• facebook
  • whatsapp
  • telegram

ద‌ర‌ఖాస్తు నుంచి వీసా వ‌ర‌కు సేవ‌లు ఉచితం  

* వారంలో ఐదు రోజులపాటు అందించ‌నున్న‌ అమెరికన్‌ కార్నర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అమెరికా చదువు మరింత చేరువ కానుంది. ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సంస్థ‌ విద్యార్థుల‌కు పూర్తిసాయిలో సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేసేందుకు నిపుణులతో ప్రత్యేక వ్యవస్థ‌ను ఏర్పాటు చేస్తోంది. అమెరికన్‌ కార్నర్‌ పేరుతో ప్రస్తుతం అందిస్తున్న సేవలను విస్తృతం చేయనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని వై-యాక్సిస్‌ ఫౌండేషన్‌తో ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ ఒప్పందం చేసుకుంది. ఈ సేవలను మార్చి 5 నుంచి ప్రారంభించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా 40 నుంచి 50 వేలమంది విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్నారు. బోగస్ సంస్థ‌ల‌ బారినపడి పలువురు విద్యార్థులు నష్టపోతున్నారు. సరైన విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకోకపోవటంతో అక్కడికి వెళ్లాక కొందరు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో సరైన విద్యాసంస్థ‌లను ఎలా ఎంచుకోవాలి? ఉండాల్సిన అర్హతలు ఏమిటి? ఫీజుల చెల్లింపు తీరు తెన్నులేంటి? విద్యార్థి వీసా (ఎఫ్‌-1) కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తదితర అంశాల్లో విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు అమెరికా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సంస్థ‌ ఏర్పాట్లు చేస్తోంది. 

* చలో జూబ్లీహిల్స్‌  

అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు హైదరాబాద్‌ బేగంపేటలోని విల్లామేరీ కళాశాలలో అమెరికన్‌ కార్నర్‌ పేరుతో అమెరికన్‌ కాన్సులేట్‌ ఇప్పటికే ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. కానీ, దాని సేవలు నామమాత్రంగానే ఉండేవి. ఇక్కడ ప్రతి గురువారం విద్యార్థులకు విద్యా సంస్థ‌ల ఎంపిక దగ్గర నుంచి వీసా దరఖాస్తు చేసుకునే విధానం వరకు సలహాలు ఇస్తుంటుంది. అయితే కరోనా ప్రభావంతో కొన్ని నెలలుగా ఆ సేవలు కూడా అందుబాటులో లేవు. ఇక నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36లో ఉన్న వై-యాక్సిస్‌ కార్యాలయంలో వారంలో 5 రోజుల పాటు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉచితంగానే ఈ సేవలను పొందవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిపుణులు అందుబాటులో ఉంటారు. విద్యా సంస్థ‌లకు సంబంధించి సమాచార పత్రాలు తదితరాలు కూడా అందుబాటులో ఉంచనుంది.

Posted Date : 26-02-2021