* వారంలోగా వర్సిటీ రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి భేటీ
* అదే బాటలో పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ
ఈనాడు, హైదరాబాద్: విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి, పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ తదితర విభాగాలు విద్యా క్యాలెండర్ల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నాయి. విద్యాసంస్థలను డిసెంబరు నుంచి దశలవారీగా తెరవాలని ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం.. తదనుగుణంగా అకడమిక్ క్యాలెండర్లను తయారుచేసి పంపాలని మౌఖికంగా ఆదేశించింది. ఈ క్రమంలో ఆయా విభాగాలు కసరత్తు ఆరంభిస్తున్నాయి. ‘ప్రతిపాదనలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రికి పంపిస్తాం. తుది నిర్ణయం ఆయన తీసుకుంటారు’ అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఉమ్మడి కాలపట్టిక కోసం..
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు డిగ్రీ(అండర్ గ్రాడ్యుయేట్)కి ఉమ్మడి విద్యాకాలపట్టిక అమలు చేయాలి. తరగతుల ప్రారంభం, సెలవులు, పరీక్షలు వంటి అంశాలపై ఒకటే కాలపట్టిక ఉండాలి. అందుకోసం ఉన్నత విద్యామండలి వారంలోగా వర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశమై చర్చించనుంది. ప్రస్తుతం డిగ్రీ రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. దోస్త్ ద్వారా డిగ్రీ తొలి ఏడాదిలో చేరిన వారికి తరగతులు ఎలా అన్నది ప్రశ్న. అధ్యాపకులతో పరిచయమే లేకుండా..ఆన్లైన్ తరగతులంటే ప్రయోజనం చాలా తక్కువన్న చర్చ సాగుతోంది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం హాస్టళ్లలో ఒక గదిలో ఒకరి కంటే ఎక్కువ ఉండరాదు. అది సాధ్యమయ్యే పరిస్థితి లేదని రిజిస్ట్రార్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంటర్ విద్యాశాఖ సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. అప్పటి నుంచే విద్యా సంవత్సరం మొదలైనట్లని ఇంటర్‌బోర్డు విద్యా క్యాలెండర్‌ను రూపొందించింది. వచ్చే మార్చి 24 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలవుతాయని అందులో పేర్కొంది. ప్రభుత్వం మాత్రం ఏప్రిల్ నెలాఖరులో పరీక్షలు ప్రారంభించేలా కాలపట్టికను తయారు చేయాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. జేఈఈ మెయిన్ తేదీలు వెల్లడికాకుండా ఇంటర్ విద్యా క్యాలెండర్ విడుదల చేస్తే ఇబ్బందులు రావచ్చని భావిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ డిసెంబరు 1 నుంచి 9, 10 తరగతులను ప్రారంభించాలనుకున్నా తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో రెండో వారం నుంచి మొదలుపెట్టేలా కాలపట్టికను రూపొందిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత మిగిలిన తరగతులు ఉంటాయని చెబుతున్నారు.