• facebook
  • whatsapp
  • telegram

చిల్లర వ్యాపారంలో కొల్లలు కొలువులు

అవసరమైన వస్తువు ఏదైనా కొనాలని అనుకోవడమే ఆలస్యం... అడుగు బయట పెట్టగానే సూపర్‌ మార్కెట్‌.. బిగ్‌బజార్‌.. ఆ మాల్‌.. ఈ స్టోర్‌ అంటూ ఎన్నో అందుబాటులో ఉంటున్నాయి. వీటిలోని వందల రకాలు కస్టమర్ల కళ్లను కట్టిపడేస్తుంటాయి. ఎక్కడెక్కడో తయారైన వస్తువులను ఒకచోటికి చేర్చి నేరుగా వినియోగదారుడికి విక్రయించే వీటినే రిటైల్‌ (చిల్లర) వ్యాపార సంస్థలు అంటారు. పేరుకే చిల్లర కానీ టర్నోవర్‌ కోట్లలో ఉంటుంది. మార్కెట్ల రూపురేఖలు మారుతుండటంతో కార్పొరేట్‌ కంపెనీలు, విదేశీ సంస్థలూ ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో పదోతరగతి నుంచి ఎంబీఏ వరకు అన్ని రకాల అర్హతలున్న వారికీ రిటైల్‌ సెక్టార్‌లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. కొన్ని రకాల కోర్సులు చేస్తే మరింత ఆకర్షణీయమైన జీతాలను అందించే కొలువులు దొరుకుతున్నాయి.ఎక్కడో తయారయ్యే వస్తువులను కొనుగోలుదారులకు ప్రత్యక్షంగా అమ్మే రిటైల్‌ వ్యాపారం ఒకప్పుడు చిన్న చిన్న దుకాణాలకే పరిమితమయ్యేది. కానీ, ప్రస్తుతం రిలయన్స్‌, పాంటలూన్స్‌ లాంటి స్వదేశీ సంస్థలూ, వాల్‌మార్ట్‌ లాంటి విదేశీ బడా సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు పెరిగాయి. పదోతరగతి నుంచి ఎంబీఏ వరకూ రకరకాల స్థాయుల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాక్చాతుర్యం, వినయంగా, చిరునవ్వుతో మాట్లాడే లక్షణం, వినియోగదారులను ఒప్పించగలిగే ప్రతిభ ఉన్నవారు ఈ రంగంలో బాగా రాణించగలుగుతారు. .

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రిటైలింగ్‌ వ్యవస్థ ఉన్న దేశాల్లో మనదేశం అయిదో స్థానంలో ఉంది. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ మార్కెట్‌గా అవతరించే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. రిటైల్‌ మార్కెట్‌లో ఏటా 12% వృద్ధి జరుగుతోంది. ఆన్‌లైన్‌ రిటైల్‌లో వృద్ధి ఏటా 23%గా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో 10 మిలియన్లకు పైగా ఖాళీలున్నాయని అంచనా. ఈ-కామర్స్‌కి ఆదరణ పెరుగుతుండటంతో వివిధ రకాల కొత్త కొలువులు వస్తున్నాయి. మనదేశంలోనూ దీనికి సంబంధించిన నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. అభిరుచి ఉండి, ఆసక్తికరమైన కెరియర్‌ కావాలనుకునేవారు ఈ రంగంపై దృష్టిపెట్టొచ్చు.

రిటైలింగ్‌లో ప్రతి ఉద్యోగానికీ ప్రత్యేక అర్హత అవసరం లేదు. కిందిస్థాయి మినహా మిగతావాటికి డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్లు సరిపోతాయి.

 

 

రిటైల్‌ మేనేజ్‌మెంట్‌


మనదేశంలో ఎక్కువ ఆదరణ ఉన్న కోర్సు ఇది. రిటైల్‌ రంగంలో ప్రముఖంగా అందిస్తున్న ఏకైక కోర్సుగా కూడా చెప్పవచ్చు. దీనిలో.. డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
డిప్లొమా ఇన్‌ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు. ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య పూర్తి చేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి- ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి.
బీఎస్‌సీ- రిటైల్‌ మేనేజ్‌మెంట్‌: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు. ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య 50% మార్కులతో పూర్తి చేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి- మూడేళ్లు.
బీబీఏ ఇన్‌ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు. ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య 50% మార్కులతో పూర్తి చేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి- మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి.
ఎంబీఏ ఇన్‌ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌: కోర్సు కాలవ్యవధి- రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఏదైనా డిగ్రీ 50% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు.
అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌: రిటైల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా చేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి- ఏడాది
సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌: డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి 3 నుంచి 6 నెలలు ఉంటుంది.

