిన వసతులు ఉంటే గతంలో మాదిరిగానే ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుపుకోవచ్చు. అంతకంటే మించి ఉంటే రెండు షిఫ్టుల్లో ఉదయం 8.30 నుంచి 12.30 గంటల వరకు, 1.30 గంటల నుంచి 5.30 గంటల వరకు తరగతులు జరుపుకోవాలి. రెండో ఏడాది వారికి మొదటి షిఫ్టులో తరగతులు నిర్వహించాలి. అకడమిక్‌ క్యాలెండర్‌ సెప్టెంబరు 1 నుంచి వచ్చే ఏప్రిల్‌ 30వ తేదీ వరకు మాత్రమే. పరీక్ష విధానంలో మార్పు లేదు. ఆన్‌లైన్‌ తరగతులు మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్లు లేని వారు కళాశాలల్లోని కంప్యూటర్‌ ల్యాబ్‌లను వినియోగించుకోవచ్చు.

Posted Date : 13-01-2021 .