• facebook
  • whatsapp
  • telegram

మార్పు మలుపు తిరిగేముందు...

‘ఫలానా సమయంలో.. ఆ కెరియర్‌/ కోర్సును ఎంచుకుని ఉంటేనా..’ ఏదో ఒక సందర్భంలో చాలామంది అంటుంటారు. నిజానికిది అవతలి వ్యక్తి మనసులో దాచుకున్న అసంతృప్తికి నిదర్శనం. కెరియర్‌ నిర్ణయంపై ఇష్టంగానో, అయిష్టంగానో చాలా అంశాలు ప్రభావం చూపుతుంటాయి. తీరా ఒకానొక దశ చేరుకున్నాక చాలా సందర్భాల్లో ఆ అసంతృప్తి ఏదోవిధంగా బయటపడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఏదోవిధంగా నెట్టుకొద్దామనుకునేవారు కొందరైతే, నచ్చిన కెరియర్‌ వైపు మారిపోయేవారు ఇంకొందరు. ప్రస్తుత పరిస్థితుల్లో కెరియర్‌ మార్పు చాలామందికి తప్పనిసరి అవుతోంది. ఇలాంటప్పుడు హడావుడిగా కాకుండా ప్రణాళిక ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల మాట.

 

 

‘ధోనీ’ సినిమా చూశారా? ఇలాంటి సినిమాలు టీవీలో వస్తున్నపుడు గమనించండి. చాలామంది మాకూ అలాంటి అవకాశం వస్తే బాగుండేదనో.. అనవసరంగా నచ్చిన దారిలో వెళ్లలేదే అనో అభిప్రాయం వెలిబుచ్చుతుంటారు. కెరియర్‌ పరంగా ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయడమే ఇదంతా. నిజానికి మన దగ్గర చాలావరకూ కెరియర్‌ నిర్ణయం తల్లిదండ్రుల, బంధువుల సూచన, తోటివారిని అనుసరించడం, అప్పటికి ఎక్కువ ఆదరణ ఉన్న ఉద్యోగం/ ఎక్కువ జీతం వచ్చేది.. వీటి ఆధారంగా జరిగిపోతుంటుంది. కెరియర్‌ ఏదైనా దానిలో రాణించాలంటే ఆసక్తి, సంబంధిత ప్రావీణ్యం ఉండటం తప్పనిసరి. ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో అసంతృప్తి ఎదురవుతుంది.

 

ఇదంతా ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి. దీనికి ఇప్పుడు కరోనా ప్రభావం తోడైంది. కొన్ని రంగాలు డీలా పడగా, కొన్ని ఉద్యోగాలే లేకుండా పోయాయి. దీంతో చాలామందికి కెరియర్‌ను మార్చుకోవడం తప్పనిసరి అయింది. గతంలో ఒక్కసారి కెరియర్‌ నిర్ణయం తీసుకున్నాక పరిస్థితి ఎలా ఉన్నా చాలామంది దానిలోనే కొనసాగేవారు. ఇప్పుడు పరిస్థితులు, ఆసక్తుల ఆధారంగా మార్చుకుంటున్నవారూ ఉన్నారు. సంస్థలూ నైపుణ్యాలు ఉంటే ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. కాబట్టి, అసంతృప్తిగా ఉన్నదానిలో కొనసాగడం కంటే ఆసక్తి ఉన్నదానివైపు వెళ్లడం మంచి నిర్ణయమే. అయితే ఈ నిర్ణయం తీసుకునేప్పుడు జాగ్రత్తగా అడుగు వేయడం మాత్రం తప్పనిసరి.

 

మార్పు ఎందుకు?
కెరియర్‌ మార్పు అనేది నిజంగా పెద్ద నిర్ణయం. కాబట్టి ముందు అందుకు దారితీసిన పరిణామాల గురించి క్షుణ్ణంగా ఆలోచించుకోవాలి. ఆసక్తి లేకపోవడం, ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండటం, అభివృద్ధికి అవకాశాలు లేకపోవడం.. ఇలా ప్రతి కారణాన్నీ జాబితాగా రాసిపెట్టుకోవాలి. ఇదంతా ఎందుకంటే.. మారాలనుకున్న నిర్ణయం సరైనదేనా కాదా అన్న అవగాహనను తెచ్చుకోవడానికి మాత్రమే. ఇందుకు అవసరమైతే మీ గురించి బాగా తెలిసిన వారి సాయం తీసుకోవచ్చు. మొత్తంగా నిర్ణయం తీసుకునే ముందు సరైన కారణం ఉందేమో గమనించుకోవడం తప్పనిసరి.