ఇవేకాకుండా..:
*¤ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌
*¤ ఎంబీఏ ఇన్‌ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌
*పీజీ డిప్లొమా ఇన్‌ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌
*¤ పీజీ డిప్లొమా ఇన్‌ ఫ్యాషన్‌ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు కూడా ఉన్నాయి.
క్యాట్‌, సీమ్యాట్‌, గ్జాట్‌ వంటి ప్రవేశపరీక్షల ద్వారా ఈ కోర్సుల్లోకి ప్రవేశాలను పొందొచ్చు. కొన్ని సంస్థలు సొంతంగా ఎంట్రన్స్‌లను నిర్వహిస్తున్నాయి.

 

కోర్సులు అందిస్తున్న సంస్థలు:
*¤ కేజే సోమియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ అండ్‌ రిసెర్చ్‌, ముంబయి
*¤ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ, ఉత్తర్‌ప్రదేశ్‌
*¤ అమిటీ బిజినెస్‌ స్కూల్‌, నోయిడా
*¤ ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ, న్యూదిల్లీ
*¤ అన్నా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, తమిళనాడు
*¤ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మరత్వాడా యూనివర్సిటీ, మహారాష్ట్ర
*¤ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, న్యూదిల్లీ
*¤ ఐకే గుజ్రాల్‌ పంజాబ్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ, జలంధర్‌
*¤ ఏషియన్‌ రిటైల్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ
*¤ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిటైల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐఆర్‌), బెంగళూరు
బీఐఎంటీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌, మీరట్‌ మొదలైనవి.

 

మర్కండైజింగ్‌
దీనిలో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు కాలవ్యవధి ఏడాది కాగా, సర్టిఫికెట్‌ కోర్సులకు మూడు నుంచి ఆరు నెలలు. డిప్లొమా కోర్సులకు ఇంటర్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. పీజీ డిప్లొమాకు డిగ్రీ చేసినవారు అర్హులు. సర్టిఫికేషన్‌ కోర్సులను ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసినవారెవరైనా చేయొచ్చు.
ఇందులో విజువల్‌ మర్కండైజింగ్‌, అపారల్‌ మర్కండైజింగ్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ మర్కండైజింగ్‌, గార్మెంట్‌ మ్యానుఫాక్చరింగ్‌ అండ్‌ మర్కండైజింగ్‌ మొదలైన కోర్సులున్నాయి.

 

 

కోర్సులు అందిస్తున్న సంస్థలు:
*¤ సీఈఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, యలహంక
*¤ ఎఫ్‌ఈ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌, ముంబయి
*¤ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ట్రైనింగ్‌, తమిళనాడు
*¤ వోగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, బెంగళూరు
*¤ పెరల్‌ అకాడమీ, దిల్లీ
*¤ నిఫ్ట్‌- హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి, గాంధీనగర్‌ మొదలైనవి.

 

 

పలు రకాల ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా రిటైల్‌ రంగంలో వివిధ హోదాలతో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. సేల్స్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ వంటి ఉద్యోగాలకు ఆ విభాగాల్లో డిగ్రీ, ఎంబీఏ చేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
సేల్స్‌: రిటైల్‌ పరిశ్రమలో ఇది ప్రధానమైన విభాగం. స్టోర్‌ ఆపరేషన్స్‌లోనూ దీనికి ప్రముఖ స్థానం ఉంటుంది. సేల్స్‌ అసోసియేట్‌, క్యాషియర్‌, సేల్స్‌ పర్సన్‌ మొదలైన ఉద్యోగాలుంటాయి. అమ్మకాలతోపాటు క్యాష్‌ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటారు. డిస్‌ప్లేలను సిద్ధం చేయడం, ఆఫీస్‌లో డబ్బు డిపాజిట్‌ చేయడం మొదలైనవీ వీరి పనిలో భాగంగా ఉంటాయి.

