‣ సంస్థలో పనిచేసే వారి కోసం 1,436 పోస్టులు
‣ మార్చిలోగా నియామకాల ప్రక్రియ
‣ సీఎండీ శ్రీధర్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 651 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. రాతపరీక్ష ద్వారా మార్చిలోగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు జనవరి 08న ప్రకటన విడుదల చేశారు. ఇందులో 569 ఎన్సీడబ్ల్యూఏ పరిధిలోని ఉద్యోగాలు, 82 అధికార పోస్టులను భర్తీ చేయనున్నారు. కార్మికుల విభాగంలోని 177 జూనియర్ అసిస్టెంటు(క్లర్కు) పోస్టులు, 128 ఫిట్టరు, 51 ఎలక్ట్రీషియన్లు ట్రైనీ, 54 వెల్డర్ ట్రైనీ, 19 టర్నర్/మెషినిస్టు పోస్టులను భర్తీ చేస్తారు. జూనియర్ స్టాఫ్ నర్సు పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, వెంటిలేటర్ తదితర విభాగాల్లోని పోస్టులకూ అర్హులను ఎంపిక చేస్తారు. అధికారుల విభాగం పరిధిలోని మైనింగ్ విభాగం, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ విభాగాల్లో మేనేజిమెంటు ట్రైనీలు, పర్సనల్ ఆఫీసర్లు, జూనియర్ అటవీ అధికారుల పోస్టులను భర్తీ చేయనున్నారు. సంస్థలో పనిచేస్తున్న అర్హులైన అభ్యర్థులతో వివిధ గనుల విభాగాలు, కార్యాలయాల్లో ఉన్న 1,436 పోస్టులను భర్తీ చేస్తారు.