• facebook
  • whatsapp
  • telegram

సేవలో ఉపాధికి సోషల్‌ వర్క్‌ దారి

సమాజాన్ని పీడిస్తోన్న ఎన్నో సమస్యలు మనచుట్టూ ఉన్నాయి. పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత, నిరుద్యోగం.. ఇలా ఏదో ఒకదానితో ఇబ్బంది పడుతోన్నవారెందరో. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు రావాలంటే? అందుకు సోషల్‌ వర్క్‌ చక్కని మార్గం చూపుతోంది. ప్రభుత్వాలతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు చిక్కుల నుంచి బయటపడడానికి చేయూతనిస్తున్నాయి. వివిధ ఎన్జీవోలు భిన్న విభాగాల్లో సేవలు విస్తరిస్తున్నాయి. వీటిలో పనిచేయడానికి సేవలపై ఆసక్తి ఉన్నవారు కీలకం. ఇందుకు సోషల్‌ వర్క్‌ చదువులు ప్రామాణికం. నిలదొక్కుకుంటూనే, నలుగురికీ సాయ పడడానికి దోహదపడే ఈ కోర్సులను జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలెన్నో అందిస్తున్నాయి.  
 

సమాజంలో రకరకాల అవసరాలతో సతమతమయ్యేవారు ఎందరో. తిండిలేక బాధపడేవారు కొందరైతే, అయినవాళ్లెవరూ లేక దీనావస్థలో ఉండేవారు మరికొందరు. డబ్బు లేక చదువుకి దూరమై బాలకార్మికులుగా నెట్టుకొస్తున్నవారు ఇంకొందరు. అవసరానికి రక్తం అందక ప్రాణాలొదిలేవాళ్లెందరో. క్యాన్సర్, ఎయిడ్స్‌ లాంటి ప్రాణాంతక జబ్బులతో దయనీయ జీవితాన్ని గడిపేవారి సంఖ్యా ఎక్కువే. ఇలాంటి వాళ్లందరికీ పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతోకొంత సేవచేయడానికి వివిధ విభాగాలకు చెందిన ఎన్జీవోలు ఉన్నాయి. ఇందులో పనిచేసే వ్యక్తులే సోషల్‌ వర్కర్లు. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించడం, సమస్యల్లో ఉన్నవారికి సాయపడడం వీరి కర్తవ్యం. 
 

సామాజిక అంశాలపై ఆసక్తి, అవగాహన ఉన్నవారు సోషల్‌ వర్క్‌ కోర్సులో రాణించవచ్చు. వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు, బృందాలు- సమూహాలు ఇలా అందరికీ వీరి సేవల అవసరం ఉంటుంది. సోషల్‌ వర్క్‌ కోర్సు చదివినవారికి ఎన్జీవోలతోపాటు, ప్రభుత్వ సంస్థలు, మానవ వనరుల విభాగాలు, కౌన్సెలింగ్‌ కేంద్రాలు...తదితర చోట్ల ఉపాధి అవకాశాలుంటాయి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వాణిజ్య సంస్థలకు సామాజిక బాధ్యత తప్పనిసరి. అందువల్ల సంస్థలన్నీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) విభాగం ఏర్పాటుచేశాయి. దీనిద్వారా ఎంతోకొంత మొత్తాన్ని ఏదో ఒక సంక్షేమానికి ఖర్చు చేయాల్సివుంటుంది. వీటిల్లో పనిచేసే అవకాశం సోషల్‌ వర్క్‌ కోర్సులు చదివినవారికి దక్కుతోంది.          
 

స్థిరపడాలంటే...
సోషల్‌ వర్క్‌ డిగ్రీతోపాటు పని అనుభవం, అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, ఎన్జీవో అడ్మినిస్ట్రేషన్‌లో స్పష్టమైన అవగాహన ఉంటే మంచి వేతనంతో కెరియర్‌లో స్థిరపడొచ్చు. పేరొందిన సంస్థల్లో చదివితే వేతనాలు పెద్దమొత్తంలోనే ఉంటాయి. గేట్స్‌ మిలిందా ఫౌండేషన్, ఫోర్డ్స్‌ ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితి...తదితర సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలందిస్తున్నాయి. ఒక్కో సంస్థ, ఎన్జీవో ఒక్కో విభాగంపై దృష్టి సారించాయి. ఏ విభాగంలో పనిచేయడంపై మీలో ఆసక్తి ఉందో తెలుసుకోవడం ముఖ్యం. అందుకు సరిపోయే స్పెషలైజేషన్‌ను పూర్తిచేయాలి. ఆ విభాగానికి సంబంధించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. సంబంధిత విభాగంలో సేవలందిస్తున్న సంస్థలు, కార్యక్రమాలపై శ్రద్ధ వహించాలి. వాలంటీర్‌గా సేవలు అందించడం, సంబంధిత సంస్థల్లో ఇంటర్న్‌ పూర్తిచేయడం..మొదలైనవాటిపై దృష్టి సారించాలి. మీ ఆసక్తులు, ఆలోచనలు సంబంధిత సంస్థలతో పంచుకోవడం ద్వారా అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 

