• facebook
  • whatsapp
  • telegram

రవాణాలో నైపుణ్య శిక్షణ

ఎన్‌ఆర్‌టీఐ ప్రత్యేక కోర్సులు
 

ఉపాధిపరంగా ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉండే రంగాల్లో రవాణా ఒకటి. దీనికి సంబంధించి ఎన్నో కోర్సులు ఉన్నాయి. కానీ రవాణా పరిశ్రమపైనే ప్రత్యేకంగా రూపొందించిన కోర్సులను నేషనల్‌ రైల్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఆర్‌టీఐ) అందిస్తోంది. నిర్దిష్ట నైపుణ్యాలను నేర్పేందుకు ఎన్నో యూజీ, పీజీ కోర్సులను అందు బాటులోకి తెచ్చింది. తాజాగా ఏడు కొత్త కోర్సులను జోడించింది. ఈ రంగంపై ఆసక్తి ఉండి, కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారు వచ్చే విద్యాసంవత్సరంలో వీటిపై దృష్టిపెట్టటం మేలు!
 

వడోదరలోని ఎన్‌ఆర్‌టీఐ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. ఇదో డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ. రవాణా పరిశ్రమకు ఎప్పటికప్పుడు ఆదరణ  పెరుగుతున్న విషయం దృష్టిలో ఉంచుకుని, దీని అవసరాలకు అనుగుణంగా సంబంధిత కోర్సులను రూపొందించి, అందిస్తున్నారు. మల్టీడిసిప్లినరీ రిసెర్చ్, ట్రెయినింగ్‌ వీటి ప్రత్యేకత. ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు త్వరగా ఉద్యోగావకాశాలు పొందేలా చేయడం ఈ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యం.
 

2018 నుంచి ఈ యూనివర్సిటీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్‌ రైల్వే విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించే ప్రయోగశాలగా తోడ్పడుతుంది. రవాణా అవసరాలపై దృష్టిసారిస్తూ విద్య, పరిశోధన, శిక్షణ సాగేలా కరిక్యులమ్‌ విషయంలోనూ తన సాయమందిస్తోంది. అలాగే రైల్వే సంబంధిత ప్రయోగశాలలు, వర్క్‌షాప్‌లు, మోడల్‌ రూమ్‌లు, పరిశోధనల్లో విద్యార్థులకు స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం కల్పిస్తారు. మొత్తంగా తరగతి బోధనతోపాటు ప్రయోగాత్మక శిక్షణకూ ప్రాధాన్యమివ్వడం కనిపిస్తుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల (బీబీఏ, బీఎస్‌సీ, బీటెక్‌) తోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులూ (ఎంబీఏ, ఎంఎస్‌సీ) అందుబాటులో ఉన్నాయి. 
 

నిజానికి ఈ ఏడాది ప్రవేశాలు పూర్తయ్యాయి. కానీ ఈ యూనివర్సిటీ తాజాగా కొన్ని కొత్త కోర్సులను జోడించినట్లు ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఏడు కొత్త అకడమిక్‌ ప్రోగ్రామ్‌లను చేర్చారు. వాటిలో రెండు బీటెక్, రెండు ఎంబీఏ, మూడు ఎంఎస్‌సీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. బీటెక్‌ కోర్సులు రైల్వే సదుపాయాలు, రైల్‌ సిస్టమ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌పైనా; ఎంబీఏ కోర్సులు ట్రాన్స్‌పోర్టేషన్, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌పైనా; ఎంఎస్‌సీ కోర్సులు సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇంటిగ్రేషన్, సిస్టమ్స్‌ అనలిటిక్స్, పాలసీ, ఎకనామిక్స్‌పైనా దృష్టిసారించేలా రూపొందించారు. ప్రతి కోర్సుకీ కొన్ని ప్రత్యేకతలనూ జోడించారు.


 

ఎవరు అర్హులు?
బీఎస్‌సీ, బీబీఏ ప్రోగ్రామ్‌లకు ఇంటర్‌ స్థాయిలో మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌ల్లో ఏదో ఒకదానిని ఒక సబ్జెక్టుగా పూర్తి చేసుండటం తప్పనిసరి. జనరల్‌ కేటగిరీ వారికి 55%, ఇతరులకు 50% మార్కులుండాలి. వయసు 25 ఏళ్లకు మించకూడదు.
బీటెక్‌ కోర్సులకు ఇంటర్‌ స్థాయిలో ఎంపీసీ పూర్తిచేసుండాలి. జేఈఈ మెయిన్స్‌ స్కోరు పరిశీలిస్తారు. వయసు 25 సంవత్సరాలకు మించకూడదు.
‣ ఎంబీఏ, ఎంఎస్‌సీ కోర్సులకు మేథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌ల్లో ఏదో ఒకదానితో డిగ్రీ పూర్తిచేసుండాలి. కనీసం 55% మార్కులుండాలి. ఓబీసీ/ ఎస్‌సీ/ ఎస్‌టీ వారికి కనీసం 50% ఉండాలి. వయః పరిమితేమీ లేదు.
 

