• facebook
  • whatsapp
  • telegram

నిన్ను నువ్వు తెలుసుకో!

కెరియర్‌ను తీర్చిదిద్దుకునే దారి

 

ఒక ఆట గెలవాలంటే ప్రత్యర్థి బలాలను తెలుసుకోవాలంటారు పెద్దలు. ఇక్కడ మన బలహీనత ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్తపడితే చాలు. కెరియర్‌ గేమ్‌లో విజయం దక్కాలంటే మాత్రం సొంత బలాలూ, బలహీనతలూ తెలుసుకుని ఉండాలి. నేటితరంలో.. ఉద్యోగ సాధన అయినా, అంకుర సంస్థ ఏర్పాటు అయినా ఒకసారి తిరస్కరణ వచ్చిందంటే కుంగిపోయేవారే ఎక్కువ. దీని నుంచి తప్పించుకోవాలన్నా.. విజయపథం వైపు సాగాలన్నా స్వీయ విశ్లేషణ అవసరమంటున్నారు నిపుణులు!


ప్రముఖ సంస్థలను గమనించండి... ఏటా వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాయి. తద్వారా భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలో నిర్ణయించుకుంటాయి. బృందంగా చేసే పనులు, ఆటలను పరిశీలిస్తే.. గెలిచినపుడు సానుకూలాంశాలనూ, విఫలమైనప్పుడు కారణాలనూ విశ్లేషిస్తారు. రెండింటి విషయంలోనూ ఉద్దేశం ఒక్కటే. ఫలితానికి అనుగుణంగా భవిష్యత్‌ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం.

కళాశాల నుంచి కెరియర్‌లోకి అడుగుపెట్టే ఉద్యోగార్థికీ ఈ సూత్రం వర్తిస్తుంది అంటున్నారు నిపుణులు. ఉద్యోగ/ వ్యాపార ప్రక్రియలోకి అడుగుపెట్టే ముందే దీనికి సంబంధించిన పరిశోధనను చేయాలంటున్నారు. ఈ ప్రక్రియనే స్వాట్‌ (SWOT) అనాలిసిస్‌గా చెబుతాం.అంటే... 
స్వాట్‌ 4 అంశాలకు సంబంధించి జాబితాగా రాసుకోవాలి. ఇక్కడ నిజాయతీగా ఉండగలగాలి. 

ఎస్‌- స్ట్రెంత్‌ (బలాలు) 
డబ్ల్యూ- వీక్‌నెసెస్‌ (బలహీనతలు) 
ఓ- ఆపర్చ్యునిటీస్‌ (అవకాశాలు) 
టీ- థ్రెట్స్‌ (అవరోధాలు)గా చెప్పొచ్చు.

ఇది స్వీయ విశ్లేషణ ప్రక్రియ. ఉదాహరణకు ఇంటర్వ్యూలనే తీసుకోండి. అభ్యర్థిని తన బలాలు, బలహీనతలు ఏంటో చెప్పమని అడుగుతుంటారు. అభ్యర్థికి తనపై తనకు ఎంతవరకూ అవగాహన ఉందో తెలుసుకోవడం వారి ఉద్దేశం. కానీ.. ఒక వ్యక్తి విజయంలో అంతర్గత అంశాలతోపాటు బాహ్యకారకాల ప్రాధాన్యమూ ఉంటుంది. వీటిపై అవగాహన వస్తేనే.. సరైన దిశలో ముందుకు సాగడం సాధ్యమవుతుంది. అందుకు స్వాట్‌ విశ్లేషణ సాయపడుతుంది. విద్యార్థికి తన బలాలతోపాటు బలహీనతలు, తనకున్న అవకాశాలను పరిశీలించుకునే అవకాశం దీని ద్వారా వస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో తన స్థానమేదో, ఇతరులతో పోలిస్తే తను ఎంతవరకూ ముందున్నాడో లేదా వెనక ఉంటే ఏయే అంశాల్లో వెనుకబడ్డాడో లాంటి విషయాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. కెరియర్‌లో పురోగతి సాధించడానికి ఈ విశ్లేషణ సాయపడుతుంది. సరైన మార్గనిర్దేశం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటిలో బలాలు, బలహీనతలు అంతర్గత కారకాలు (ఇంటర్నల్‌) గానూ; అవకాశాలు, అవరోధాలు బాహ్య కారకాలు (ఎక్స్‌టర్నల్‌)గానూ వస్తాయి.

