• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిగ్రీ తర్వాత.. దారి ఎటు?

ఉన్న‌త విద్య‌, ఉద్యోగానికి డిగ్రీయే అర్హ‌త‌

 

 

ఉన్నత విద్య, ఉద్యోగం- రెండింటికీ బ్యాచిలర్‌ డిగ్రీ అర్హత సరిపోతుంది. డిగ్రీ తర్వాత ఉన్న దారులన్నీ తెలుసుకుని అందులో తమకు నప్పేవేమిటో గుర్తించడం ప్రధానం. అలాగే కోర్సు ప్రథమ సంవత్సరంలో ఉన్నప్పుడే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశగా అడుగులు వేయడం ముఖ్యం. ముందుగానే ఒక నిర్ణయానికి వస్తే.. మూడేళ్ల ప్రణాళికతో మేటి ఫలితాలను అందుకోవచ్చు. సమయం వృథా కాకుండా చిన్న వయసులోనే చక్కని కెరియర్‌ సొంతం చేసుకోవచ్చు! 

 

మన దేశంలో ఎక్కువ మంది విద్యార్థులు సాంప్రదాయిక డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీల్లోనే చేరుతున్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులతో పోలిస్తే తక్కువ వ్యవధిలో, తక్కువ వ్యయంతో పూర్తి కావడం జనరల్‌ డిగ్రీ కోర్సుల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సాధారణ డిగ్రీ కోర్సులు చదువుతోన్న విద్యార్థుల ముందు ముఖ్యంగా 3 మార్గాలున్నాయి. అవి... 

1) డిగ్రీలో చదివిన కోర్సులకు అనుబంధంగా ఉన్నత విద్యలో కొనసాగడం, 

2) వృత్తివిద్యా (ప్రొఫెషనల్‌) కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా... మొదలైనవాటిలో చేరడం, 

3) డిగ్రీ అర్హతతో ఉండే ఉద్యోగాలకు ప్రయత్నించడం. 

వీటిలో ఏదో ఒకదాన్ని నిర్ణయించుకుని అందుకనుగుణంగా ఇప్పటి నుంచే సన్నద్ధమైతే తర్వాతి లక్ష్యాన్ని కాలయాపన లేకుండా సాఫీగా చేరుకోవచ్చు. చదువుతోన్న కోర్సులకు కొనసాగింపుగా ఉన్నత విద్యలో చేరాలనే లక్ష్యం ఉన్నవారు డిగ్రీ సిలబస్‌ బాగా చదువుకుంటే సరిపోతుంది. ప్రొఫెషనల్‌ కోర్సులు చదవాలనుకున్నవారూ, ఉద్యోగాలు ఆశిస్తోన్నవారూ ఆయా పరీక్షలకు అనుగుణంగా అదనపు అంశాల్లో ప్రావీణ్యం సాధించాలి.

 

అనుబంధ చదువులు

డిగ్రీలో చదివిన సబ్జెక్టుల నుంచి ఏదోఒకదాన్ని ఉన్నత విద్య (ఎంఏ/ఎంఎస్‌సీ/ఎంకాం)లోనూ కొనసాగించడం అనుబంధ చదువుల కిందికి వస్తాయి. అంటే హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, బోటనీ లాంటి సబ్జెక్టులను పీజీలో చదువుకోవడం. ఈ తరహా లక్ష్యం ఉన్నవారు డిగ్రీ చదువుతున్నప్పుడే ఏదైనా ఒక సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి పెంచుకుని అందులో రాణించడానికి కృషిచేయాలి. ఇలా ముందస్తు ప్రణాళికతో సన్నద్ధమైతే ప్రసిద్ధ విద్యాసంస్థల్లో సీటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువ.  సాధారణ విద్యాసంస్థలకూ, జాతీయ ప్రాధాన్యం ఉన్న విద్యాసంస్థలకూ కోర్సుల బోధన, అవకాశాల పరంగా ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కొన్ని జాతీయ సంస్థలు పీజీ కోర్సుల్లో చేరినవారికి ప్రతి నెలా రూ.5000/ రూ.8000 స్టైపెండ్‌ కూడా అందిస్తున్నాయి. అందువల్ల అవగాహనతో అడుగులేస్తే మేటి సంస్థల్లో సీటు ఖాయమవుతుంది. 

