• facebook
  • whatsapp
  • telegram

సేవల మార్గం ఉపాధి తథ్యం

ఇంట్లో వాళ్లు కూడా చేయడానికి ఇబ్బందిపడే సేవలను ఇసుమంత విసుగు లేకుండా అందిస్తారు నర్సులు. ఇంత సహనం, ఓపిక కొంత సహజంగా ఉన్నవాళ్లు ఈ రంగంవైపు దృష్టి సారిస్తుంటారు. మరికొంత శిక్షణతో అలవడుతుంది. ఆరోగ్య సంరక్షణ పట్ల ఆసక్తి పెరిగిన ఆధునిక యుగంలో నర్సులకు ఎప్పటికీ తరగని డిమాండ్‌ ఏర్పడింది. నర్సింగ్‌లో ఏ స్థాయి శిక్షణ పొందినా వెంటనే ఉపాధి లభిస్తోంది. జులై, ఆగస్టుల్లో పలు ప్రకటనలు వెలువడనున్న నేపథ్యంలో సేవలనే జీవితంగా మార్చుకోవాలని ఆశించే అభ్యర్థుల అవగాహనకు వివిధ కోర్సులు, ఉద్యోగావకాశాల వివరాలు...

 

వ్యాధిగ్రస్థులకు ప్రాణావసరమైన చికిత్సలో వైద్యుడిదే ముఖ్యపాత్ర. కానీ రోగి ఆరోగ్య సంరక్షణ బాధ్యతల్ని శ్రద్ధగా నిర్వర్తించి, సంపూర్ణంగా కోలుకునేలా చేసేది మాత్రం నర్సే. రోగికి ఔషధాలను క్రమం తప్పకుండా అందించడం.. సూచించిన పరీక్షలను చేయించడం.. అధైర్యంగా ఉన్నప్పుడు మానసిక స్థైర్యాన్ని నింపడం..నర్సులు నిర్వర్తించే అమూల్య సేవలు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని చికాకులున్నా.. వాటన్నింటినీ పక్కనబెట్టి చిరునవ్వుతో, సహనంతో రోగికి శారీరక, మానసిక సాంత్వనను చేకూర్చే నర్సుల అవసరం ఆధునిక సమాజంలో పెరుగుతోంది. దీనికి సంబంధించిన కోర్సులకు గిరాకీ ఏర్పడుతోంది.

సేవాభావంతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, తార్కిక ఆలోచన, సహనం, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఈ వృత్తిలో బాగా రాణించగలుగుతారు.

* నర్సింగ్‌ విద్యాసంస్థను ఎంపిక చేసుకోవడానికి ముందే.. ఆ సంస్థకు భారతీయ నర్సింగ్‌ మండలి నుంచి గానీ, రాష్ట్ర నర్సింగ్‌ మండలి నుంచిగానీ గుర్తింపు, అనుమతులున్నాయా? లేవా? అనేది కచ్చితంగా సరిచూసుకోవాలి.

* ఇందుకోసం నర్సింగ్‌ మండలి అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

* నర్సింగ్‌ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి కనీసం 100 పడకలది ఉండాలి.

* విద్యాభ్యాస సమయంలోనే ఆసుపత్రుల్లో అనుభవపూర్వక శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ తరహా ఏర్పాట్లు కళాశాల నిర్వహిస్తుందా? లేదా? చూసుకోవాలి.

* వసతిగృహాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాల, పరిపాలన విభాగం, 24 గంటల నీళ్ల సరఫరా, కఠినమైన భద్రత, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి.

 

ఐదు స్థాయుల్లో...

 

నర్సింగ్‌ విద్యను ఐదు విభాగాలుగా విభజిస్తారు. ఇందులో కింది స్థాయి నుంచి చూసుకుంటే.. ‘యాగ్జ్జిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎం)' తొలి స్థాయిది. ఆపైన వరసగా ‘జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సు (జీఎన్‌ఎం)', ‘బీఎస్సీ నర్సింగ్‌', ‘పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌'. అన్నింటికంటే ఉన్నతస్థాయిలో ‘ఎంఎస్సీ నర్సింగ్‌'ను పరిగణిస్తారు. ఏ స్థాయి నర్సింగ్‌ కోర్సును పూర్తిచేసినా కెరియర్‌ వృద్ధి చాలా బాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనదేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సాధారణంగా అన్ని విభాగాల్లోనూ ఈ కోర్సుల ప్రవేశ ప్రకటనలు జులై- ఆగస్టు మాసాల్లోనే వెలువడుతున్నాయి.

