* రెండో షిఫ్టులో తరగతుల నిర్వహణకు ఏఐసీటీఈ నిరాకరణ
* ఫలితంగా కోర్సులను రద్దు చేసుకున్న పలు కళాశాలలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఎంటెక్ కోర్సులు 84 కళాశాలలకే పరిమితం అయ్యాయి. వాటిలో కన్వీనర్ కోటా కింద 6,620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంటెక్ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి రెండో షిఫ్టులో కాకుండా రెగ్యులర్ కోర్సులుగా ఉదయం నుంచి నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 8 కళాశాలలు ఈ ఏడాది నుంచి ఎంటెక్ బోధనను పూర్తిగా రద్దు చేసుకున్నాయి. పలు కళాశాలలు కొన్ని కోర్సులను రద్దు చేశాయి. గత ఏడాది 92 కళాశాలల్లో 7,392 ఎంటెక్ సీట్లున్నాయి. రాష్ట్రంలో 2015-16 విద్యా సంవత్సరంలో 171 కళాశాలల్లో ఎంటెక్ బోధన ఉండటం గమనార్హం. అంటే అయిదేళ్లలో సగానికిపైగా కళాశాలల్లో ఎంటెక్ కోర్సులను ఎత్తేశారు. ఎంఫార్మసీలోనూ గత ఏడాది 111 కళాశాలల్లో 4,029 సీట్లుండగా.. ఈసారి 106 కళాశాలల్లో 3,781 సీట్లే ఉన్నాయి. అయితే మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎంఆర్క్) కళాశాలలు 4 నుంచి 7కి పెరిగాయి. సీట్లు 120 నుంచి 200కి చేరాయి. రాష్ట్రంలో త్వరలో ఎంటెక్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.
గత విద్యా సంవత్సరం వరకు ఇంజినీరింగ్ కళాశాలల్లో మధ్యాహ్నం వరకు బీటెక్ తరగతులు.. మధ్యాహ్నం నుంచి ఎంటెక్ తరగతులు నడిచేవి. బీటెక్కు పనిచేస్తున్న 50 శాతం అధ్యాపకులను, ప్రయోగశాలలను ఎంటెక్ తరగతుల బోధనకు ఉపయోగించుకునేవారు. ఏఐసీటీఈ నిర్ణయంతో ఈసారి ఆ మినహాయింపులు ఉండవు. ‘కరోనా కారణంగా వర్సిటీల నుంచి తనిఖీలు లేకపోవడంతో ఎంటెక్ కోర్సుల కోసం అదనపు సౌకర్యాలు కల్పించకుండానే కొన్ని కళాశాలలు రెగ్యులర్ కోర్సులుగా మార్చుకుంటున్నాయి’ అని సీనియర్ ఆచార్యుడు ఒకరు చెప్పారు. ‘బయోమెట్రిక్ హాజరు అమలు.. ఒక్కో బ్రాంచికి ఇద్దరు పీహెచ్డీ అధ్యాపకులు ఉండాలనే నిబంధన.. బ్రాంచికి 30 సీట్లు మాత్రమే ఉండటం.. ట్యూషన్ ఫీజు పెరగకపోవడం.. బోధన రుసుముల విడుదలలో తీవ్ర జాప్యం తదితర కారణాలతో ఏటా పలు కళాశాలలు ఎంటెక్ కోర్సులను రద్దు చేసుకుంటున్నాయి’ అని ఓ కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.
84 కళాశాలల్లోనే ఎంటెక్
Posted Date : 01-12-2020 .