* రెండు వారాల్లో పరీక్ష నిర్వహించాలి
ఈనాడు, హైదరాబాద్: జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టుల రాత పరీక్షల్లో అర్హత సాధించిన మహిళలకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్).. విద్యుత్తు స్తంభం(పోల్) ఎక్కే పరీక్షను నిర్వహించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో లింగ వివక్ష చూపడం తగదని, రాత పరీక్షల్లో అర్హత సాధించిన మహిళలకు రెండు వారాల్లో పోల్ ఎక్కడానికి సంబంధించిన పరీక్షను నిర్వహించాలని ఎస్పీడీసీఎల్ను ఆదేశించింది. అదేవిధంగా జేఎల్ఎం నియామకాల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. గతేడాది సెప్టెంబరులో జారీ చేసిన ఉద్యోగ ప్రకటన ఆధారంగా జేఎల్ఎం రాత పరీక్షల్లో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులకు పోల్ ఎక్కే పరీక్ష నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై వి.భారతి, బి.శిరీషలు అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి, ఎస్పీడీసీఎల్ తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదప్రతివాదాలను కోర్టుకు వినిపించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. రెండు వారాల్లో పోల్ ఎక్కే పరీక్ష నిర్వహించాలని ఎస్పీడీసీఎల్ను ఆదేశిస్తూ విచారణను ముగించింది.
జూనియర్ లైన్మెన్ నియామకాల్లో లింగ వివక్ష తగదు
Posted Date : 03-12-2020 .