• facebook
  • whatsapp
  • telegram

తగ్గిన నిరుద్యోగరేటు

* తెలంగాణలో 1.5 శాతానికి పరిమితం
* సీఎంఐఈ నిరుద్యోగ సర్వే నివేదికలో వెల్లడి


ఈనాడు - హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగరేటు గణనీయంగా తగ్గింది. కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండేళ్ల తరువాత (0.9 శాతం) ఆ స్థాయిలో నిరుద్యోగ రేటు పడిపోయింది. నవంబరు నెలకు 1.5 శాతం ఉన్నట్లు భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) సర్వేలో వెల్లడైంది. గడిచిన డిసెంబరులో 2.3 శాతంగా నమోదైన తరువాత అత్యల్ప నిరుద్యోగ రేటు గతనెలలో నమోదైంది. కొవిడ్‌ సమయంలో నిరుద్యోగ రేటు అధికంగా నమోదైనప్పటికీ.. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అక్టోబరు నెలతో పోల్చితే దాదాపు 50 శాతం వరకు నిరుద్యోగ రేటు తగ్గినట్లు నివేదికలో వెల్లడైంది. అదేసమయంలో దేశవ్యాప్త నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. నవంబరు నెల నాటికి 6.26 శాతంగా ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఎక్కువగా 7.07 శాతంగా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా తగ్గి 6.51 శాతానికి పరిమితమైంది.
ఏడు రాష్ట్రాల్లో 2 శాతం లోపు...
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు 2 శాతం కన్నా తక్కువగా ఉంది. అత్యల్పంగా మేఘాలయ, తమిళనాడులో 1.1 శాతంగా ఉంది. కర్ణాటక (1.9), ఒడిశా(1.7), సిక్కిం(1.9), ఉత్తరాఖండ్‌(1.5), తెలంగాణ (1.5) రాష్ట్రాల్లోనూ తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. నిరుద్యోగ రేటు 20 రాష్ట్రాల్లో 10లోపు ఉండటం గమనార్హం. అయితే హరియాణాలో అత్యధికంగా 25.6 శాతం, రాజస్థాన్‌లో 18.6 శాతం, గోవాలో 15.9 శాతంగా ఉంది.
* ఏపీలో నవంబరు నెలకు నిరుద్యోగ రేటు 6 శాతంగా నమోదైంది.

Posted Date : 03-12-2020 .