* తమిళనాడు పర్యటనలో మోదీ
ఈనాడు డిజిటల్, చెన్నై: తమిళం సహా ప్రాంతీయ భాషల్లో వైద్య, ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీని వల్ల యువతకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పుదుచ్చేరి పర్యటన అనంతరం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చేరుకుని కోవైలో పూర్తయిన వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్, తమిళనాడు పార్టీ ఎన్నికల బాధ్యుడు సీటీ రవి, సహ బాధ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, భాజపా సీనియర్ నేత హెచ్.రాజా పాల్గొన్నారు.