వివిధ ఐఐటీలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌ కోర్సులను ఎమ్మెస్సీ స్థాయిలో అందిస్తున్నాయి. ఈ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ సైతం అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నత చదువులకు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం లక్ష్యంగా చేసుకుని సన్నద్ధం కావచ్చు. 

సైన్స్‌ కోర్సులకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్, బెంగళూరు, ఐఐఎస్‌ఈఆర్‌లు; 

హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌కు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ; 

ఆంగ్లం, విదేశీ భాషలకు ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ పేరున్న సంస్థలు. 

ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మేటి చదువులకు వేదికలుగా నిలుస్తున్నాయి. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, తేజ్‌పూర్‌ యూనివర్సిటీ...మొదలైనవి ముందు వరుసలో ఉంటాయి. ఇవన్నీ జాతీయ సంస్థలు అందువల్ల స్థానిక రిజర్వేషన్లు వర్తించవు. ఆ సంస్థ ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రవేశాల్లో ప్రతిభే కొలమానం అవుతుంది. అందువల్ల ఇలాంటి విద్యా సంస్థల్లో సీటు పొందడానికి కృషి చేయాలి. 

 

ఉద్యోగానికి...

డిగ్రీ అర్హతతో ఎన్నో ఉద్యోగాలున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలు వీటిలో ముఖ్యమైనవి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్షకు ఎక్కువమంది పోటీ పడుతున్నారు. 

జాతీయ బ్యాంకుల్లో క్లర్క్, పీవో (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టులకు ఐబీపీఎస్‌ నిర్వహించే పరీక్షలకు ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్ర స్థాయిలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులకు తీవ్ర పోటీ ఉంటుంది. యూనిఫారం ఉద్యోగాలు ఆశించేవారికి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మంచి అవకాశం. రైల్వేలు ఖాళీలున్నప్పుడు స్టేషన్‌ మాస్టర్, గూడ్స్‌ గార్డు, క్లర్క్‌..తదితర పోస్టులను డిగ్రీ విద్యార్హతతో భర్తీ చేస్తున్నాయి. వీటిలో నచ్చినవాటిని ఎంపిక చేసుకుని ఇప్పటి నుంచే సన్నద్ధమైతే పోటీలో నిలవడానికి వీలవుతుంది. 

రైల్వే, బ్యాంక్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, ప్రభుత్వ బీమా కంపెనీలు...తదితర ఉద్యోగాలన్నీ దాదాపుగా ఒకే సిలబస్‌ ప్రాతిపదికన ఉంటాయి. అందువల్ల వీటన్నింటికీ కలిపి సన్నద్ధం కావచ్చు. గ్రూప్‌-1, సివిల్స్‌ లక్ష్యంగా ఉన్నవారు సమకాలీన అంశాలను అనుసరిస్తూ, లోకజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. 

 

వృత్తివిద్యా కోర్సులు

ప్రొఫెషనల్‌ కోర్సులంటే-  ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్‌...మొదలైనవి. డిగ్రీలో చదివిన గ్రూపులతో సంబంధం లేకుండా ఎవరైనా వీటికి పోటీ పడవచ్చు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 

వీరిలో ఎక్కువమంది ఎంబీఏకు ప్రాధాన్యమిస్తున్నారు. జాతీయ స్థాయిలో మేటి సంస్థలో మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరడానికి కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (క్యాట్‌)లో ప్రతిభ చూపడం తప్పనిసరి. ఈ స్కోరుతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లతోపాటు జాతీయ స్థాయిలో పేరొందిన ప్రభుత్వ సంస్థల్లో, బీ స్కూళ్లలో ప్రవేశం లభిస్తుంది. ఐఐఎంల్లో సీట్లు పరిమితంగానే ఉన్నప్పటికీ 80 పర్సంటైల్‌ సాధించివారు పేరున్న బిజినెస్‌ స్కూల్‌లో సీటు పొందవచ్చు. ఇలాంటి సంస్థల్లో చదువుకుంటే ఆకర్షణీయ వేతనంతో బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచి సన్నద్ధత ప్రారంభిస్తే గొప్ప సంస్థలో సీటు పొందడం సులువవుతుంది. 

