రెండింటికీ కలిపి ఈసారి అందింది 1,404 దరఖాస్తులే..
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఈసారి ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చాయి. ఎంటెక్‌లో చేరేందుకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) ర్యాంకర్లు, ఎంఫార్మసీలో ప్రవేశం పొందేందుకు గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) ర్యాంకర్లు దరఖాస్తు చేసుకుంటారు. ఈ కోర్సుల్లో చేరడానికి మూడు నెలలపాటు దరఖాస్తుకు అవకాశం ఇవ్వగా.. 1,404 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) ర్యాంకర్లు 211 మందే ఉన్నారు. అసలు గేట్లో ఉత్తీర్ణులైన వారు తగ్గారా? లేకుంటే ఆ ర్యాంకులతో ఐఐటీలు, ఎన్ఐటీల్లో చేరాలనుకుంటున్నారా? అన్న అంశం తెలియడంలేదని పీజీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య రమేష్‌బాబు అభిప్రాయపడ్డారు. కన్వీనర్ కోటా కింద దాదాపు 120 కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో కలిపి 8 వేల వరకు సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.