• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీ, నీట్‌ శిక్షణకు విశాఖలో రెండు కేంద్రాలు

* ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

ఈనాడు డిజిటల్, అమరావతి: గిరిజన విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లలో శిక్షణ ఇచ్చేందుకుగా విశాఖలోని పెందుర్తి (బాలికలు), మారికవలసలలో (బాలురు) రెండు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. ఈ కేంద్రాల్లో ఇంటర్‌తోపాటు నీట్, ఐఐటీకి రెండేళ్లపాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. వీటిలో 70% సీట్లు ఏజెన్సీ ప్రాంతం వారికి, మిగతా 30% సీట్లు మైదాన ప్రాంత గిరిజన విద్యార్థులకు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సచివాలయంలో గురువారం పుష్పశ్రీవాణి అధ్యక్షతన రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అరకులో క్రీడా పాఠశాల, చిత్తూరు జిల్లా కేవీపల్లి పాఠశాలలకు కావాల్సిన సిబ్బందిని మంజూరుచేశారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గురుకుల పాఠశాలను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయడానికి అనుమతించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన డిజిటల్, వర్చువల్‌ తరగతి గదులు పని చేయడం లేదని ఫిర్యాదులున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో పనిచేసే వరకు ఏజెన్సీలకు బిల్లులను నిలిపేయాలి. ఆయా సంస్థలకిచ్చిన వార్షిక నిర్వహణ కాంట్రాక్టు రద్దు చేయాలి’ అని ఆదేశించారు. 

Posted Date : 26-11-2020 .