నూజివీడు, మచిలీపట్నం - న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశాలతో ట్రిపుల్ ఐటీ పరీక్షలను నవంబరు 28న నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదివరకు పదో తరగతి పరీక్షల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయించేవారు. ఈసారి కొవిడ్ కారణంగా పది పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ప్రతిభ ఆధారంగా ఎంపికలు నిర్వహించనున్నారు.పరీక్ష రాయడానికి జిల్లా వ్యాప్తంగా 5,456 మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. 100 మంది వరకు ఉంటే అదే మండలం, లేదంటే పక్క మండలాల్లో పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నారు. అలా అధికారులు జిల్లాలో 42 కేంద్రాలు ఏర్పాటు చేశారు. చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంక బంటుమిల్లి, కలిదిండి, కైకలూరు, ముదినేపల్లి, గంపలగూడెం, ముసునూరు, గన్నవరం, అగిరిపల్లి, కొండపల్లి, గుంటుపల్లి, పామర్రు, ఉయ్యూరు, బాపులపాడు, విజయవాడ రూరల్, పెనమలూరులో ఒక్కొక్కటి చొప్పున కేంద్రాలు ఏర్పాటుచేశారు.గుడివాడ, విస్సన్నపేట, తిరువూరు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, మైలవరంలో రెండేసి చొప్పున ఏర్పాటు చేశారు. నందిగామ, నూజివీడు, మచిలీపట్నం, విజయవాడ అర్బన్‌లో మూడు చొప్పున కేంద్రాలున్నాయి.
ప్రత్యేక బృందాలు
పరీక్షల నిర్వహణ కోసం 42 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 42 మంది డిపార్ట్మెంట్, ఏడుగురు రూట్ అధికారులను నియమించారు. 419 మంకి పర్యవేక్షకులుగా బాధ్యతలు కేటాయించారు. ఒక్కో గదికి 16మంది విద్యార్థులు చొప్పున పరీక్షలు రాయడానికి చర్యలు తీసుకున్నారు. ముందుగానే శానిటైజేషన్ చేయిస్తున్నారు. హాల్‌టికెట్ అందకపోయినా, దానిపై ధ్రువీకరణ సంతకం లేకపోవడంలాంటి సమస్యలు ఉన్నా విద్యార్థులు ఏ పాఠశాలలో చదువుతున్నారో ఆ ప్రధానోపాధ్యాయుడితో రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలతో అటెస్ట్ చేయించుకుని పరీక్షలకు హాజరు కావచ్చని ప్రభుత్వ పరీక్షల జిల్లా అసిస్టెంట్ కమిషనర్ జి.శ్రీనివాస్ చెప్పారు.
పరీక్ష సమయం : 11 నుంచి ఒంటి గంట
ప్రాథమిక కీ విడుదల : 28 సాయంత్రం
కీ పై అభ్యంతరాల స్వీకరణ : 30 వరకు
చివరి కీ విడుదల : డిసెంబరు 1
ఫలితాల విడుదల : డిసెంబరు 5
28న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష
Posted Date : 26-11-2020 .