ఈనాడు, దిల్లీ: విద్యార్థులు ఎక్కువ మొత్తంలో కట్టిన రుసుములను వైద్య కళాశాలలు తిరిగి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 22న స్టే విధించింది. వైద్య కళాశాలల్లో రుసుముల చెల్లింపునకు సంబంధించి 2017లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాటిని సవాల్ చేస్తూ నారాయణ, పిన్నమనేని సిద్ధార్థ, ఎన్నారై వైద్య కళాశాలలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రభట్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 22న దీనిపై విచారణ చేపట్టింది. వైద్య కళాశాలల తరపున సీనియర్ న్యాయవాది కె.వి.విశ్వనాథన్, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రుసుముల నియంత్రణ కమిటీ, విద్యార్థులకు నోటీసులు జారీ చేసింది. వైద్య కళాశాలలు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయాలని ఆదేశించింది. విచారణను మార్చి 24కి వాయిదా వేసింది.
వైద్య విద్యార్థుల రుసుములు తిరిగి చెల్లింపుపై కోర్టు స్టే
Posted Date : 23-02-2021 .