• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రపంచ విపణిపై భారత్‌ ముద్ర

‘బ్రాండ్‌ ఇండియా మిషన్‌’కు సర్వం సిద్ధం

 

 

ప్రపంచ దేశాల వినియోగదారులకు భారతీయ ఉత్పత్తుల పట్ల అవగాహన కల్పించడం, విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడం లక్ష్యంగా- కేంద్ర ప్రభుత్వం ‘బ్రాండ్‌ ఇండియా’ మిషన్‌ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రపంచ విపణుల్లో భారత ఉత్పత్తులకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చేలా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అమెరికా, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీలలో అమలవుతున్న విధానాల తరహాలో అంతర్జాతీయ స్థాయిలో దేశీయ ఉత్పత్తులకు గుర్తింపు తేవడం, నాణ్యమైన ఉత్పత్తిని పెంపొందించి ప్రోత్సహించడం బ్రాండ్‌ ఇండియా వ్యూహం. తయారీ వస్తువులకు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ గుర్తింపు ట్యాగ్‌ ఇస్తారు. ఆరోగ్యం, భద్రత తదితర నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, కనీసం 20శాతం స్థానికతను కలిగి ఉంటే ఈ గుర్తింపు ట్యాగ్‌ తగిలించుకోవడానికి సంస్థలకు అనుమతి లభిస్తుంది. కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను భారత్‌లోనే నిర్వహించవలసి ఉంటుంది. ఆరు నుంచి పది రోజుల్లోనే ధ్రువపత్రాల జారీ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానం ఎగుమతులను, ఉపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగిరపరుస్తుందని అంచనా. భారత ప్రధాని మోదీ ఇటీవల ఒక సందర్భంలో బ్రాండ్‌ ఇండియా ప్రాధాన్యాన్ని వివరించారు.

 

నాలుగు సవాళ్లు...

ఇండియా బ్రాండ్‌ నిర్మాణంలో మన ముందున్న మొదటి సవాలు- చైనా. ఇప్పటికే ఇది మన పోటీదారు. మనతో పోలిస్తే ఆ దేశానికి ఉన్న ప్రత్యేకత- కారుచౌక ఉత్పత్తి వ్యయాలు. భూమి, పెట్టుబడి, విద్యుత్తు వంటి వ్యయాలు భారత్‌లో అధికంగా ఉండటం విపణిపోటీలో చైనాకు కలిసొస్తున్న అంశం. దీన్ని మనం ఎదుర్కోగలం. ఇందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి- సరైన విధానాలను అమలు చేసి ఈ అధిక వ్యయాలను తగ్గించుకోవడం. రెండోది- భారతీయ ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థలు. చైనాతో పోల్చుకుంటే ఇవి తమ వ్యాపార సౌలభ్యానికి ఎలా దోహదపడగలవో విదేశీ పెట్టుబడిదారుల్లో అవగాహన కల్పించాలి. ఉదాహరణకు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాజ్యం నెగ్గడం విదేశీ కంపెనీలకు దాదాపు అసంభవం. భారత్‌ ఆర్థిక సేవల వ్యవస్థ దృఢంగా ఉంటుంది. చైనాలో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల వ్యవస్థలు పటిష్ఠంగా లేవు. ఇది పలుమార్లు రుజువైన విషయం. మరీ ముఖ్యంగా 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం చైనా బ్యాంకుల డొల్లతనాన్ని బయటపెట్టింది. భారతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థలోని సానుకూలతల ప్రాముఖ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజెప్పగలిగితే- అది భారత బ్రాండ్‌ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది.

 

దేశానికి ఎదురవుతున్న రెండో సవాలు- మౌలిక సదుపాయాలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం పనితీరు. మౌలిక వసతుల సమస్య పరిష్కారానికి వీలుగా... పెద్దయెత్తున ప్రభుత్వ పెట్టుబడులు సమకూరుస్తూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. అదే సమయంలో ద్రవ్య రాయితీల కల్పన ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల రంగాన్ని బలోపేతం చేయడానికి పట్టువీడకుండా చర్యలు తీసుకోవాలి. తద్వారా అట్టడుగు స్థాయి నుంచి జరగాల్సిన ఇండియా బ్రాండ్‌ నిర్మాణంలో ఈ రంగం చురుకైన పాత్ర వహిస్తుంది. ఆవిష్కరణల విషయంలో మనం వెనకబడి ఉండటం మూడో సవాలు. ప్రపంచ ప్రమాణాలతో పోల్చుకుంటే- పరిశోధన, అభివృద్ధిలో మనవి కనిష్ఠ స్థాయి పెట్టుబడులు.  ఆర్‌అండ్‌డీలో మన ప్రైవేటు రంగ పెట్టుబడులు జీడీపీలో 0.3శాతమే కావడం- మన స్థాయి ఏమిటో స్పష్టం చేస్తోంది. దక్షిణ కొరియాలో ఇది 2.5శాతం. దక్షిణ కొరియా ఆవిష్కరణల్లో ముందున్నదంటే అందుకు ఇదొక ప్రధాన కారణం. పరిశోధన, అభివృద్ధి అనేది ప్రభుత్వ వ్యవహారమేననే భావన నుంచి భారత ప్రైవేటు రంగ సంస్థలు బయటపడాలి. నిజానికి ఈ విషయంలో వాటిదే కీలక పాత్ర. ఆవిష్కరణ యత్నాలు ఫలిస్తే అధికంగా లబ్ధి పొందేవి ప్రైవేటు సంస్థలే. కాబట్టి అవే పరిశోధన మీద పెట్టుబడులు పెంచాలి. రెండు మార్గాల్లో ఇందుకు అవకాశం ఉంది. భారీ కార్పొరేట్‌ సంస్థలు నేరుగా ఆర్‌అండ్‌డీ కార్యకలాపాల్లో పెట్టుబడి పెట్టాలి. లేదంటే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నెలకొల్పే అంకుర సంస్థల్లో మదుపు చేయాలి. ప్రభుత్వం కూడా ప్రైవేటు రంగానికి ఆర్థిక రాయితీలు సమకూర్చడం ద్వారా ఇలాంటి పెట్టుబడులను ప్రోత్సహించాలి. ప్రైవేటు సంస్థలు కట్టుబడి ఉండాల్సిన అసంఖ్యాక విధివిధానాలు నాలుగో సవాలు. ఇవి ఒక పరిమితికి మించినప్పుడు, వ్యాపార సౌలభ్యంలో భారత్‌ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఇది తక్షణం దృష్టి సారించాల్సిన అంశం. నిబంధనల అనుపాలన ప్రక్రియను సరళం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన తాజా ప్రకటన ఈ దిశగా చోటు చేసుకున్న సానుకూల పరిణామం.

 

జనాభా... ఓ అవకాశం!

ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించేందుకు భారత్‌కు ఒక ప్రత్యేక సానుకూలత ఉంది. 135 కోట్లకు పైబడి ఉన్న జనాభా, దేశాన్ని ప్రపంచ భారీ విపణుల్లో ఒకటిగా నిలుపుతోంది. దానికి తోడు దేశంలో వాస్తవిక ప్రజాస్వామ్యం ఉంది. ముడిసరకుల సరఫరాకు ఢోకా లేదు. నైపుణ్యం ఉన్న, లేని కార్మికులు కోకొల్లలుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు లేనివి ఇవే. ఈ సవాళ్లను అధిగమించినట్లయితే రానున్న కాలంలో ‘సొంత బ్రాండు’ను నిర్మించుకోవడంలో భారత్‌ నిస్సందేహంగా ముందంజ వేయగలదు. ఈ సందర్భంలో విధాన నిర్ణేతలు గుర్తు చేసుకొనే అంశం ఒకటుంది... అది 2014 జనవరిలో అప్పటి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ భాజపా జాతీయ కార్యవర్గంలో చేసిన ప్రసంగం. ‘బ్రాండ్‌ ఇండియా’ రూపకల్పన అవసరాన్ని, దేశ అభివృద్ధికి తనదైన ప్రణాళికను ఆయన ఆ ప్రసంగంలో వివరించారు. బ్రాండ్‌ ఇండియా సృష్టికి మోదీ- ప్రతిభ, సంప్రదాయం, పర్యాటకం, వర్తకం, సాంకేతికత (టాలెంట్‌, ట్రెడిషన్‌, టూరిజం, ట్రేడ్‌, టెక్నాలజీ)ల పేరిట అయిదు ‘టీ’లను ప్రతిపాదించారు. సరిగ్గా అభివృద్ధి చేసుకోగలిగితే, భిన్న దేశాల సామనస్యంలో ఇవి భారత్‌ను అగ్రస్థాయికి చేర్చగలవని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రణాళిక సిద్ధమైంది. కార్యాచరణే ఆలస్యం!

 

ప్రత్యేకతే గీటురాయి

బలమైన బ్రాండును నిర్మించడం తప్పనిసరి అవసరమే. ఇందులో సఫలం కావాలంటే మనం దృష్టి సారించాల్సిన ప్రాథమిక అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ విషయంలో విజయం సాధించిన దేశాల అనుభవాలను పరిశీలిద్దాం. వినియోగదారుడి సొమ్ముకు తగినంత విలువను అందించడం దక్షిణ కొరియా ప్రత్యేకత. ఇంజినీరింగ్‌ ప్రతిభకు జర్మనీ పెట్టిందిపేరు. జపాన్‌ నాణ్యతకు, చైనా చౌక ధరలకు ప్రఖ్యాతి పొందాయి. మరి బ్రాండ్‌ ఇండియా దేనికి మారుపేరుగా నిలవాలి? దీనిపై మన విధాన నిర్ణేతలకు స్పష్టమైన ఆలోచన అవసరం. ‘భారత్‌ వస్తువులంటే ఇలా ఉంటాయి...’ అనే గుర్తింపు ప్రపంచ వ్యాపారంలో మనం సంపాదించాలి. దాని చుట్టూనే సర్వశక్తులూ కేంద్రీకరించాలి.

 

ఆర్థిక రంగం

మరిన్ని