స్టోర్‌ మేనేజర్‌: రిటైల్‌ స్టోర్‌లో జరిగే రోజువారీ ఆపరేషన్స్‌/ మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలకు వీరు బాధ్యులు. స్టోర్‌లో పనిచేసే ఇతర ఉద్యోగులందరూ వీరి కిందే ఉంటారు. ముఖ్యంగా హెచ్‌ఆర్‌, హైరింగ్‌ టీం, ట్రైనింగ్‌, డెవలపింగ్‌ ప్రోగ్రామ్స్‌, స్టోర్‌ లాభనష్టాలు, బ్యాంకింగ్‌, వినియోగదారుల ఫిర్యాదులను చూడటం వంటి వాటికన్నింటికీ బాధ్యత వహిస్తారు.
విజువల్‌ మర్కండైజర్‌: వస్తువులను ప్రమోట్‌ చేస్తారు. అమ్మకాలను పెంచడంలో వీరిదే ప్రధాన పాత్ర. వినియోగదారులను ఆకర్షించేలా వస్తువులను ఉంచడం వీరి పనే. విండో డిస్‌ప్లే, గుర్తులు, ఇంటీరియర్‌ డిస్‌ప్లే మొదలైన వాటిని చూసుకుంటారు. సృజనాత్మకత ఉన్నవారు దీనిలో రాణిస్తారు.
రీజనల్‌ సేల్స్‌ మేనేజర్‌: జాతీయ స్థాయిలో ఉండే వారికి వీరు రోజువారీ నివేదికలు సమర్పిస్తుంటారు. అమ్మకాలకు సంబంధించి రోజువారీ కార్యకలాపాలకు బాధ్యులుగా ఉంటారు. స్టోర్‌లను ఎప్పటికప్పుడు గమనిస్తూ తలెత్తే సమస్యలను పరిష్కరిస్తుంటారు. వీరికి ఆంగ్లభాషపై పట్టుతోపాటు, కంప్యూటర్‌ నైపుణ్యాలు అవసరం.
ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌: ఆదాయం, ఖర్చులకు సంబంధించిన రికార్డులను నిర్వహిస్తారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రికార్డులు, ఖర్చులను అదుపు చేయడం వంటివి వీరి విధులు.
హ్యూమన్‌ రిసోర్సెస్‌: ఉద్యోగుల ఎంపిక, నియామకం, వారికి శిక్షణ, అభివృద్ధి ప్రోగ్రామ్‌లను నిర్వహించడం మొదలైనవన్నీ వీరి బాధ్యతలు.

లాజిస్టిక్‌: వస్తువులను జాగ్రత్త చేయడం, వేర్‌ హౌసింగ్‌, రవాణా, ప్యాకేజింగ్‌, ఇన్వెంటరీ మొదలైనవన్నీ వీరు చూసుకుంటారు. వీరు అందించే సమాచారం ఆధారంగానే వస్తువుల నిల్వపై పైవారికి అవగాహన ఏర్పడుతుంది.
మార్కెటింగ్‌: అడ్వర్టైజింగ్‌, సేల్స్‌ ప్రమోషన్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఏర్పరచుకోవడం మొదలైనవి ఈ విభాగం విధులు. వినియోగదారులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు.
రిలయన్స్‌ గ్రూప్‌, ఐటీసీ రిటైల్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, టాటా గ్రూప్‌, సుభిక్ష, స్టాపర్స్‌ స్టాప్‌, బిగ్‌ బజార్‌, పాంటలూన్స్‌, అపారల్‌ చెయిన్స్‌, రేమండ్స్‌, అరవింద్‌ బ్రాండ్స్‌, లైఫ్‌స్టైల్స్‌ మొదలైన సంస్థలు ఈ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.
ఎంపికైన హోదాను బట్టి జీతభత్యాలుంటాయి. సేల్స్‌ విభాగం వారికి ప్రారంభజీతం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది. ఆపరేషన్స్‌ ప్రొఫెషనల్స్‌కు రూ.25,000 తో మొదలవుతుంది. అనుభవంతోపాటు మంచి నైపుణ్యాలను సొంతం చేసుకోగలిగితే జీతంలో మంచి పెరుగుదల ఉంటుంది.

 

డిజైనింగ్‌


గత దశాబ్ద కాలంగా రిటైల్‌ డిజైనింగ్‌ ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్కిటెక్చర్‌, మార్కెటింగ్‌, స్ట్రాటజీలను దృష్టిలో ఉంచుకుని రిటైలింగ్‌ బిల్డింగ్‌ డిజైన్‌ను రూపొందించడంపై దృష్టిసారిస్తారు. దీనిలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులున్నాయి.
ఎంఐటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పుణె; నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, బెంగళూరు; వరల్డ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డిజైన్‌, హరియాణ; ఎంఎస్‌ రామయ్య యూనివర్సిటీ ఆఫ్‌ అప్లయిడ్‌ సైన్సెస్‌ ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులను చేసినవారిని ఎగ్జిబిషన్లు, మ్యూజియాలు మొదలైన వాటిని డిజైన్‌ చేయడానికీ ఎంచుకుంటారు.


 

కోర్సులు

మరిన్ని