 

 

1. ఏఎన్‌ఎం: దీనికి ఇంతకుముందు 10వ తరగతి అర్హతగా ఉండేది. 2012 నుంచి ఇంటర్మీడియట్‌ను కనీస అర్హతగా నిర్ణయించారు. రెండేళ్ల కోర్సు ఇది. ఇంటర్‌లో ఏ గ్రూపు వారైనా చేరొచ్చు. క్షేత్రస్థాయిలో, గ్రామీణంలో ఎక్కువగా అవకాశాలుంటాయి.

2. జీఎన్‌ఎం: ఇంటర్మీడియేట్‌ అర్హత. మూడేళ్ల డిప్లొమా కోర్సు ఇది. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం బైపీసీ విద్యార్థులకు మాత్రమే అర్హత. ప్రైవేటు కళాశాలల్లో ఏ గ్రూపువారికైనా ప్రవేశం ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్టాఫ్‌ నర్సులుగా పనిచేస్తుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరిన జీఎన్‌ఎం విద్యార్థులకు నెలకు రూ.1500 ఉపకార వేతనం లభిస్తుంది. ప్రతి ఏడాదికీ రూ.200 చొప్పున పెరుగుతుంది.

3. బీఎస్సీ నర్సింగ్‌: ఇంటర్మీడియట్‌లో బైపీసీ తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు రెండింటిలోనూ బైపీసీ అభ్యర్థులే అర్హులు. నాలుగేళ్ల కోర్సు ఇది. బీఎస్సీ విద్యార్థులకు కూడా నెలకు ఉపకార వేతనం రూ.1500 చొప్పున లభిస్తుంది. ఏటా రూ.200 చొప్పున పెరుగుతుంది. తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు.

4. పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌: జీఎన్‌ఎం చేసినవారు ఒక సంవత్సరం అనుభవంతో దీనికి అర్హులు. రెండేళ్ల వ్యవధి రెగ్యులర్‌ కోర్సు ఇది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దూరవిద్య విధానంలో అభ్యసిస్తే మాత్రం మూడేళ్లు. తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు.

5. ఎంఎస్సీ నర్సింగ్‌: బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసినవారు అర్హులు. రెండేళ్ల కాలవ్యవధి ఉండే కోర్సు ఇది. గతంలో ప్రవేశపరీక్షను నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంఎస్సీ నర్సింగ్‌ సీట్లను భర్తీ చేసేవారు. తెలంగాణలో తొలిసారిగా ఎలాంటి ప్రవేశపరీక్ష లేకుండానే.. గత ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్‌ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాల కోర్సులకు రిజర్వేషన్ల నిబంధనలను, ప్రతిభను ప్రాతిపదికగా చేసుకునే సీట్లను భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు.

 

 

స్పెషలిస్టు కోర్సులు

* ఎంఎస్సీ నర్సింగ్‌లో స్పెషలిస్టు విద్యకు అవకాశాలున్నాయి.

* మెడికల్‌, సర్జికల్‌ నర్సింగ్‌, సామాజిక వైద్యం (కమ్యూనిటీ హెల్త్‌), మానసిక వైద్యం, శిశు ఆరోగ్యం, స్త్రీ వైద్యంలో ప్రత్యేకంగా నర్సింగ్‌ కోర్సులున్నాయి.

* ఇవి కాకుండా ఐసీయూ, ఆర్థోపెడిక్‌, నవజాత శిశు సంరక్షణ (నియోనాటల్‌), ప్రసవాలు.. తదితర విభాగాల్లోనూ ఒక సంవత్సరం కోర్సు ఉంటుంది.

* జీఎన్‌ఎం, బీఎస్సీ తర్వాత.. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు.

* స్పెషాలిటీ కోర్సులు చేసినవారు ప్రత్యేకంగా ఆ విభాగాల్లోనే నైపుణ్యం సంపాదించి, అందులోనే సేవలందిస్తుంటారు.

* నర్సింగ్‌ విద్యాభ్యాసంలోనే సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్టులుంటాయి. సాధారణంగా మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందనేది అప్పుడే నేర్పిస్తారు.

 

కొలువుకు ఢోకా లేదు

* ఏ స్థాయి నర్సింగ్‌ కోర్సును పూర్తిచేసినా కెరియర్‌ వృద్ధి బాగా ఉంటుంది. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

* ఏఎన్‌ఎం చేస్తే.. వారి సొంత గ్రామంలోనే పనిచేసుకోవచ్చు. స్థానికంగానే అవకాశాలు లభిస్తాయి. వీరిలో కొందరు ప్రసవాలపై శిక్షణ పొందితే మరింతగా అవకాశాలు పెరుగుతాయి.

