• facebook
  • whatsapp
  • telegram

డీఎస్సీ-2008 అభ్య‌ర్థుల‌కు ఎస్‌జీటీ ఉద్యోగాలు

  కనీస టైమ్‌ స్కేల్‌తో 2,193 మంది నియామ‌కం

 విద్యాశాఖ మంత్రి సురేష్‌ వెల్లడి
 

 

ఈనాడు, అమరావతి: డీఎస్సీ-2008కి సంబంధించి 2,193 మంది అభ్యర్థులకు కనీస టైమ్‌ స్కేలుతో సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. విజయవాడలో జూన్ 11న‌ ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం ఈ డీఎస్సీకి మాత్రమే వర్తించేలా ప్రత్యేకంగా మినిమమ్‌ టైం స్కేల్‌ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. డీఎస్సీ-2008లో అర్హతల మార్పు కారణంగా 4,657 మంది అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వీరందరి జాబితాను పరిశీలించి, అర్హులను ఎంపిక చేశామన్నారు. వీరికి వృత్తి శిక్షణ ఇచ్చి, ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో నియమిస్తామని మంత్రి చెప్పారు. 

‣ డీఎస్సీ-2018లో కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్న 486 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలు చేపడుతున్నామని మంత్రి ప్రకటించారు. 374 తెలుగు భాషాపండిత పోస్టులపై పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌ను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. డీఎస్సీ-2018లో 7,247 పోస్టులకు ప్రకటన ఇవ్వగా ఇప్పటి వరకు 6,361 పోస్టులు భర్తీ చేశామని చెప్పారు.
 

‣ పరీక్షలకు సమయం కావాలి
 

‘పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 40 రోజులు సమయం పడుతుంది. ఈ పరీక్షలతో పాటు జేఈఈ, నీట్‌, ఎంసెట్‌కు సన్నద్ధం కావడానికి విద్యార్థులకు సమయం ఇవ్వాలి. ఇవన్నీ పరిశీలించి షెడ్యూల్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించాం. కరోనా తగ్గుముఖం పట్టాక పరీక్షలు నిర్వహిస్తాం. కొవిడ్‌ బారిన పడినవారు పరీక్షలు రాయలేకపోతే వారికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తాం. వీటిని సప్లిమెంటరీగా కాకుండా రెగ్యులర్‌ పరీక్షలుగానే పరిగణిస్తాం. పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తాం. ఇంకా విద్యాసంవత్సరం ఎక్కడా ప్రారంభం కాలేదు. ఫిర్యాదులు వస్తే టాస్క్‌ఫోర్సులు వేసి, యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి చెప్పారు. మార్పు చేసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాఠ్యప్రణాళికను ఆవిష్కరించారు.

 

‣ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

పాఠశాల విద్యార్థులకు జూన్ 12 నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించనున్నారు. జూన్‌ 30వరకు వేసవి సెలవులు ఇచ్చినందున ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా విద్యాధికారులకు సూచించింది. దూరదర్శన్‌, రేడియో, యూట్యూబ్‌, వాట్సప్‌గ్రూపు ద్వారా 1-10 తరగతులకు  పాఠాలు నిర్వహించాలని తెలిపింది.

Posted Date : 11-06-2021