‣ 47,729 బీటెక్ సీట్ల భర్తీ
‣ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ గణాంకాల వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఎంసెట్ కన్వీనర్ కోటాలో ఈ విద్యా సంవత్సరం(2020-21) బీటెక్‌లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఈసారి స్పాట్ ప్రవేశాలు సహా 47,729 సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటాలో మొత్తం 70,141 బీటెక్ సీట్లుండగా అందులో 43,196 కౌన్సెలింగ్, మరో 4,533 స్పాట్ ప్రవేశాల ద్వారా నిండాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ గణాంకాల ప్రకారం గత విద్యా సంవత్సరం(2019-20)తో పోల్చుకుంటే ఈసారి స్వల్పంగా భర్తీ పెరిగింది. పోయిన ఏడాది స్పాట్ ప్రవేశాలు 3,063 సీట్లతో కలుపుకొని మొత్తం 46,134 సీట్లు నిండాయి. ఈసారి అది 47,729కి పెరిగాయి. కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చేరేవారు తగ్గడంతో పాటు ఈసారి రాష్ట్రంలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో కన్వీనర్ కోటాలో చేరినవారి సంఖ్య పెరిగిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రముఖ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు తర్వాత జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు దక్కడంతో వారు ఇక్కడి సీట్లను వదులుకున్నారు. అందుకే గత ఏడాది స్పాట్ ప్రవేశాల్లో 3,063 మంది చేరగా ఈసారి వారి సంఖ్య 4,533కు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
‣ యాజమాన్య కోటా లెక్కలు తేలేది ఎప్పుడు?
యాజమాన్య కోటా(బి కేటగిరీ) కింద ఎందరు చేరారన్నది రాష్ట్ర ఉన్నత విద్యామండలి తేల్చాలి. ఆయా కళాశాలలు పంపిన విద్యార్థుల సమాచారం, ర్యాంకులు తదితర వివరాలను పరిశీలించి విద్యామండలి అధికారులు ఆమోదం(ర్యాటిఫికేషన్) తెలిపాలి. ఈసారి 16వేల నుంచి 18వేల మంది చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
‣ 2015 నుంచి ఎంసెట్ కన్వీనర్ కోటాలో భర్తీ అయిన సీట్లు
సంవత్సరం కళాశాలలు మొత్తం సీట్లు భర్తీ అయినవి
2016 210 71,066 54,064
2017 201 66,889 50,258
2018 190 66,079 48,669
2019 183 65,565 46,134
2020 184 70,141 47,729