• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ కొత్త కోర్సులపై అవ‌గాహ‌న లోపం   

* కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లాంటి వాటిల్లో మిగిలిన సీట్లు
* మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీఎస్‌ఈకే  ప్రాధాన్యం

ఈనాడు - అమరావతి: ఇంజినీరింగ్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో కొత్త కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. కోర్సులపై అవగాహన లేకపోవడం, కళాశాలల్లో వాటిని బోధించే అధ్యాపకులు ఉంటారో లేదో అనే సందేహం, భవిష్యత్తులో ఉద్యోగాలు లభిస్తాయో లేదోననే అనుమానాలతో చాలా మంది విద్యార్థులు వీటి ఎంపికకు దూరంగా ఉన్నారు. సంప్రదాయబద్ధంగా ఎంచుకునే కంప్యూటర్‌సైన్స్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ)కే ప్రాధాన్యమిచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ లాంటి వాటిపై అధికారులు, విద్యా సంస్థలు పెద్దగా ప్రచారం చేయకపోవడంతో వీటిపై ఉండే అవకాశాలపై ఇప్పటికీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సందిగ్ధత నెలకొంది.
* ఈ కోర్సులను చదివితే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి? ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అవకాశాలున్నాయి? అనే దానిపై ఇప్పటి వరకు ఒక్క అవగాహన సదస్సు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు ఇచ్చినా విద్యార్థులు పలు అనుమానాలతో వీటిని ఎంచుకోవడం లేదు. ఈ ఏడాది ఈ కోర్సులకు డిమాండ్‌ ఉంటుందని కళాశాలలు భావించినా అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి.

కోర్సుల కోడింగ్‌ల్లోనూ సందేహాలు..
కొత్త కోర్సుల ఎంపికకు కౌన్సెలింగ్‌లో ఇచ్చిన కోడ్‌లు విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నాయి. సీఎస్‌ఈ(సైబర్‌ సెక్యూరిటీ) ఉంటే దీన్ని సీఎస్‌సీగా..  సీఎస్‌ఈ(డేటా సైన్స్‌)ను సీఎస్‌డీగా, సీఎస్‌ఈ(కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌)ను సీఎస్‌ఎం కోడ్‌లతో చూపారు. దీంతో కొందరు విద్యార్థులకు వీటిపై అస్పష్టత  ఏర్పడింది.
సీఎస్‌ఈపైనే మ‌క్కువ‌..
కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌లో 22,672 సీట్లు ఉండగా.. 93.95శాతం భర్తీ అయ్యాయి. కొత్త (ఎమర్జింగ్‌) కోర్సుల్లో మాత్రం 65శాతం లోపే నిండాయి. కృత్రిమ మేధ, డేటా సైన్స్‌లో 1,533 సీట్లు ఉండగా ఇందులో 980 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లో 184 ప్రవేశాలకు అవకాశం ఉండగా 85 మందే దీన్ని ఎంచుకున్నారు.

కోర్సుల కోడ్‌ మార్పు చేయండి - కేవీకే రావు
ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో కొత్త కోర్సులకు ఇస్తున్న కోడ్‌పై విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో వాటిని ఎంచుకోవడం లేదని, దీన్ని రెండో విడత కౌన్సెలింగ్‌కు మార్పు చేయాలంటూ అధికారులకు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సాంకేతిక విద్యా సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఎస్‌ఎఫ్‌టీఐ) ప్రధాన కార్యదర్శి కేవీకే రావు లేఖ రాశారు. కంప్యూటర్‌ సైన్స్‌లో కొత్త కోర్సుల్లా వాటిని చూపించాలని, వీటిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని కోరారు.

Posted Date : 19-01-2021 .