ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం 13,355 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చేపట్టిన ధ్రువీకరణ పత్రాల సమర్పణ గడువు నవంబరు 21తో ముగిసింది. మొత్తం దరఖాస్తుదారుల్లో.. దివ్యాంగుల కోటాలో 50 మంది, ఎన్సీసీ కోటాలో 438 మంది, క్రీడల కోటాలో 249 మంది, ఎక్స్-ఆర్మీ కోటాలో 297, పోలీసు అమరవీరుల కోటాలో ఒకరు, ఆంగ్లో ఇండియన్ కేటగిరీలో ఒకరు ఉన్నారు. దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులు నవంబరు 23న విశ్వవిద్యాలయ మెడికల్ బోర్డు ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. మిగిలిన కేటగిరీ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను నవంబరు 23 నుంచి విశ్వవిద్యాలయంలోనే పరిశీలిస్తారు. నవంబరు ఆఖరున ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. డిసెంబరు మొదటి వారంలో సీట్లను కేటాయించే అవకాశం ఉంది. డిసెంబరు 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.శంకర్ తెలిపారు.
వైద్య విద్య ప్రవేశాలకు 13,355 మంది దరఖాస్తు
Posted Date : 22-11-2020 .