ఎన్ని సీట్లు?
బీబీఏ, బీఎస్‌సీ - 125
బీటెక్‌ - 60
ఎంబీఏ, ఎంఎస్‌సీ- 100
 

ఏ కోర్సులు ? ఏ ప్రత్యేకతలు?

బీబీఏ
బీబీఏ ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజ్‌మెంట్‌: స్పెషలైజ్‌డ్‌ ప్రోగ్రామ్‌. కాలవ్యవధి మూడేళ్లు. ట్రాన్స్‌పోర్టేషన్‌ పరిశ్రమలోని మేనేజ్‌మెంట్‌ అంశాలపై దీనిలో దృష్టిపెడతారు. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్, అర్బన్‌ ప్లానింగ్‌ మోడల్స్, సోషియోలాజికల్‌ అంశాలు, ట్రాన్స్‌పోర్ట్‌ సంబంధిత ఫైనాన్షియల్‌ మోడల్స్‌ వంటి ముఖ్యమైన విభాగాల గురించి ఇందులో నేర్చుకుంటారు.
 

బీఎస్‌సీ 
బీఎస్‌సీ ఇన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీ: కాలవ్యవధి మూడేళ్లు. ఇది టెక్నాలజీ, వాటిని రవాణా రంగంలో ఉపయోగించే పద్ధతులపై దృష్టిసారిస్తుంది. ఈ దశాబ్దపు టెక్నాలజీలు, అర్బన్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కంట్రోల్, వెహికల్‌ సిస్టమ్‌ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌ డిజైన్, హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ థియరీ, డిజైన్‌ అంశాలు కోర్సులో భాగం.
 

బీటెక్‌
బీటెక్‌ ఇన్‌ రైల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌: నాలుగేళ్ల ప్రోగ్రామ్‌. రైల్వే మౌలిక వసతులతో పాటు దాని డిజైన్, అభివృద్ధికి అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలను దీనిలో భాగంగా నేర్చుకుంటారు. వెహికల్‌ సిస్టమ్‌ డిజైన్, సేఫ్టీ అండ్‌ రిలయబిలిటీ, జియోటెక్, బ్రిడ్జ్‌ డిజైన్‌ అండ్‌ స్ట్రక్చర్స్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్‌ మొదలైనవి దృష్టిసారించే ప్రధాన అంశాలు.
బీటెక్‌ ఇన్‌ రైల్‌ సిస్టమ్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌: కాలవ్యవధి నాలుగేళ్లు. దీనిలో రైల్వే సిస్టమ్స్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంబంధిత పరిజ్ఞానం, నైపుణ్యాలను నేర్చుకుంటారు. కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ప్యాసెంజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, రైల్వే కంట్రోల్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్, మొబైల్‌ కమ్యూనికేషన్, బిగ్‌ డేటా, డేటా అనలిటిక్స్‌తోపాటు ఏఐ, మెషిన్‌ లర్నింగ్‌ అంశాలుంటాయి.
 

ఎంబీఏ
ఎంబీఏ ఇన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజ్‌మెంట్‌:  రెండేళ్ల కోర్సు. భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్‌ డిజైనింగ్, సూపర్‌వైజింగ్, నిర్వహణ సంబంధిత నైపుణ్యాలపై దీనిలో దృష్టిసారిస్తారు. ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌ పెట్టుబడులు, మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మోడల్స్‌ డిజైనింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ పర్యావరణంపై చూపే ప్రభావం, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కంట్రోల్, ఇంటలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ మొదలైన కీలకాంశాలపై బోధన ఉంటుంది.
ఎంబీఏ ఇన్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌:  రెండేళ్ల కోర్సు. డిజైన్, ఇంటిగ్రేషన్, వివిధ స్థాయుల సప్లై చెయిన్‌ విభాగాలతో కలిసి పనిచేయడానికి కావాల్సిన మేనేజీరియల్‌ నైపుణ్యాలపై ప్రధాన దృష్టి ఉంటుంది. పోటీలో నిలదొక్కుకోవడానికి, కొత్త, సృజనాత్మక పరిష్కారాల రూపకల్పనకు కావాల్సిన నైపుణ్యాల గురించీ తెలుసుకుంటారు. లాజిస్టిక్స్‌ అండ్‌ వేర్‌ హౌజింగ్‌ సిస్టమ్స్, రవాణా సుంకం, సప్లై చెయిన్‌ స్ట్రాటజీ, రెవెన్యూ మేనేజ్‌మెంట్‌ అంశాల గురించి అధ్యయనం చేస్తారు.
 

