* ప్రారంభించే అంశాన్ని పరిశీలించండి
* బడుల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలి
* విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
ఈనాడు, అమరావతి: ఫిబ్రవరి మొదటి వారం నుంచి 1-5 తరగతులకు పాఠశాలలు పునఃప్రారంభంతో పాటు గతంలో మాదిరిగా అన్ని పీరియడ్స్ బోధించే అంశాన్ని పరిశీలించాలని సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండాలని సూచించారు. మరుగుదొడ్లు లేకపోవడం, సక్రమంగా నిర్వహించకపోవడంతో చాలావరకు పాఠశాలలకు పిల్లలు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. విద్యా కానుక టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, బడులు తెరిచే నాటికి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతి వారికి ఆంగ్ల మాధ్యమంలో బోధనపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జనవరి 18న మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం రూపొందించిన మొబైల్ యాప్‌లపై సీఎం జగన్.. మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ‘విద్యాసంస్థలను ‘నాడు-నేడు’ ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. ఆంగ్ల మాధ్యమంతో నాణ్యమైన బోధనను అందుబాటులోకి తెచ్చాం. విద్యార్థుల పోషకాహారం కోసం గోరుముద్దను అమలు చేస్తున్నాం’ అని సీఎం జగన్ వెల్లడించారు.
విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సందేశం:
‘విద్యార్థులు పాఠశాలలకు రాకపోతే తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు వెళ్లాలి. వాలంటీర్‌తో వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు దీన్ని పర్యవేక్షించాలి. యాప్‌లోని హాజరు వివరాలను తల్లిదండ్రులు పరిశీలించుకునే అవకాశం కల్పించాలి’ అని సీఎం ఆదేశించారు.
ఫిబ్రవరిలో 1-5 తరగతులు
Posted Date : 19-01-2021 .