• facebook
  • whatsapp
  • telegram

పాత విద్యార్థులే అత్యధికం

దరఖాస్తుదారుల్లో 53 శాతం మంది వారే
 1980లో బీటెక్‌ పూర్తయినా పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం (2020-21)లో ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో చేరేందుకు సీట్ల కోసం దశాబ్దాల క్రితం అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) పూర్తి చేసినవారూ పోటీ పడుతున్నారు. పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న వారిలో సగానికిపైగా ఇలాంటి విద్యార్థులే ఉండటం విశేషం. పాత విద్యార్థుల్లో ఎక్కువమంది 2018, 2019లలో యూజీ పూర్తిచేసిన వారున్నా.. 1995లో బీటెక్‌ పూర్తి చేసినవారూ ఉండటం గమనార్హం. 1980లో బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఒకరు ఇప్పుడు ఎంటెక్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు దరఖాస్తు చేయడం విశేషం. కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ధ్రువపత్రాల పరిశీలన సోమవారంతో ముగిసినా.. తాజాగా డిసెంబ‌రు 4 వరకు గడువు పొడిగించారు.

ఇప్పటివరకు 8,597 మంది దరఖాస్తు
కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఇప్పటివరకు మొత్తం 8,597 మంది అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించారు. వీరిలో 4,558 మంది (53 శాతం) 2019-20 విద్యా సంవత్సరం, అంతకంటే ముందు యూజీ పూర్తయిన సీనియర్లే. 2019-20 విద్యాసంవత్సరంలో చదువు పూర్తయి.. ఈ ఏడాది పట్టా పొందినవారు 4,039 మందే ఉన్నారు. గతంలో చదువు పూర్తయిన తర్వాత పీజీ చేయాలన్న ఆసక్తి ఉన్నా ఉద్యోగంలో చేరడమో, ఇతర కారణాల వల్లనో చేరనివారు ఇప్పుడు తమ కలను నిజం చేసుకునేందుకు ముందుకొచ్చి ఉండవచ్చని ఆచార్యులు చెబుతున్నారు. ‘బీఆర్క్‌ చేసి ఆర్కిటెక్టులుగా పనిచేసినవారూ విద్యార్హతను మెరుగుపరుచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు’ అని పీజీఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య రమేశ్‌బాబు తెలిపారు. పీజీ చేస్తే కళాశాలల్లో అధ్యాపకుడిగా చేరొచ్చన్న ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.

Posted Date : 02-12-2020 .