• facebook
  • whatsapp
  • telegram

కరోనాతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యకు వెనకడుగు

* తెలంగాణకు వచ్చేవారి సంఖ్యా తక్కువే


ఈనాడు, హైదరాబాద్‌: గతేడాది వరకు ఏ రాష్ట్రంలో సీటొచ్చినా విద్యార్థులు చలో అంటూ వెళ్లేవారు.. ఈసారి ఎవరి రాష్ట్రంలో వారే చదువుకుంటున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు వస్తే.. అత్యవసరమైతే తప్ప దూరాభారం వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. తమ పిల్లల్ని దూరం పంపి నిత్యం ఆందోళన చెందేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. అందుకు కరోనాయే కారణం. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్య చదవాలంటే రాష్ట్ర విద్యార్థులు ఇంటర్‌ బోర్డు నుంచి మైగ్రేషన్‌(వలస) ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, వైద్య విద్య చదివేందుకు వీరు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. అందుకు గతేడాది మొత్తం 13,796 మంది ఆ ధ్రువపత్రాలను పొందారు. ఈసారి ఆ సంఖ్య ఇప్పటివరకు 6,330 మాత్రమే ఉంది. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లోని మెడికల్‌ కళాశాలలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర ప్రైవేట్‌, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునేవారు ముందుగానే ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఈసారి ఇంకా నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కాలేదు. వారిలో కూడా చాలామంది ఇప్పటికే దరఖాస్తు చేసి ఉంటారు. లేకున్నప్పటికీ జాతీయ కోటాలో మరో 1500 మంది చేరతారనుకున్నా మొత్తం మైగ్రేషన్‌ ధ్రువపత్రాల సంఖ్య 8 వేలకు మించదని అధికారులు భావిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే దాదాపు 40 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో మెడికల్‌ సీటు వస్తే వదులుకునేవారు తక్కువ. ఇక ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీటు వచ్చినా కోరుకున్న బ్రాంచీ దక్కకుంటే సొంత రాష్ట్రంలోనే ఏదో కళాశాలలో చేరుతుంటారు. ఈసారి ఇలాంటి విద్యార్థుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా.
ఇక్కడికీ రావడం లేదు
ఇతర రాష్ట్రాల్లో ఇంటర్‌ లేదా తత్సమాన విద్య పూర్తి చేసి మన రాష్ట్రంలో ఉన్నత విద్య చదవాలంటే తెలంగాణ ఇంటర్‌బోర్డు నుంచి ఈక్విలెన్స్‌ సర్టిఫికెట్‌(ఇంటర్‌కు సమానమైన విద్య అభ్యసించారని) తీసుకోవాలి. అందుకు 2015-16 నుంచి 3000- 4,200 మధ్య ఏటా రాష్ట్రానికి వస్తున్నారు. ఈసారి ఇప్పటివరకు 373 మందే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అంటే ఆయా రాష్ట్రాల వారు అక్కడే చదువుకోవాలని అనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

Posted Date : 03-12-2020 .