 

ఎంపిక ఎలా?
ఆసక్తి, ఆకర్షణ.. ఈ రెండిట్లో దేని ఆధారంగా ఎంచుకుంటున్నారో గమనించుకోవాలి. ఎందుకంటే.. ఒక కెరియర్‌ నుంచి వచ్చే లాభాలు, పేరు ప్రఖ్యాతులను చూసి దాన్ని ఎంచుకోవాలనుకోవడం ఆకర్షణ అవుతుంది. అలాకాకుండా దానిని మనస్ఫూర్తిగా మెచ్చి, దాని గురించి లోతుగా తెలుసుకుని దానిలో ఏదో ఒకటి సాధించాలనుకుంటే అది ఆసక్తి అవుతుంది. నిజానికి ఒక కెరియర్‌లో విజయం సాధించడానికి ఆసక్తి మాత్రమే కూడా సరిపోదు. అది తమకు నప్పుతుందో లేదో; స్వభావానికి తగినదో కాదో కూడా చూసుకోవాలి. అవసరమైతే కొన్ని ప్రక్రియల సాయం తీసుకోవచ్చు.

 

సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టూల్స్‌.. విద్యార్థులకే కాదు.. ఉద్యోగార్థులకూ దిశా నిర్దేశం చేసుకోవడానికి ఇవి సాయపడతాయి. ఇవి రెండు విధాలుగా అభ్యర్థికి తోడ్పడుతాయి. 
1. ఒకటి- తనని గురించి విద్యార్థి తాను తెలుసుకోవడానికీ 
2. తను చదివిన/ తనకు పట్టు ఉన్న అంశాల ఆధారంగా ఉన్న కెరియర్ల గురించి అవగాహన తెచ్చుకోవడానికీ సాయపడతాయి. 
ఒకరకంగా ఇది ఒక పరీక్ష లాంటిదే. కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు వాటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంచుకున్నదాన్ని బట్టి, అడిగే ప్రశ్నలతీరులో మార్పులుంటాయి. వీటిలో అభ్యర్థి దృష్టికి రాని, అనవసరం అని భావించే కీలక అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా అతని బలాలు, బలహీనతలను తెలుసుకునే వీలు కల్పిస్తారు. ఎంచుకున్న కెరియర్‌ తమకు తగినదో కాదో అవగాహన కలుగుతుంది. ఇందుకుగానూ వారు కొన్ని టూల్స్, టెక్నిక్‌లను ఉపయోగిస్తారు.

 

పాత దానితో పోలిస్తే..
నచ్చినది, స్వభావానికి తగినది ఎంచుకున్నారు. అంతటితో సరిపోదు కదా! అవకాశాలూ అందుకు తగ్గట్టుగానే ఉండాలి. ఉదాహరణకు- గత కెరియర్‌ మీ స్వభావానికి సరిపోవడం లేదనో, ఆసక్తికరంగా లేదనో మార్చుకున్నారనుకుందాం. ఈ కొత్త కెరియర్‌ మీ సృజనాత్మకతకు పదును పెట్టేలా, ఆసక్తి కలిగించేలా ఉందనుకుందాం. భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు లేనపుడు దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి, కొత్తగా ఎంచుకున్నది పాతదానికంటే మెరుగైన అవకాశాలు, ప్రయోజనాలను కల్పించినపుడే అది లాభదాయకం. కాబట్టి, ఈ అంశాలను తప్పక గమనించుకోవాలి. అలాగే ప్రస్తుత పరిస్థితి ఆధారంగానే నిర్ణయానికి రావొద్దు. భవిష్యత్‌లో కొన్నేళ్లపాటు మెరుగ్గా ఉంటుందో లేదో కూడా చూసుకోవాలి. కొంత పరిశోధన చేస్తే ఈ వివరాలను తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఇంటర్నెట్, ప్రభుత్వ ప్రచురణలు ఇందుకు సాయపడతాయి. ఆ రంగంలోని వ్యక్తులు, మీ గురించి బాగా తెలిసిన వారితోనూ ఈ విషయంగా సంప్రదించవచ్చు. సంబంధిత రంగ నిపుణులు మార్గనిర్దేశం చేయడానికి సాయపడతారు. కాగా.. మీ గురించి బాగా తెలిసినవారు మీకు అది సరిపోతుందో లేదో తెలియజేయడంలో తోడ్పడతారు.

 

ఇలా ప్రయత్నించి చూడండి  
దూరపు కొండలు నునుపు.. ఈ సామెత విన్నారా? కెరియర్‌ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సాధారణంగా ఎక్కువ శాతం కెరియర్‌ ఎంపికలో విజయం సాధించినవారి ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే.. ఎక్కువ శాతం దానిలో విజయవంతంగా ముందుకు సాగుతున్నవారిపై, దాని కారణంగా వచ్చే లాభాల పెనేౖ దృష్టిసారిస్తారు. సాధారణంగా కెరియర్‌ గురించిన నిర్ణయం ఈవిధంగా సాగుతుంది. మార్పు సమయంలోనూ ప్రధాన ప్రభావం వీటి ఆధారంగానే ఉంటుంది. కాబట్టి, నిర్ణయం తీసుకునేముందు ఓసారి దాన్ని దగ్గర్నుంచి చూసే ప్రయత్నం చేయడం మంచిది. అంటే.. ఇదివరకే దానిలో కొనసాగుతున్నవారిని దగ్గర్నుంచి గమనించడం, ఫ్రీలాన్స్, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను ప్రయత్నించి చూడటం మంచిది. 
ఉదాహరణకు- గతంలో సాఫ్ట్‌వేర్‌ రంగానికి ఒక్కసారిగా క్రేజ్‌ వచ్చింది. దానిలో అందించే ఎక్కువ జీతాలే అందుకు ప్రధాన కారణమైంది. దీంతో చాలామంది ఆ దిశగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఇక్కడ చాలామంది చూపు అందులో చేరినవారు, వారు అందుకుంటున్న జీతాలపైనే ఉంది. కానీ.. సంబంధిత రంగంలో చేరడానికి అవసరమైన కోర్సుల్లో చేరి, అవి కొరుకుడు పడక అటు పాత దానివైపు వెళ్లక, కొత్తగా ఎంచుకున్నదానివైపు వెళ్లలేక ఇబ్బంది పడినవారు చాలామందే ఉన్నారు. కాబట్టి, ఉన్నత స్థాయివారికే పరిమితం కాకుండా అది చేరడానికి పడే కష్టాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి, దగ్గర్నుంచి పరిశీలించే అవకాశాలకోసం ప్రయత్నించాలి.

