• facebook
  • whatsapp
  • telegram

ఏకాగ్ర‌త‌కు ఏమిటి ఉపాయం?

 'ప‌రీక్షా పే చ‌ర్చా'లో ప్ర‌ధాని మోదీని అడిగిన ఏపీ విద్యార్థిని

పొదిలి, న్యూస్‌టుడే: ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.పల్లవి ఎంపికై తన సందేహాలను వీడియో ద్వారా ప్రధాని ముందుంచింది. ‘కరోనా ప్రభావంతో ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పరీక్షలు దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నాం. భయాన్ని వీడి ఏకాగ్రతతో పరీక్షలు రాసేందుకు ఉపాయం చెప్పండ’ని ఆమె కోరింది. దానికి ప్రధాని స్పందించారు.

‣ పరీక్షలే జీవిత పరమార్థం కాదనీ, సుదీర్ఘ ప్రయాణంలో అవి చిన్న గమ్యాలు మాత్రమేనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ పేరుతో ఆయన వర్చువల్‌ విధానంలో ఏప్రిల్ 07న‌ మాట్లాడారు. కష్టంగా అనిపించే పాఠ్యాంశాలను వదిలిపెట్టేయకుండా ఉదయాన్నే వాటిని చదవాలని, కాస్త సులభంగా అనిపించేవాటిని రాత్రిపూటైనా చూసుకోవచ్చని చెప్పారు. ‘‘పరీక్షలంటే భయపడవద్దు. మనల్ని మెరుగుపరచుకునేందుకు ఉపకరించేవిగా వాటిని చూడండి. కొన్నిసార్లు సామాజిక, కుటుంబ వాతావరణం కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తుంది. ఒత్తిడి లేకపోతే విద్యార్థులు పరీక్షలను భారంగా భావించరు. కష్టంగా అనిపించిన సబ్జెక్టుల నుంచి దూరంగా పారిపోవద్దు. నా వరకు నేను కష్టమైన పనిని ఉదయాన్నే చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. సులభమైన పనుల్ని రాత్రి పొద్దుపోయాక చేస్తుంటాను’’ అని ప్రధాని చెప్పారు.

Posted Date : 08-04-2021