 

ఇవీ కోర్సులు...        
దేశంలో తొలిసారి 1936లో దొరాబ్జీ టాటా స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ప్రస్తుత టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌)లో మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యు) కోర్సు ప్రారంభమైంది. ప్రస్తుతం సుమారు 300 విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సోషల్‌ వర్క్‌ కోర్సు బోధిస్తున్నారు. సంస్థను బట్టి ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యు పేరుతో పీజీ స్థాయిలో వీటిని అందిస్తున్నారు. కొన్ని సంస్థల్లో  స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. పేరొందిన జాతీయస్థాయి సంస్థల్లో చదివినవారికి క్యాంపస్‌లోనే ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. అయితే కేవలం డబ్బు సంపాదించడానికే కెరియర్‌ అనుకునేవారు మాత్రం సోషల్‌ వర్క్‌ ఎంచుకోవాల్సిన పనిలేదు. సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకురావాలనే సంకల్పం ఉన్నవారు సోషల్‌ వర్క్‌ చదువుల్లో చేరడం సముచితం. 

 

యూజీ నుంచే సోషల్‌ వర్క్‌ కోర్సు చదువుకోవచ్చు. సోషల్‌ వర్క్, సోషియాలజీ, సైకాలజీ ఈ మూడు సబ్జెక్టుల కాంబినేషన్‌ ఎంచుకోవచ్చు. కొన్ని సంస్థలు బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌(బీఎస్‌డబ్ల్యు) పేరుతో ప్రత్యేకంగా కోర్సు రూపొందించాయి. అయితే సోషల్‌ వర్క్‌ యూజీ చదువులు తక్కువ సంస్థల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో పీజీ స్థాయిలో ఈ కోర్సు అమలవుతోంది. ఏదైనా డిగ్రీ అర్హతతో పీజీ కోర్సుల్లో చేరవచ్చు. ఇందుకోసం యూజీలో సోషల్‌ వర్క్‌ చదవాలనే నిబంధన లేదు. పీజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. 
 

క్రిమినాలజీ అండ్‌ జస్టిస్, కమ్యూనిటీ హెల్త్, మెంటల్‌ హెల్త్, అర్బన్‌ డెవలప్‌మెంట్, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్క్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్‌ స్టడీస్‌ అండ్‌ యాక్షన్, డిజెబిలిటీ స్టడీస్‌ అండ్‌ యాక్షన్, లైవ్లీహుడ్‌ అండ్‌ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్, చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీ ఇష్యూస్‌ ..తదితర స్పెషలైజేషన్లు పీజీ స్థాయిలో ఉన్నాయి.    
 

ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం  
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు  
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి  
ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజమండ్రి  
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం  
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి  
 డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ, ఎచ్చెర్ల  
విక్రమ్‌ సింహపురి యూనివర్సిటీ, నెల్లూరు  
కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నం  
ద్రవిడియన్‌ యూనివర్సిటీ, కుప్పం  

తెలంగాణలో..
ఉస్మానియా యూనివర్సిటీ  
రోడా మిస్ట్రీ కాలేజ్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్, హైదరాబాద్‌  
మౌలానా అజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్‌  
‣ పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌  
తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్‌  

ఈ నైపుణ్యాలు తప్పనిసరి
సాయపడాలనే తపన
నివేదికలు రాయడం, వాటిని వివరించడం
కేస్‌ స్టడీస్‌ నిర్వహణ 
సుదీర్ఘ ప్రయాణాలు, ఎక్కువ సమయం క్షేత్రస్థాయి పనిలో నిమగ్నం కావడానికి ఓర్పు
సానుకూల దృక్పథం
 నలుగురిలోనూ కలిసిపోవడం
నిజాయతీగా వ్యవహరించడం 

కొన్ని ప్రముఖ సంస్థలు 
టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ముంబై  
జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీస్, రాంచీ
జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, న్యూదిల్లీ
విశ్వభారతి డీమ్డ్‌ యూనివర్సిటీ, శాంతినికేతన్‌  
 నిర్మలా నికేతన్, ముంబై  
దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌  
ఇండోర్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌  
అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ   
క్రైస్ట్‌ యూనివర్సిటీ, బెంగళూరు   
కలకత్తా యూనివర్సిటీ  

ఏయే ఉద్యోగాలు?  
ఈ రంగంలో ఉద్యోగావకాశాలు అభ్యర్థులు చదివిన స్పెషలైజేషన్‌ ఆధారంగా ఉంటాయి. 

హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో స్పెషలైజేషన్‌ పూర్తిచేసుకున్నవారికి పరిశ్రమల్లో అయితే.. మేనేజర్‌ (హెచ్‌ఆర్, పర్సనెల్, వెల్ఫేర్‌) ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ, లేబర్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, పర్సనెల్‌ ఆఫీసర్, కార్పొరేట్‌ సెక్టార్‌ మేనేజర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, సోషల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌.. మొదలైన హోదాలు కేటాయిస్తారు. 
విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల మధ్య సమన్వయం ఉండేలా చూడటం స్కూల్‌ సోషల్‌ వర్కర్ల పని. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వచ్చే సమస్యలను కౌన్సెలింగ్‌తో పరిష్కరిస్తారు. పిల్లలతో ఎలా మెలగాలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సలహాలు ఇవ్వడం వీరి ప్రధాన బాధ్యత. 
మానసిక ఒత్తిడి/ ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి దాన్నుంచి బయటపడే మార్గాలను సూచించడం సైకియాట్రిక్‌/ క్లినికల్‌ సోషల్‌ వర్కర్ల బాధ్యత. వీరు ఆసుపత్రులు, మానసిక చికిత్సా కేంద్రాల్లో సేవలందిస్తారు. 
నేరాలు, వాటికి దారితీసే కారణాలు, నివారణ మొదలైన అంశాలకు సంబంధించినది... క్రిమినాలజీ అండ్‌ కరెక్షనల్‌ సోషల్‌ వర్క్‌.. జైళ్లు, జువనైల్‌ కేంద్రాల్లో వీరు సేవలు అందిస్తారు. 
మెడికల్‌/ పబ్లిక్‌ హెల్త్‌ / హాస్పిటల్‌ సోషల్‌ వర్కర్లు నర్సింగ్, వ్యక్తిగత సేవలు అందిస్తుంటారు. వీరు ఏజెన్సీలతో లేదా స్థానిక సంస్థలతో కలిసి పనిచేస్తారు.
సోషల్‌ వర్క్‌ పూర్తిచేసుకున్నవారు హెల్త్‌కేర్, అడాప్షన్, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్, కమ్యూనిటీ పోలీసింగ్‌ విభాగాల్లో కౌన్సెలర్‌గా ఉద్యోగం పొందొచ్చు. 
సోషల్‌ వర్కర్లు బోధనరంగాన్ని కూడా ఎంచుకోవచ్చు. కొన్నేళ్ల అనుభవం తర్వాత వివిధ సంస్థలకు కన్సల్టెంట్‌గా వ్యవహరించవచ్చు. ఫ్రీలాన్స్‌ సేవలు అందించవచ్చు.చదివిన స్పెషలైజేషన్‌ బట్టి పర్యావరణం, మాతాశిశు ఆరోగ్యం, పునరావాసం, గ్రామీణ, పట్టణ ప్రాంతీయాభివృద్ధి తదితర విభాగాల్లో వీరికి అవకాశాలుంటాయి.   

ప్రభుత్వ పరంగా వీరికి లెక్చరర్, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (చైల్డ్, యూత్, విమెన్, లేబర్‌) కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌..తదితర ఉద్యోగాలుంటాయి. ప్రభుత్వేతర రంగంలో.. ప్రాజెక్ట్‌ డైరెక్టర్, ప్రోగ్రాం ఆఫీసర్, ప్రోగ్రాం డైరెక్టర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్,  అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్, ప్రోగ్రాం అసిస్టెంట్, ప్రొజెక్ట్‌ ఆఫీసర్, కమ్యూనిటీ మొబిలైజర్, ప్రోగ్రాం మేనేజర్, బ్లాక్, డిస్ట్రిక్ట్, స్టేట్, జోనల్, రీజనల్‌ కోఆర్డినేటర్, కౌన్సెలర్, సోషల్‌ సైంటిస్ట్, మానిటరింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ ఆఫీసర్, రిసెర్చ్‌ ఆఫీసర్, స్కూల్‌ సోషల్‌ వర్కర్‌..తదితర హోదాలతో అవకాశాలు దక్కుతాయి. 


 

కోర్సులు

 
మరిన్ని