• facebook
  • whatsapp
  • telegram

దివ్య‌మైన శిక్ష‌ణ‌కు కొన్ని కోర్సులు

ఏఐఐఎస్హెచ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

 

 

వినికిడి లోపం, సరిగా మాట్లాడలేకపోవడం- ఈ రెండు సమస్యలతో దేశంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీరికి అండగా నిలిచే స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ నిపుణులుగా తయారవటానికి ప్రత్యేకంగా కోర్సులూ, సంస్థలూ ఉన్నాయి. వాటిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ (ఏఐఐఎస్‌హెచ్‌) ముఖ్యమైంది. ఇక్కడ డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులున్నాయి. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో శిక్షణావకాశం కల్పిస్తారు. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!

 

ఏఐఐఎస్‌హెచ్‌ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1966లో మైసూర్‌లో ఏర్పాటుచేశారు. దివ్యాంగులకు ముఖ్యంగా చెవుడు, మూగ సమస్యలతో బాధపడుతున్నవారికి నాణ్యమైన విద్య, సేవలు అందించి సుశిక్షితులను తయారుచేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇక్కడి కోర్సుల్లో చేరినవారికి ప్రతినెలా స్ట్టైపెండ్‌ అందిస్తున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ఎన్‌జీవోలు, ప్రత్యేక సేవల కేంద్రాలు, స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సెంటర్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో అవకాశాలు పొందుతున్నారు

 

డిప్లొమా కోర్సులు

1. హియరింగ్‌ ఎయిడ్‌ ఖీ హియర్‌ మౌల్డ్‌ టెక్నాలజీ 

సీట్ల సంఖ్య: 28

అర్హత: ఫిజిక్స్‌తో ఇంటర్‌ లేదా ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌ల్లో డిప్లొమా / ఐటీఐ లేదా డెంటల్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత అర్హత పరీక్షలో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 24 ఏళ్లలోపు ఉండాలి.

 

2. అర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌

సీట్ల సంఖ్య: 28

అర్హత: ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌లో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 17 ఏళ్లు ఉండాలి.

 

3. హియరింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌

సీట్ల సంఖ్య: ఈ కోర్సును ఏఐఐఎస్‌హెచ్‌తోపాటు 8 అనుబంధ సంస్థల్లో నిర్వహిస్తున్నారు. ఏఐఐఎస్‌హెచ్‌లో 30 ఇతర చోట్ల 28 చొప్పున సీట్లు ఉన్నాయి. 

అర్హత: ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో  కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు జులై 1 నాటికి 21 ఏళ్లలోపు ఉండాలి. 

 

పై కోర్సుల వ్యవధి ఏడాది. ఎంపికైనవారికి నెలకు రూ.250 చొప్పున స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. 

 

బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు

1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ (బీఏఎస్‌ఎల్‌పీ)  సీట్లు: 68 

అర్హత: ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 

కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఈ కోర్సుకు ఎంపికైనవారికి మొదటి మూడేళ్లూ సంవత్సరానికి 10 నెలల పాటు నెలకు రూ.800 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో భాగంగా నెలకు రూ.5000 చొప్పున చెల్లిస్తారు. 

 

2. స్పెషల్‌ బీఎడ్‌ సీట్లు: 22 అర్హత: ఏదైనా డిగ్రీలో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత. అలాగే అభ్యర్థి వయసు జులై 1 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. 

కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో చేరినవారికి నెలకు రూ.400 చొప్పున ఏటా పది నెలల పాటు స్టైపెండ్‌ అందుతుంది.

