• facebook
  • whatsapp
  • telegram

ఏపీ ఇంటర్ పరీక్షలు వాయిదా

 

 

ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్‌ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పిల్లల ప్రాణాల మీద, వారి భవిష్యత్తు మీద మమకారం, బాధ్యత ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నామని.. ఇందుకోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తలు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజా ప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకుని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని మంత్రి స్పష్టం వెల్లడించారు.

 

అయితే ఇటీవ‌ల హైకోర్టు కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పది, ఇంటర్మీడియట్‌పరీక్షలు నిర్వహణపై పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పునరాలోచించడం, పునఃసమీక్షించడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని పేర్కొంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేసింది. లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరీక్ష నిర్వహణ సిబ్బంది, తదితరుల సంక్షేమం ముడిపడి ఉందని పిటిషనర్లు చెబుతున్న విషయాల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించాలని అడ్వొకేట్‌జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌కు సూచించింది. 

 

ప‌రీక్ష‌ల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ నిర్వ‌హించి తీరుతామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇటీవ‌ల వెల్ల‌డించారు. విద్యార్థుల భ‌విష్య‌త్ కోస‌మే నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలోనే హైకోర్టు సూచ‌న‌ల‌తో పున‌రాలోచ‌న‌లో ప‌డిన ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. షెడ్యూలు ప్ర‌కారం మే 5 నుంచి ఏపీలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా వాయిదా ప‌డ్డాయి.

Posted Date : 02-05-2021