 

బలాలు
సంస్థలు ఆశించే నైపుణ్యాలు, సబ్జెక్టు పరిజ్ఞానం, సామర్థ్యాలు మీలో ఏమున్నాయో చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితినే తీసుకుందాం. ఆర్థికంగా ప్రపంచమంతా నష్టపోయింది. సంస్థలు ఎంపిక ప్రక్రియను నిలిపివేయడమే కాకుండా ఉన్నవారినే తగ్గించుకున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఎంపిక ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితిలో సంస్థలు ఏం చేస్తాయి? అదనపు విలువను జోడించగలిగేవారికే ప్రాధాన్యమిస్తాయి. అలాంటి నైపుణ్యాలు మీలో ఏమున్నాయో చూసుకోవాలి. ఇక నైపుణ్యాల సంగతి. ఇక్కడ హార్డ్, సాఫ్ట్‌.. రెండు నైపుణ్యాలకీ ప్రాధాన్యమివ్వాలి. రంగంతో సంబంధం లేకుండా ఇప్పుడు సాంకేతిక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. కంప్యూటర్‌ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్‌ వంటివి హార్డ్‌ స్కిల్స్‌ కిందకి వస్తాయి. తోటివారితో మెలగడానికీ, కలిసి పనిచేయడానికీ అవసరమైన నైపుణ్యాలను సాఫ్ట్‌ స్కిల్స్‌గా చెబుతాం. 
ఈ అంశాలను అంచనావేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు-
ఇతరుల కంటే ఏయే అంశాల్లో మీరు మెరుగ్గా ఉన్నారు?/ ఇతరులకు కష్టంగా అనిపించి, మీరు సులువుగా చేయగలిగేవేంటి? 
ఇతరులకు ఏయే అంశాల్లో మిమ్మల్ని సంప్రదిస్తారు? వారికి మీరెలా సాయపడతారు? 
మిమ్మల్ని సానుకూలంగా మలిచే బాహ్య, అంతర్గత అంశాలేంటి?
మీలో ఏ అంశాలు ఉద్యోగానికి బాగా పనికివస్తాయని మీరు భావిస్తున్నారు?
కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు మీలో చూసే బలాలేంటి? 
మీరు గొప్పగా భావించే విజయాలు 
మీకున్న మంచి పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు.

 

బలహీనతలు
కష్టంగా భావించే అంశాలకు దీనిలో ప్రాధాన్యమివ్వాలి. చేయాలనుకునీ చేయలేకపోతున్నవీ, కొంచెం ప్రయత్నిస్తే చేయగలిగినవీ, అందుకోవాలనుకున్న స్థానం అన్నింటికీ ఇందులో చోటివ్వాలి. సబ్జెక్టులు/ కోర్సులు, నైపుణ్యాలు, సామర్థ్యాలు.. ఏవి కొరవడ్డాయో రాయాలి. మెరుగుపరచుకోవాల్సిన సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన అంశాలనూ చేర్చాలి. కొన్ని ఉదాహరణలు..
అనుభవ లేమి 
తగినంత విద్యార్హతలు/ సర్టిఫికేషన్లు 
నిర్దేశిత లక్ష్యాలు లేకపోవడం 
ఉద్యోగ పరిజ్ఞానం లేకపోవడం 
సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేమి 
తగిన నైపుణ్యాలు లేకపోవడం (లీడర్‌షిప్, ఇంటర్‌ పర్సనల్, కమ్యూనికేషన్‌ మొదలైనవి) 
ఉద్యోగ ప్రయత్నం ఎలా చేయాలో తెలియకపోవడం 
నెగెటివ్‌ వ్యక్తిగత అంశాలు (సమయపాలన లేకపోవడం, బిడియం, భావోద్వేగాలపై పట్టు లేకపోవడం వంటివి).

