• facebook
  • whatsapp
  • telegram

వైద్యఆరోగ్య శాఖ‌లో 1400 ఖాళీలు

500 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు పదోన్నతి

ఏటా రెండుసార్లు నియామకాలు

భ‌ర్తీకి వైద్య శాఖ స‌న్నాహాలు

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ) పరిధిలోని ఆసుపత్రుల్లో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో.. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు, ఇప్పటివరకూ భర్తీకి నోచుకోని 900 వైద్య పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్యసేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ నిర్వహించాలనే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆదేశాలతో పదోన్నతులు, భర్తీ ప్రక్రియపై టీవీవీపీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

 

ఐదేళ్లుగా ఎదురుచూపులు

టీవీవీపీలో గత ఐదేళ్లుగా వైద్యుల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. పీజీ డిప్లొమా స్పెషాలిటీ వైద్యవిద్య పూర్తిచేసిన వైద్యులకు పదోన్నతులపై తాజాగా ప్రభుత్వం నుంచి స్పష్టత లభించడంతో.. సత్వర చర్యలపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. పదోన్నతులకు అర్హులైన సుమారు 500 మంది వైద్యుల సమాచారాన్ని మూడు నాలుగు రోజుల్లో ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు. పదోన్నతుల ప్రక్రియను కౌన్సెలింగ్‌ విధానంలో చేపట్టనున్నారు. అనుభవం, అర్హత ప్రాతిపదికన ఒక్కొక్కరిని పిలిచి, ఏఏ ఆసుపత్రుల్లో వారికి సంబంధించిన స్పెషాలిటీ పోస్టులు ఖాళీలున్నాయో ప్రదర్శిస్తారు. భార్యాభర్తలు, తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారి కేటగిరీల్లో వైద్యులకు తొలి అవకాశమిస్తారు. కౌన్సెలింగ్‌లో తమకు నచ్చిన ప్రదేశంలో పదోన్నతి ద్వారా పోస్టింగ్‌ రాకపోతే.. అభ్యర్థి పదోన్నతిని ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అభ్యర్థి తన కెరీర్‌లో ఇలా రెండుసార్లు పదోన్నతిని తిరస్కరిస్తే.. భవిష్యత్తులో పదోన్నతులకు అర్హత కోల్పోతారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

 

‣ కోరుకున్న చోటుకు వెళ్లాల్సిందే

పదోన్నతులతో ఒకసారి వైద్యుడు పోస్టింగ్‌ పొందిన తర్వాత సంబంధిత ఆసుపత్రిలో చేరకుంటే కఠినచర్యలు తీసుకోవాలని వైద్యశాఖ ఆదేశాలు జారీచేసింది. గతంలో పోస్టింగులు పొందిన తర్వాత దాదాపు 200 మందికి పైగా వైద్యులు ఆయా ఆసుపత్రుల్లో ఉద్యోగాల్లో చేరలేదు. ‘‘పదోన్నతుల నిర్ణయం పీజీ డిప్లొమా వైద్యులకు శుభవార్తే. పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీ వైద్యులకు ఎటువంటి అన్యాయం జరగకుండా 33:67 నిష్పత్తిలో పదోన్నతుల్లో స్థానం కల్పిస్తాం. మరో 4 వారాల్లోపు ఈ ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు చేస్తున్నాం. అనంతరం ఖాళీలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తాం’’ అని రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు.

 

‣ ఇకపై ఎప్పటికప్పుడే భర్తీ

నాలుగేళ్ల క్రితం వెలువరించిన నియామక ప్రకటన పోస్టులు నేటికీ భర్తీ కాలేదు. దీని కోసం ప్రభుత్వం వైద్య నియామక మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలి ఆధ్వర్యంలో ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏటా వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సుమారు 100 మంది పదవీ విరమణ పొందుతుంటారు. ఈ ఖాళీలను ఆరు నెలలకు ఒకసారైనా గుర్తించి, వెంటనే నియామక ప్రకటన ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

Posted Date : 16-02-2021 .