• facebook
  • whatsapp
  • telegram

పది శాతం మించని విద్యార్థుల హాజరు  

గురుకులాల్లో విద్యార్థుల హాజరు పల్చగా
పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రుల వెనకడుగు
 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఓ పక్క కరోనా భయం.. మరోపక్క వరుస తుపాన్ల హెచ్చరికలు.. వెరసి రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల హాజరు పల్చగా ఉంటోంది. తరగతులు ప్రారంభించి వారం దాటుతున్నా ఎస్సీ, బీసీ గురుకులాల్లో పిల్లల హాజరు 10 శాతం కంటే తక్కువే ఉంది. బీసీ గురుకులాల సొసైటీ పరిధిలో 9, 10, ఇంటర్‌విద్యార్థులు 12,929 మంది చదువుకుంటుండగా న‌వంబ‌రు 30 నాటికి 1,200 మంది హాజరయ్యారు. వీరిలోనూ ఎక్కువగా 9, 10 తరగతులే వారే ఉన్నారు. ఎస్సీ గురుకులాల్లో మరీ 3 శాతం హాజరు నమోదైంది. 42 వేల విద్యార్థులు ఉండగా న‌వంబ‌రు 30 నాటికి సుమారు 1200 మంది వచ్చారు. ఎస్టీ గురుకులాల్లో 52 శాతం హాజరవుతున్నారు. గిరిజన గురుకులాలు మారుమూల ప్రాంతాల్లో ఉండటం, అక్కడ కరోనా ఉద్ధృతి తక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు పిల్లలను పంపిస్తున్నారు. 
 

15 గురుకులాల్లో సున్న!
రాష్ట్రంలో 87 బీసీ గురుకులాలుండగా 15 విద్యాసంస్థల్లో ఒక్క విద్యార్థీ హాజరు కాలేదు. నివర్‌తుపాను దృష్ట్యా చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకులాలను ఎన్డీఆర్‌ఎఫ్‌బృందాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. 29 నుంచి ఖాళీ చేస్తున్నా.. 30న‌కూడా విద్యార్థులు చేరలేదు. విద్యార్థుల గైర్హాజరుపై గురుకులాల ప్రధానోపాధ్యాయులు ఆరా తీయగా కరోనా ప్రభావం తగ్గాకే పంపిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటర్‌విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన్‌ఆన్‌లైన్‌విధానంలో ఇప్పటికే పూర్తి కావడంతో తరగతులకు రావడం లేదని తెలుస్తోంది.
 

Posted Date : 30-11-2020 .