• facebook
  • whatsapp
  • telegram

6, 7, 8 తరగతులకు బడిగంట

 

 

24 నుంచి మార్చి 1వ తేదీలోపు తరగతులు ప్రారంభించవచ్చు

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో విద్యాశాఖ నిర్ణయం

తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ప్రత్యక్ష తరగతులకు హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 6, 7, 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫిబ్ర‌వ‌రి 23న‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మార్చి 1వ తేదీలోగా పాఠశాలలు తరగతులను ప్రారంభించుకోవచ్చని తెలిపారు. 9, 10 తరగతుల మాదిరిగా కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులు హాజరు కావాలంటే తల్లిదండ్రుల అనుమతి కూడా తప్పనిసరని మంత్రి స్పష్టంచేశారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయవద్దన్నారు. ఈ మూడు తరగతుల్లో మొత్తం 17.10 లక్షల మంది విద్యార్థులున్నారు. మంత్రి సబిత ఫిబ్ర‌వ‌రి 23న‌ సాయంత్రం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తదితరులతో తరగతుల ప్రారంభంపై సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట షిఫ్టు విధానంలో కూడా తరగతులను నడుపుకోవచ్చన్నారు. అక్కడి పరిస్థితులు, మౌలిక వసతుల ఆధారంగా యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుండగా తరగతులను ప్రారంభిస్తుండటం ఏమిటన్న ప్రశ్నకు ...ప్రారంభించకుంటే పట్టించుకోవడం లేదని అంటారు.. మొదలుపెడుతుంటే ఇలా అంటున్నారని సమాధానమిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుతోపాటు భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తామన్నారు.

 

9, 10 ప్రారంభించిన 23 రోజుల తర్వాత...

9, 10 తరగతులను ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. సగటున దాదాపు 70 శాతం హాజరు నమోదైంది. సిరిసిల్ల జిల్లాలో ఒక విద్యార్థికి తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కరోనా కేసులు వెలుగుచూడలేదు. విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు మాత్రం 6, 7, 8 తరగతులను ప్రారంభించకుండా పైతరగతులకు పంపించాలని, రెండు నెలల కోసం ప్రత్యక్ష తరగతులు ఎందుకన్న అభిప్రాయంతో ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయిద్దామని మంత్రి సబిత చెప్పారు. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మిగిలిన తరగతులు ఉండకపోవచ్చని భావిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా పాఠశాలలను ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపడం విశేషం. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, వాటిల్లో పనిచేసే ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి ఉండటం, గ్రాడ్యుయేట్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

సర్కారు బడులు ఎప్పటి నుంచి?

తరగతులను ప్రారంభించేందుకు మార్చి 1వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చినా ప్రభుత్వ బడులు ఎప్పటి నుంచన్నది స్పష్టత లేదు. దీనిపై పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనను ప్రశ్నించగా కచ్చితంగా ఫిబ్ర‌వ‌రి 24 నుంచే జరపాలన్నది ఏమీ లేదని, రెండు మూడు రోజుల తర్వాత ప్రారంభించుకోవచ్చన్నారు. ప్రభుత్వ బడుల్లో తక్కువ మంది విద్యార్థులు ఉన్నందున ఉపాధ్యాయులు సరిపోతారని, ఒకవేళ కొరత ఉంటే ఎస్‌జీటీలను తీసుకోవాలన్న ఆలోచన ఉందన్నారు.
మరో అధికారి మాట్లాడుతూ ఒక్కో తరగతికి 20 మంది విద్యార్థులను కూర్చోబెట్టి బోధించాలంటే 20 - 25 శాతం పాఠశాలల్లో తరగతి గదుల కొరత తలెత్తనుందన్నారు. అలాంటి చోట్ల 8 - 12 గంటల వరకు రెండు తరగతులు, 1 - 5 గంటల మధ్య మరో రెండు తరగతులు నిర్వహించుకోవచ్చని, పదో తరగతి మాత్రం యథావిధిగా జరిగేలా చూడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఎస్‌జీటీలను తీసుకుంటే ఉపాధ్యాయుల కొరత తలెత్తదని, లేకుంటే సమస్య అవుతుందని అధికారులు చెబుతున్నారు.

 

జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీలదే కీలకపాత్ర

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీలు సమావేశమై 6, 7, 8 తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టర్లు, డీఈఓలు, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ శాఖలకు సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారులతో ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఏఎం రిజ్వీ, ఎస్‌సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి నదీమ్‌ అహ్మద్‌, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన పాల్గొన్నారు.

 

24 నుంచే మధ్యాహ్న భోజనం

తెలంగాణ‌లో 6, 7, 8 తరగతులను ఫిబ్ర‌వ‌రి 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు. ఆహారం, నీటిని విద్యార్థులు ఒకరితో ఒకరు పంచుకోరాదని ఆమె సూచించారు.

 

Posted Date : 23-02-2021 .