కెరియర్‌ మార్పు ఆలోచన వచ్చాక, తగినదేదో ఆలోచించుకోవడం మొదటి దశ అయితే.. ఆ నిర్ణయం వెనుక పరిణామాలను బేరీజు వేసుకోవడం రెండో, అతి ముఖ్యమైన దశ అవుతుంది. దీని గురించి జాగ్రత్తగా ఆలోచించుకున్నాకే ముందుకు సాగాలి. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు..

 

కుటుంబంతో సంప్రదించారా?
ఎవరి కెరియర్‌ అయినా అది వారి సొంత విషయమే. కానీ.. దాని ప్రభావం పడేవారిలో కుటుంబమూ ఉంటుంది. కాబట్టి, ఈ విషయంలో వారిని సంప్రదించడం మర్చిపోవద్దు. నిర్ణయం తీసేసుకున్నాక వారికి చెప్పడం కంటే.. ఆలోచన దశలోనే వారికి తెలియజేయడం మంచిది. మీ ఆలోచన సబబుగా అనిపిస్తే మంచి సూచనలు, ప్రోత్సాహాన్నీ పొందొచ్చు. లేదంటే అనవసరంగా వారి అసంతృప్తికి గురికావాల్సి వస్తుంది.

 

ఇక్కడా అవరోధాలు ఎదురైతే?
ఉద్యోగం/ కోర్సు అకస్మాత్తుగా మారాలనుకుంటున్నారంటే ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది.  కొత్తగా ఎంచుకున్నదానిలోనూ అందుకు ఆస్కారం లేకపోలేదు. ఒకవేళ భవిష్యత్‌లో ఇక్కడా అలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేద్దామనుకుంటున్నారు? దీని గురించీ ఆలోచించుకోవాలి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు.. అన్న సామెత వినే ఉంటారు కదా. దానికి ఇక్కడ ప్రాధాన్యమివ్వాలి.

 

ఇందుకు సిద్ధమేనా?
ఉదాహరణకు- గ్రాడ్యుయేషన్‌ రెండో ఏడాదిలో కోర్సు మారాలనుకున్నారనుకుందాం. మీతోటివారు ఏడాది తరువాత ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడితే మీరు ఇంకా మూడు ఏళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. సమయానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఇక్కడ గమనించాలి. ఇక ఉద్యోగుల విషయానికొస్తే.. వారు ప్రారంభ స్థాయి నుంచి మొదలుపెట్టాలి. ఇందుకు ఎంతవరకూ సిద్ధమో గమనించుకోవాలి.

 

ఆదాయం మాటేంటి?
కెరియర్‌ ఏదైనా నచ్చడం, స్వభావానికి తగినది అవ్వడంతో సరిపోదు. జీవించడానికి తగిన వనరులనీ సమకూర్చాలి. అందుకు తగ్గ ఆదాయం అందివ్వగలగాలి. సాధారణంగా చాలామంది కెరియర్‌ మార్పు నిర్ణయం ఆదాయం ఆధారంగానే ఉంటుంది. ఒకవేళ కాకపోయినా ఆదాయ అవకాశాలు ఎలా ఉన్నాయో, దాని మెరుగుదలకు ఎలాంటి అవకాశాలున్నాయో చూసుకోవాలి.

 

సంస్థలు.. నైపుణ్యాలు
ప్రతి రంగానికి సంబంధించి కొన్ని ప్రముఖ సంస్థలుంటాయి. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన సంస్థల వివరాలను తెలుసుకోవాలి. అవి తాము ఎంచుకునే అభ్యర్థుల నుంచి ఏమేం ఆశిస్తున్నాయో, ఏ నైపుణ్యాలను కోరుతున్నాయో ముందస్తుగానే తెలుసుకోవాలి. అవసరమైతే సంబంధిత కోర్సులు, సర్టిఫికేషన్లపై దృష్టి పెట్టాలి. 

 

కోర్సులు

మరిన్ని