ఎంసీఏలో చేరడానికి నిమ్‌సెట్‌పై దృష్టి సారించవవచ్చు. ఈ స్కోరుతో ఎన్‌ఐటీల్లో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు పొందవచ్చు. 

డిగ్రీ అనంతరం లా కోర్సుల్లో చేరాలనుకున్నవారికి జాతీయ స్థాయిలో దిల్లీ యూనివర్సిటీ మేటి సంస్థ. రాష్ట్రీయ సంస్థల్లో లాసెట్‌ ద్వారా అవకాశం లభిస్తుంది. 

బీఎడ్‌ విషయానికొస్తే... ఆర్‌ఐఈ, మైసూరు; అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం...మొదలైనవి బాగుంటాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌+ ఎంఎడ్‌ కోర్సులూ ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ఎడ్‌సెట్‌తో విశ్వవిద్యాలయాలు, ఐఏసీఈ కేంద్రాల్లో అవకాశం దక్కించుకోవచ్చు. ఇలా కోర్సుల వారీ టాప్‌ సంస్థల్లో సీటు దక్కాలంటే ముందస్తు సన్నద్ధత తప్పనిసరి. 

 

జాతీయ ప్రవేశపరీక్షలు...

సైన్స్‌ కోర్సుల్లో పీజీ చదవాలనుకునేవారు దృష్టి సారించాల్సిన పరీక్ష జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎమ్మెస్సీ (జామ్‌). ఇందులో సాధించిన మార్కులతో ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఎన్‌ఐటీల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సుల్లో అవకాశం లభిస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, బయలాజికల్‌ సైన్స్, బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌...తదితర కోర్సుల్లో చేరవచ్చు. సాధారణ డిగ్రీతో ఐఐటీ కల నెరవేర్చుకోవడానికి జామ్‌ చక్కని దారి. భవిష్యత్తులో పరిశోధనల దిశగా అడుగులేయవచ్చు. 

బయోటెక్నాలజీలో భవిష్యత్తును కోరుకునేవారు కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (సీబ్‌) పై దృష్టి సారించాలి. జేఎన్‌యూ ఆధ్వర్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. జేఎన్‌యూ, హెచ్‌సీయూతోపాటు 40కుపైగా సంస్థల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. కోర్సుల్లో చేరినవారికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ప్రతి నెల రూ.5000 స్ట్టైపెండ్‌ చెల్లిస్తుంది. 

ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)- కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్, మాస్టర్‌ ఆఫ్‌ మ్యాథమ్యాటిక్స్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు నెలకు రూ.5000 చొప్పున స్ట్టైపెండ్‌ అందుకోవచ్చు. ఇందుకోసం ఐఎస్‌ఐ ఏటా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది.

జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (జెస్ట్‌)తో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ సంస్థలన్నీ కేంద్రంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ  ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. స్టైపెండ్‌ సైతం చెల్లిస్తారు.

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ..మొదలైన సంస్థలు పీజీ స్థాయిలో మేటి కోర్సులు అందిస్తున్నాయి. 

 

ఒకటే పరీక్ష

కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ ఉమ్మడి పరీక్షతో ప్రవేశాలు నిర్వహించనున్నాయి. ఇది విద్యార్థులకు ఎంతో సౌకర్యం. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. ఇప్పటివరకూ సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు పేరుతో కొత్తగా ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు నిర్వహించేవారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా 45కు పైగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఒకే పరీక్షతో అవకాశం పొందవచ్చు.
 

Posted Date : 30-12-2020 .