* జీఎన్‌ఎం పూర్తిచేస్తే స్టాఫ్‌నర్సుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ప్రైవేటు నర్సింగ్‌హోంల్లోనూ అవకాశాలుంటాయి.

* బీఎస్సీ నర్సింగ్‌ అభ్యసించినవారిని ఎక్కువగా కార్పొరేట్‌, ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చేర్చుకుంటారు.

* ఎంఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసినవారు.. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్‌ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా చేరుతుంటారు.

* అన్ని విభాగాల నర్సులకూ స్థాయి, అనుభవం, స్పెషాలిటీలను బట్టి కనీస వేతనాలుంటాయి.

* కింది స్థాయి నర్సింగ్‌ సేవలకు వేతనం తొలినాళ్లలోనే రూ.10-15 వేలుంటుంది. స్థాయిని బట్టి పెరుగుతుంటుంది.

 

విదేశాల్లో..

తెలంగాణలో ఏటా సుమారు 15 వేల మంది నర్సింగ్‌ విద్యను పూర్తిచేస్తుంటే.. ఇందులో కనీసం 15 శాతం మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. స్థానిక విద్యార్థులే కాకుండా కేరళ, మణిపూర్‌ తదితర ఇతర రాష్ట్రాల నుంచి కూడా నర్సింగ్‌ విద్యనభ్యసించడం కోసం ఇక్కడికి వస్తున్నారు. మన దగ్గర విద్యాభ్యాసం పూర్తయ్యాక ఏడాది, రెండేళ్లపాటు అనుభవపూర్వక శిక్షణ పొంది, గల్ఫ్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా, యూఎస్‌, యూకేలకు నర్సింగ్‌ సేవల కోసం వెళ్తున్నారు.


విదేశాలకు వెళ్లేముందు తప్పనిసరిగా రాష్ట్ర నర్సింగ్‌ మండలి నుంచి వ్యక్తిగత, ప్రవర్తన, నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన ధ్రువపత్రాలను పొందాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలోనే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో నర్సింగ్‌ వృత్తిని కొనసాగించుకోవాలన్నా.. రాష్ట్ర నర్సింగ్‌ మండలిలో తప్పనిసరిగా తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర నర్సింగ్‌ మండలిలో వృత్తిని కొనసాగించడానికి అనుమతి పత్రాన్ని పొందిన అనంతరమే.. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో సేవలు అందించడానికి మార్గం సుగమమవుతుంది. లేదంటే వృత్తిని కొనసాగించడానికి చెల్లుబాటు కాదు.

మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఒకవేళ నర్సింగ్‌ వృత్తిని కొనసాగించాలనుకుంటే.. ఆయా రాష్ట్రాల్లోని నర్సింగ్‌ మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకొని అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకు నర్సింగ్‌ విద్యను పూర్తిచేసిన రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రాన్ని పొందాలి.
అంకితభావం ఎంతో ముఖ్యం - బి.విద్యావతి, తెలంగాణ నర్సింగ్‌ మండలి రిజిస్ట్రార్‌నేను కూడా ఒక నర్సునే. ఈ వృత్తిలోకి ప్రవేశించే వారందరికీ కూడా ‘ఫ్లారెన్స్‌ నైటింగేల్‌' ఆదర్శం. ఆధునిక నర్సింగ్‌ వ్యవస్థకు ఆమె వ్యవస్థాపకురాలు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని సేవలందిస్తాం. ఒకానొక యుద్ధసమయంలో సైనికులకు ఉపశమనం కలిగించేలా సేవలందించిన ఘనత ఆమెది. కేవలం స్పర్శ ద్వారానే ఉపశమనం కలిగించారామె. మానవ సేవ చేసే భాగ్యం అందరికీ దక్కదు. అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ వృత్తిలోకి అడుగుపెట్టేటప్పుడు అంత ఆలోచన ఉండకపోవచ్చు. కానీ కెరియర్‌లో కొనసాగుతున్న క్రమంలో నర్సు వృత్తిలోని పవిత్రతను అర్థం చేసుకుంటారు. ఈ వృత్తిలో లభించే సంతృప్తి మరే వృత్తిలోనూ లభించదు. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకిచ్చే ఉపకార వేతనాన్ని రూ.5 వేలకు పెంచే ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి.
 

 


- అయితరాజు రంగారావు, ఈనాడు, హైదరాబాద్‌

 

 

కోర్సులు

మరిన్ని