 

అవకాశాలు
చుట్టూ అందుబాటులో ఉండే అంశాలు.. వనరులు, మార్కెట్‌ ధోరణులు ఇలా కెరియర్‌ మెరుగుదలకు సాయపడేవాటికి దీనిలో చోటివ్వాలి. అంటే మన అధీనంలో లేకపోయినప్పటికీ కెరియర్‌ ఎదుగుదలకు సాయపడే బాహ్య పరిస్థితులను ఇందులో చేర్చుకోవాలి. 
 మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకున్నారు. రాబోయే అయిదు సంవత్సరాల్లో ఉపాధ్యాయుల అవసరం 15% పెరగనుందని నిపుణులు అంచనా వేశారనుకుందాం. ఇది అభ్యర్థి చేతిలోలేని బాహ్య అనుకూలాంశం అవుతుంది. 
పరిశ్రమ అభివృద్ధి 
నెట్‌వర్క్‌ 
నేర్చుకున్న కాన్సెప్టులు/ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ 
ఎంచుకున్న రంగంలో వస్తున్న సానుకూల ధోరణులు 
పెరుగుతున్న అవకాశాలు 
ప్రొఫెషనల్స్‌కు పెరుగుతున్న ఆదరణ 
అందించే ప్రత్యేక అవకాశాలు మొదలైనవన్నీ దీనికిందకి వస్తాయి.

 

అవరోధాలు
మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డుగా ఉన్నవాటిని ఇందులో చేర్చాలి. బాహ్య కారకాలకే పరిమితం కావాలి. తక్కువ ఉద్యోగావకాశాలు, ఎక్కువ పోటీ, పరిశ్రమకు సంబంధించి వస్తున్న ప్రతికూల మార్పులు.. వంటివన్నీ దీనికిందకి వస్తాయి. అవరోధాలకూ ప్రాముఖ్యం ఎందుకివ్వాలంటే.. మన అవరోధాలేంటో తెలిస్తే వాటిని అనుకూలంగా మార్చుకోవడమో, దాని ప్రభావాన్ని తగ్గించుకోగలగడమో చేసే అవకాశముంటుంది.
ఉదాహరణకు- మీదో చిన్న పట్టణం అనుకుంటే.. అప్పటివరకూ పరిచయం లేకపోయినా డిమాండ్‌ పెరుగుతుందనుకున్న ఒక వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకుందాం అనుకున్నారు. తీరా ప్రారంభించి, బాగానే కొనసాగుతోందనుకున్నపుడు అక్కడి కళాశాల దానికి సంబంధించిన కోర్సును ప్రవేశపెట్టింది. కళాశాల తీసుకున్న ఈ నిర్ణయం ఒక్కసారిగా పదులు/ వందల్లో పోటీదారులను తీసుకొస్తుంది. పైగా వారి చేతిలో అధికారిక పట్టా చేతిలో ఉంటుంది. ఇది మీకు ప్రతికూల అంశం. ఈ విషయాన్ని గమనించి మీరూ దూరవిద్య ద్వారానో, ఆన్లైన్‌లోనో సంబంధిత కోర్సులో చేరితే డిగ్రీతోపాటు అనుభవమూ సొంతం చేసుకున్నట్లు అవుతుంది. అప్పుడు మీకు అది అనుకూలాంశం అవుతుంది. పూర్తిగా ముప్పు తప్పకపోయినా కనీసం ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
పరిశ్రమ పరంగా ఎదురవుతోన్న ప్రతికూల ధోరణులు/ మీలాంటి కెరియర్‌ నే ఎంచుకున్నవారు ఎదుర్కొంటున్న సవాళ్లు 
మీ పోటీదారులు 
టెక్నాలజీ మార్పులు 
కెరియర్‌ మార్చుకోవడంలో ఉన్న కష్టాలు 
తక్కువ ఉద్యోగావకాశాలు  
పోటీదారులకు ఉన్న మెరుగైన నైపుణ్యాలు 
తక్కువ ఉన్నతస్థాయిని అందుకునే అవకాశాలు 
మీ మేజర్‌/ డిగ్రీకి తగినంత విలువ లేకపోవడం మొదలైనవన్నీ దీనిలో చేర్చుకోవచ్చు.