ఎంఎస్‌సీ
ఎంఎస్‌సీ ఇన్‌ రైల్వే సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌:  ఇంటర్నేషనల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌. యూకేలోని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీతో కలిసి అందిస్తున్నారు. కాలవ్యవధి రెండేళ్లు. రెండో ఏడాదిని విద్యార్థులు బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయంలో పూర్తిచేస్తారు. దీనిలో సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌ స్కిల్స్, రైల్వే ఇంజినీరింగ్‌లతోపాటు సబ్‌ సిస్టమ్స్‌ మధ్య ఉండే క్లిష్టమైన పరస్పర చర్యలను అర్థం చేసుకోవడం వంటి అంశాలను అధ్యయనం చేస్తారు.
ఎంఎస్‌సీ ఇన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ టెక్నాలజీ అండ్‌ పాలసీ: రెండేళ్ల కోర్సు. ట్రాన్స్‌పోర్ట్‌ టెక్నాలజీ, రంగానికి సంబంధించి దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన పాలసీలు వంటివాటిపై దీనిలో ప్రధానంగా దృష్టిసారిస్తారు. ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్, అర్బన్‌ ప్లానింగ్‌ మోడల్స్, ఇంటిగ్రేటింగ్‌ బిహేవియర్, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌ పాలసీలు, ఇన్ఫర్మేషన్‌ పాలసీ, మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మొదలైనవాటి గురించి అధ్యయనం చేస్తారు.
ఎంఎస్‌సీ ఇన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ అనలిటిక్స్‌: కాలవ్యవధి రెండేళ్లు. ట్రాన్స్‌పోర్టేషన్‌కు సంబంధించి డేటాసైన్స్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, అనలిటిక్స్‌ల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం. ఇన్ఫర్మేషన్‌ పాలసీ, డేటా మోడల్స్‌ అండ్‌ డెసిషన్స్, బిగ్‌డేటా, నెట్‌వర్క్‌ థియరీ మొదలైనవి అధ్యయనం చేసే కీలకాంశాలు.
 

ప్రవేశం ఎలా ?
గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు: బీబీఏ, బీఎస్‌సీ ప్రోగ్రామ్‌లకు ఎన్‌ఆర్‌టీఐ అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి ప్రవేశం కల్పిస్తారు. పరీక్షలో భాగంగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటలిజెన్స్, క్వాంటిటేటివ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలను పరీక్షిస్తారు. ప్రవేశపరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
బీటెక్‌ కోర్సులకు జేఈఈ మెయిన్స్‌ స్కోరు ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
ఉద్యోగపరంగా పెరుగుతున్న పోటీ దృష్ట్యా పరిశ్రమ ఆధారిత విద్యావిధానానికి ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో కాస్త భిన్నంగా, త్వరగా అవకాశాలను అందుకోవాలనుకునేవారికి ఎన్‌ఆర్‌టీఐ కోర్సులు మంచి ప్రత్యామ్నాయాలు.
పీజీ కోర్సులకు: ఎన్‌ఆర్‌టీఐ మాస్టర్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. దీనిలో లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్, ఇంటలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, మ్యాథమేటికల్‌ స్కిల్స్, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాలను పరీక్షిస్తారు. కాలవ్యవధి గంటన్నర. ఎంబీఏ కోర్సులకు క్యాట్, మ్యాట్, గ్జాట్‌ స్కోర్ల ఆధారంగా కూడా ప్రవేశం కల్పిస్తారు. ఎంఎస్‌సీ కోర్సులకు ఎంట్రన్స్‌తోపాటు అదనంగా సబ్జెక్టివ్‌ టెస్ట్‌ ఉంటుంది. రాతపరీక్ష స్కోరుతోపాటు వ్యక్తిగత ఇంటర్వ్యూలోనూ నెగ్గితే ప్రవేశ అవకాశం ఉంటుంది. 
 

వెబ్‌సైట్‌: https://nrti.edu.in/
 


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు