• facebook
  • whatsapp
  • telegram

ఫిబ్రవరి 15 నుంచి 6, 7, 8 తరగతులు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫిబ్రవరి 15 నుంచి 6, 7, 8వ తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 1నుంచి 9, 10వ తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది మొదలయ్యాక రెండు వారాలపాటు తరగతుల నిర్వహణ, సమస్యలు, లోపాలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 6, 7, 8వ తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూడు తరగతుల్లో మొత్తం 17 లక్షల మంది వరకు విద్యార్థులు ఉంటారు. ఇక 1 నుంచి 5 తరగతుల నిర్వహణ ఈ విద్యా సంవత్సరం ఉండదని విద్యాశాఖ అంతర్గతంగా నిర్ణయానికి వచ్చినా అధికారికంగా వెల్లడించలేదు. గతేడాది వరకు ప్రతి తరగతికి 4 ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ) పరీక్షలు జరిగేవి. ఈసారి అవి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ 1 నుంచి 10 తరగతులకు 30 శాతం సిలబస్‌ను తగ్గించింది. అంటే ఆ సిలబస్‌కు పరీక్షలు ఉండవు. కాకపోతే ఆ మొత్తాన్ని ప్రాజెక్టులు/అసైన్‌మెంట్లకు కేటాయిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. వాటిని పరిగణిస్తూ ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులు ఇవ్వొచ్చని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

Posted Date : 17-01-2021 .