 

పీజీ డిప్లొమా కోర్సులు

1. అగ్మెంటేటివ్‌ అండ్‌ ఆల్టర్నేటివ్‌ కమ్యూనికేషన్‌

అర్హత: బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీ / స్పెషల్‌ బీఎడ్‌ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 

కోర్సు వ్యవధి ఏడాది. 22 సీట్లు ఉన్నాయి. ఎంపికైనవారికి నెలకు రూ.500 చొప్పున పది నెలల పాటు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

 

2. క్లినికల్‌ లింగ్విస్టిక్స్‌ ఫర్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ 

అర్హత: బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీ / స్పెషల్‌ బీఎడ్‌ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 

కోర్సు వ్యవధి ఏడాది. 12 సీట్లు ఉన్నాయి. ఎంపికైనవారికి నెలకు రూ.500 చొప్పున పది నెలల పాటు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

 

3. ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

అర్హత:  బీఎస్సీ - ఫిజిక్స్‌ / మ్యాథ్స్‌ / ఎలక్ట్రానిక్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌ / ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేదా స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ ముఖ్యాంశంగా బీఎస్సీ / బీఏఎస్‌ఎల్‌పీ లేదా బీటెక్‌ - ఎలక్ట్రానిక్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌/ కమ్యూనికేషన్‌ లేదా ఎంబీబీఎస్‌. 

కోర్సు వ్యవధి ఏడాది. 12 సీట్లు ఉన్నాయి. 

 

4. ఆడియాలజీ వెర్బల్‌ థెరపీ

అర్హత: ఆడియాలజీ/ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ/ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌/ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి ఏడాది. 12 సీట్లు ఉన్నాయి. 

 

5. న్యూరో ఆడియాలజీ 

అర్హత:  బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీ ఉత్తీర్ణత.  

కోర్సు వ్యవధి ఏడాది. 12 సీట్లు ఉన్నాయి. ఎంపికైనవారికి నెలకు రూ.500 చొప్పున పది నెలల పాటు స్టైపెండ్‌ అందిస్తారు.

 

 

మాస్టర్‌ డిగ్రీ కోర్సులు 

1.ఎమ్మెస్సీ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ

అర్హత: బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.  

కోర్సు వ్యవధి రెండేళ్లు. 44 సీట్లు ఉన్నాయి. ఎంపికైనవారికి నెలకు రూ.1300 చొప్పున రెండేళ్లు చెల్లిస్తారు. 

 

2.ఎమ్మెస్సీ ఆడియాలజీ

అర్హత: బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీ 

కోర్సు వ్యవధి రెండేళ్లు. 44 సీట్లు ఉన్నాయి. ఎంపికైనవారికి నెలకు రూ.1300 చొప్పున రెండేళ్లు చెల్లిస్తారు. 

 

3.స్పెషల్‌ ఎంఎడ్‌

అర్హత: బీఎడ్‌ లేదా స్పెషల్‌ బీఎడ్‌లో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత. అభ్యర్థుల వయసు జులై 1 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. 

22 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.650 చొప్పున రెండేళ్లు చెల్లిస్తారు.

 

పరిశోధన కోర్సులు 

స్పీచ్‌- లాంగ్వేజ్‌ పాథాలజీ, ఆడియాలజీ, స్పీచ్‌ అండ్‌ హియరింగ్, స్పెషల్‌ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్‌ అంశాల్లో పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసినవారు వీటికి అర్హులు. ఎంపికైనవారికి మొదటి ఏడాది నెలకు రూ.20,000, రెండో ఏడాది నెలకు రూ. 22,000, మూడో సంవత్సరం నెలకు రూ.25,000 చొప్పున స్టైపెండ్‌ అందిస్తారు. పోస్టు డాక్టొరల్‌ ఫెలోషిప్‌లో భాగంగా ప్రతి నెలా రూ.35,000 చొప్పున చెల్లిస్తారు. పీహెచ్‌డీ వ్యవధి మొత్తం హెచ్‌ఆర్‌ఏ అందుతుంది. ఏటా కాంటింజెన్సీ ఉంటుంది.

 

ఎప్పటిలోగా?

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 10

అందుబాటులోని పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌

 వెబ్‌సైట్‌: http://aiishmysore.in

Posted Date: 19-05-2021