* 18న మంత్రులు, 19న యాజమాన్యాలతో భేటీ
* విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలను ఫిబ్రవరి 1 నుంచి తెరిచేందుకు కసరత్తు మొదలైంది. దీనిపై జనవరి 18న సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించారు. ఆమె జనవరి 12న విద్యాశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు 18న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. జనవరి 19న ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్య సంఘాలతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు మంత్రి వివరించారు. తరగతులవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి జనవరి 20లోగా అందజేయాలని అధికారులను కోరారు. విద్యాసంస్థలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను కలెక్టర్ల ద్వారా రూపొందించాలని ఆదేశించారు. వెంటనే విద్యా కాలపట్టికలను విడుదల చేయాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.