• facebook
  • whatsapp
  • telegram

ప్రత్యక్ష తరగతులతో నాణ్యమైన విద్య 

నిరంతర విద్యతోనే బాల్య వివాహాలకు అడ్డుకట్ట 

తెలుగు రాష్ట్రాల్లో యంగ్‌లైవ్స్‌ ఇండియా అధ్యయనం 

 

 

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ విద్యతో నిరంతర చదువులు కొనసాగించడం ద్వారా నాణ్యమైన విద్య అసాధ్యమని యంగ్‌లైవ్స్‌ ఇండియా అధ్యయనం పేర్కొంది. కరోనా కారణంగా విద్యాభ్యాసంలో జరుగుతున్న అవాంతరాలతో బాల్యవివాహాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని అరికట్టేందుకు పంచాయతీరాజ్‌ సంస్థలు, చైల్డ్‌లైన్‌ సంయుక్తంగా చర్యలు తీసుకోవడంతోపాటు దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించింది. ‘‘దేశంలో అసహాయ పరిస్థితుల్లోని బాలికలు, యువతులకు సహాయం’’ అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన ఆ సంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది. కొవిడ్‌ ప్రభావం నుంచి బాలికలు, యువతులను రక్షించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసి అమలు చేయాలని, ఈ విషయాన్ని విస్మరిస్తే లింగ సమానత్వంలో దేశం మరో రెండు దశాబ్దాల పాటు వెనుకబడుతుందని పేర్కొంది. ఈ ప్రణాళికలను సత్వరమే అమలు చేయాలని వెల్లడించింది. 

 

సర్వేలో వెల్లడైన విషయాలు 

పేద కుటుంబాల బాలికలు ఉన్నత విద్యకు దూరమయ్యారు. 18-19 ఏళ్ల యువతలో 39 శాతం మంది బాలికలు, 31 శాతం మంది చదువులు మానేశారు. 

ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రత్యక్ష, ఆన్‌లైన్‌ చదువులకు దూరంగా ఉన్నారు. వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారే. 

గత నవంబరు నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరిచినా నాణ్యమైన విద్య అందలేదు. రెండోదశకు ముందుగా పాఠశాలలు మూతపడటం, పరీక్షలు వాయిదా వేయడంతో పిల్లల చదువులపై మరింత ప్రభావం పడింది. 

సర్వేలో 18, 19 ఏళ్ల బాలికలను తీసుకుంటే వీరిలో 39 శాతం చదువుకోవడం లేదని, వీరిలో 46 శాతం మందికి అప్పటికే వివాహాలైనట్లు వెల్లడైంది. వీరిలో కేవలం 6 శాతం బాలికలు చదువు కొనసాగిస్తున్నట్లు అధ్యయనం గుర్తించింది. 

కొవిడ్‌ కారణంగా ప్రతి పది కుటుంబాల్లో ఎనిమిదింటి ఆదాయం గణనీయంగా తగ్గింది. గ్రామాల్లోని పేద కుటుంబాలపై ఆర్థిక భారం ఎక్కువగా ఉంది. 

 

ఇవీ సూచనలు 

లైంగిక అసమానతలు లేకుండా మహమ్మారి సమయంలో అందరికీ విద్య అందుబాటులో ఉండేలా ఎక్కువ నిధులు ఖర్చు చేయాలి. 

కరోనా రెండోదశ ప్రభావం నేపథ్యంలో నాణ్యతతో కూడిన దూరవిద్య అందరికీ అందుబాటులో ఉండాలి. కొవిడ్‌తో బాలికలు, బాలుర విద్యలో అవాంతరాలు వచ్చాయి. వీరి ట్యూషన్లు, అదనపు స్టడీ మెటీరియల్‌ కోసం ప్రభుత్వం నిధులు వెచ్చించాలి. 

పాఠ్యాంశాల్లో నైపుణ్య విద్యను చేర్చాలి. డ్రాపౌట్లను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి. 

విజయవంతంగా చదువులు పూర్తిచేసిన బాలికలకు నగదు బదిలీ పథకాలు అమలు చేసి, ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలి. 

దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానం కింద 3-18 ఏళ్ల విద్యార్థులకు తప్పనిసరి విద్య అందించాలి. కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థ పటిష్ఠానికి అదనపు నిధులు కేటాయించాలి. 

గృహహింస కేసుల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలి. 

Posted Date : 11-06-2021