• facebook
  • whatsapp
  • telegram

కేంద్రీయ విద్యాసంస్థ‌ల్లో 14,440 ఖాళీలు

దేశవ్యాప్తంగా భర్తీకాని టీచింగ్‌ పోస్టులు

 

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాసంసల్లో వేలాది ఆచార్యుల (ప్రొఫెసర్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పేరొందిన ఐఐటీలు, ఐఐఎంలు సహా అన్ని విద్యాసంస్థలనూ బోధనా సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం విద్యాసంస్థల్లో వివిధ స్థాయుల్లో 40,049 బోధనా సిబ్బంది పోస్టులను కేంద్ర సర్కారు మంజూరు చేయగా.. అందులో 14,440 కొలువులు ఖాళీగా ఉన్నాయి. అంటే 36 శాతం ఆచార్యుల కొరత ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. రెండేళ్ల క్రితం అది 40-42 శాతం ఖాళీలు ఉండగా... 2019, 2020లో నియామకాలతో ఖాళీల శాతం 36కు తగ్గింది. మెరిట్‌ ఆధారంగా చేరినవారు రాజీనామాలు చేసి వెళ్లిపోతుండటం, పదవీ విరమణ తదితర కారణాల వల్ల 100 శాతం భర్తీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. హెచ్‌సీయూలో 25 శాతం ఖాళీలున్నాయి. ‘ఇక్కడ పనిచేస్తున్న వారు కొందరు ఐఐటీలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌)ల్లో చేరారు...ఒకరిద్దరు విదేశీ వర్సిటీల్లో కొలువులు సాధించారు’ అని హెచ్‌సీయూ ఉపకులపతి ఆచార్య పొదిలె అప్పారావు చెప్పారు. కొన్ని పోస్టులకు తగిన అర్హతలు కలిగినవారు లేకపోవడం, కొన్నింటిపై న్యాయస్థానాల్లో కేసులు ఉండటం తదితర కారణాల వల్లనూ ఖాళీలు ఉంటున్నాయని ఆయన తెలిపారు. చిన్న విశ్వవిద్యాలయాల నుంచి పెద్ద వర్సిటీలకు, అక్కడి నుంచి ఐఐటీలు, ఐసర్లుకు వెళ్లిపోతున్నారని, వాటిల్లో అధిక వేతనాలతో పాటు పరిశోధనకు నిధులు భారీగా ఇస్తుండటమూ కారణమని ఆచార్యులు చెబుతున్నారు. కరోనా పరిస్థితుల్లోనూ పలు సంస్థలు ఆన్‌లైన్‌ విధానం ద్వారా 365 మంది బోధనా సిబ్బందిని నియమించుకున్నాయి.

 

Posted Date : 20-02-2021 .