 

ఆపై ఏం చేయాలి?
స్వాట్‌ విశ్లేషణ రాయడం పూర్తయ్యాక ఓసారి తరచి చూసుకోవాలి. బాగా గమనిస్తే మీ పరిస్థితిపై పూర్తి అవగాహన వస్తుంది. ఇక్కడ రెండు అంశాలు- సరిపోల్చుకోవడం, మార్చుకోవడం ప్రాధాన్యమివ్వాలి.

ఉదాహరణకు- బలాలు, అవకాశాలను సరిపోల్చుకోవాలి. ఇవి ఏ అవకాశాలను చేజిక్కించుకోవచ్చో, ఎంతమేరకు ప్రయత్నించవచ్చో తెలుసుకోవడానికి సాయపడుతుంది. అలాగే బలహీనతలు, అవరోధాలను పోల్చుకోవడం ద్వారా వేటిపై దృష్టిసారించాలో, వేటికి దూరంగా ఉండాలో, వేటిపట్ల జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవచ్చు.

ఇక మార్చుకోవడం విషయానికొస్తే.. బలహీనతలను బలాలుగా, అవరోధాలను అవకాశాలుగా మార్చుకోగల అంశాలను పరిశీలించాలి. అంటే చదవడం లేదా సాధన ద్వారా అదనపు నైపుణ్యాలను చేజిక్కించుకోవడం వంటి వాటిపై అవగాహన తెచ్చుకోవచ్చు. మీ నేపథ్యం మార్కెటింగ్‌ అనుకుందాం. కానీ మీది నలుగురితో కలవగల మనస్తత్వం కాదనుకుంటే మార్కెటింగ్‌ మీకు తగిన కెరియర్‌ కాదు. కానీ.. మీకు అదే నచ్చిన కెరియర్‌ అయితే.. మీరు నలుగురితో కలవలేకపోవడాన్ని మార్చుకునేలా ప్రయత్నిస్తే నచ్చిన కెరియర్‌లో కొనసాగడం సాధ్యమవుతుంది. అంటే ఒక బలహీనతను బలంగా మార్చుకున్నట్టు అవుతుంది. ఈ రెండు విధానాలను క్షుణ్ణంగా పరిశీలించుకుంటే దృష్టి పెట్టాల్సిన అంశాలు, కోరుకునే ఉద్యోగ తీరు, మార్చుకోవాల్సిన/ తప్పక నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు.. మొదలైనవాటిపై అవగాహన ఏర్పడుతుంది. ఇవి కెరియర్‌లో పురోగతికి ఏమేం అవసరమో తెలుసుకోవడానికి సాయపడతాయి. 

నిజానికి ఈ విశ్లేషణ అంతా అసలు పనికి ముందు తరచి చూసుకునే లాభనష్టాల్లాంటిదే. చివరగా.. అనుకూల అంశాలను ఇంకా ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో తెలుసుకోవాలి; ప్రతికూల అంశాలను మెరుగుపరచుకునే విధానాల కోసం ప్రయత్నించాలి. ఇలా చేస్తే.. విజయానికి చేరువ అవ్వడానికి ఎంతో కాలం పట్టదు. నిజానికి తనపై తాను పూర్తిగా అవగాహన తెచ్చుకోవడంలోనే సగం విజయం దాగి ఉంటుంది. మిగతా సగం దాన్ని తీర్చిదిద్దుకోవడంలోనే ఉంటుందన్నది నిపుణుల మాట! 

  • Tags :

 

కోర్సులు

మరిన్ని